భారతదేశ స్వాతంత్రోద్యమకారుడు, గదర్ ఉద్యమంలోనూ అగ్రభాగాన నిలిచిన గొప్ప దేశభక్తుడు రాస్ బిహారీ బోస్. మే 25, 1886న పశ్చిమ బెంగాల్‌లోని బర్దామన్ జిల్లా సుబల్దాహా గ్రామంలో జన్మించాడు. తండ్రి వినోద్ బిహారీ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అయితే.. రాస్ బిహారీ బోస్‌కి చిన్నతనం నుంచే దేశభక్తి భావాలుండేవి. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే విప్లవోద్యమంలో చేరాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. జాతీయవాద స్ఫూర్తితో సైన్యంలోకే వెళ్లాలని భావించారు కానీ… డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే బెంగాల్ విభజన ఈయన మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఘటనతో ఎంతో కలత చెంది, ఉద్యోగానికి రాజీనామా చేసి, విప్లవకారుడిగా మారిపోయారు. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ హార్డింజ్‌కి వ్యతిరేకంగా పనిచేయడంతో మరణశిక్ష విధించారు. డిసెంబర్ 23, 1912న ఢిల్లీలో జరిగిన ఓ ఊరేగింపులో పాల్గొన్న వైస్రాయ్‌పై బాంబు దాడికి దిగారు. ఈ దాడిలో వైస్రాయ్ తప్పించుకోగా… కొందరు మరణించారు, మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఆంగ్లేయులు అమీర్ చంద్, అవధ్ బిహారీ, బాలముకుంద్‌లను పట్టుకొని ఉరితీశారు. కానీ రాస్ బిహారీ బోస్ అత్యంత చాకచక్యంగా జపాన్‌కి వెళ్లిపోయారు. మే 12, 1915న రాజా పీఎన్‌టీ ఠాగూర్ అనే మారు పేరుతో జపాన్‌కి వెళ్లిపోయారు. నేతాజీ లాగా మారు వేషాలు వేయడంలో రాస్ బిహరీ బోస్ కూడా దిట్ట అని చెబుతుంటారు. అయితే.. జపాన్‌కి వెళ్లిపోవాలని బిహారీ బోస్‌కి సలహా ఇచ్చింది మాత్రం లాలా లజపతిరాయ్.
జపాన్ చేరుకున్న తర్వాత అక్కడి విప్లవ వర్గాలు రాస్ బిహారీ బోస్‌కు ఆశ్రయం కల్పించాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన తన నివాసాన్ని చాలాసార్లు మార్చుకుంటూ వెళ్లారు. అత్యంత రహస్యంగా జపాన్‌లో ఉంటూ పనిచేశారు. ఓ లెక్క ప్రకారం ఏకంగా 17 సార్లు రాస్ బిహారీ తన నివాసాన్ని మార్చాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత జపాన్ పౌరసత్వాన్ని పొంది, జపాన్ భాషను నేర్చుకున్నారు. ఆ తర్వాత పాత్రికేయునిగా, రచయితగా మారి ‘‘న్యూ ఆసియా’’ అన్న పత్రికను కూడా నడిపారు. జపాన్ కేంద్రంగా భారతదేశంలో జరుగుతున్న వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తూ, పుస్తకాలను రచించారు.
ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపన…
1942 మార్చి మాసంలో బిహారీ బోస్ జపాన్ కేంద్రంగా ‘‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’’ని స్థాపించారు. భారత స్వాతంత్రం కోసం ఓ సైన్యాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా ఆయన కొందరికి పంపారు. ఈ ప్రతిపాదనే నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపనకు ప్రాతిపదిక అయ్యింది. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ సదస్సుకు బిహారీ బోస్ మరో మహా దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్‌ను జపాన్‌కి ఆహ్వానించారు. అక్కడ ఇద్దరూ సమాలోచనలు జరిపారు. భారత దేశ స్వాతంత్ర చరిత్రలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు మద్దతుదారులుగా వీరిద్దరూ ప్రసిద్ధి చెందారు. బెర్లిన్ నుంచి సుభాష్ చంద్రబోస్ జపాన్ చేరుకున్నారు. అప్పుడు బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ పేరుతో నేషనల్ ఆర్మీని స్థాపించారు. దానికి సుభాష్ చంద్రబోస్‌ను అధ్యక్షునిగా నియమించారు. దీని తర్వాత నేతాజీ బ్రిటీషర్స్‌పై ఎంతలా విజృంభించారో అందరికీ తెలుసు.
రాస్ బిహారీ బోస్ జపాన్ మహిళనే వివాహం చేసుకున్నారు. అక్కడి పౌరసత్వమే పొందారు. చివరికి జనవరి 21,1945న తుదిశ్వాస విడిచారు. జపాన్ సర్కార్ వారిని ‘‘సెకండ్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్’’తో సత్కరించింది. మరోవైపు వీరి దేశభక్తి, ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం డిసెంబర్ 26, 1967న ఆయన గౌరవార్థం తపాలా స్టాంప్ విడుదల చేసింది. బెంగాల్‌లోని ఓ వీధికి ఆయన గౌరవార్థం రాస్ బిహారీ అవెన్యూ అని పేరు కూడా పెట్టింది.
జపాన్ ప్రజలకు రాస్ బిహారీ బోస్ అద్భుతమైన కానుకను కూడా అందించారు. భారతదేశ తరహా చికెన్ కూరను జపాన్ ప్రజలకు పరిచయం చేశారు. నేడు ఆ దేశంలో అత్యంత ఖరీదైన ఆ కూర ‘‘బోస్ ఆఫ్ నకమురయా’’ పేరిట అత్యంత ప్రసిద్ధిలో వుంది. ప్రస్తుతం జపాన్‌లో వున్న అత్యంత ఖరీదైన రెస్టారెంట్లలో ఈ కూరను వడ్డిస్తున్నారు కూడా. దీనిని ‘‘టేస్ట్ ఆఫ్ లవ్ అండ్ రివల్యూషన్’’గా అభివర్ణిస్తారు.