తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులు 44మంది ఉన్నట్లు లెక్క తేలింది. టీటీడీలో విద్యాసంస్థలు మినహా మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్నవారి వివరాలపై విజిలెన్స్ విభాగం ఆరా తీసింది. త్వరలోనే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీరి సర్వీసు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
డిసెంబరు మొదటి వారంలో టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న స్నేహలత.. దేవస్థానం వాహనంలో చర్చికి వెళ్లడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తులను ఆలయాలు, ఇతర ముఖ్య విధులకు దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో చేపట్టిన అధ్యయనంలో ఇలాంటివారు 37మంది టీటీడీలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారని లెక్క తేలినట్లు సమాచారం.
2007కు ముందు అన్యమతస్తులపై నిషేధం లేనప్పుడు పలువురు రిజర్వేషన్ కోటా కింద టీటీడీలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అయితే వీరికి విధులు కేటాయించే విషయంలో మాత్రం నిబంధనలున్నాయి. ఆ ప్రకారం వీరికి ఆలయాలకు సంబంధించిన విధులు కాకుండా, విద్యా సంస్థలు, ఇతర అప్రాధాన్య విభాగాల్లో మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ, కొన్నేళ్లుగా ఈ నిబంధనను టీటీడీ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. అలాగే అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని 2007లో టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆ తర్వాత కూడా ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పరిశీలనలో తేలినట్లు సమాచారం.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో )