Home News ఉచిత విద్య ముసుగులో అమాయక వనవాసి పిల్లలను క్రైస్తవం లోకి మతమార్పిడి చేస్తున్న పాస్టర్

ఉచిత విద్య ముసుగులో అమాయక వనవాసి పిల్లలను క్రైస్తవం లోకి మతమార్పిడి చేస్తున్న పాస్టర్

0
SHARE
క్రైస్తవ మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్‌లో విచారణ జరుపుతున్న ఐసీడీఎస్ అధికారులు

మారుమూల తండాల్లోని అమాయక గిరిజన కుటుంబాలను ప్రలోభాల ఆశ కల్పించి, వారి పిల్లలను ఓ పథకం ప్రకారం మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ మిషనరీ సంస్థ నిర్వాహకుడి ఉదంతం బట్టబయలైంది. గుట్టుగా ఈ తతంగం సాగిస్తున్న తీరు గురించి ఫిర్యాదులు అందడంతో ఐసీడీఎస్ అధికారులు గురువారం దాడి చేయడంతో ఈ బాగోతం వెలుగుచూసింది.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో పోలీస్ క్యాంప్‌కు సమీపంలో రెండు సంవత్సరాల క్రితం ‘ఇండియన్ జిప్స్ డెవలప్‌మెంట్ ట్రస్టు’ పేరుతో ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌ను నెలకొల్పాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు చాలాకాలం క్రితం నుండి ఆర్మూర్‌లోని ఓ చర్చిలో పాస్టర్‌గా కూడా కొనసాగుతున్నాడు. డిచ్‌పల్లి మండలంలోని ఆయా గిరిజన తండాలను సందర్శిస్తూ, తమ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తామని అమాయక గిరిజనులను నమ్మించి పిల్లలను చైల్డ్ హోమ్‌లో చేర్పించుకునేవాడు. ఇలా సుమారు 30మంది వరకు 12 నుండి 15సంవత్సరాల లోపు వయస్సు గల బాలికలను చైల్డ్ హోమ్‌లో ఉంచి, అక్కడి నుండే ప్రభుత్వ పాఠశాలలకు పంపించేవాడు.

అయితే సదరు బాలికలకు క్రైస్తవ బోధనలు నూరిపోస్తూ, వారితో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించేవాడని తేటతెల్లమైంది. ఇళ్లకు వెళ్లిన సమయంలో తల్లిదండ్రులను కూడా క్రైస్తవ మతం గురించి వివరించాలని నూరిపోసేవాడని చైల్డ్ హోమ్‌లో ఆశ్రయం పొందిన పలువురు బాలికలు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించిన పలువురు స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ స్రవంతి గురువారం తన సిబ్బందితో డిచ్‌పల్లిలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చైల్డ్ హోమ్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించి, సదరు సంస్థను సీజ్ చేశారు. నిర్వహకుడు కోటేశ్వరరావుపై డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చైల్డ్ హోమ్‌లో ఉన్న 27మంది గిరిజన బాలికలకు మిషనరీ సంస్థ చెర నుండి విముక్తి కల్పిస్తూ, 17మందిని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చేర్పించారు. మరో పదిమందిని బాలసదన్‌కు పంపించారు.

గిరిజన బాలికలను భోజన, వసతి సౌకర్యాలతో కూడిన విద్యను అందిస్తామనే పేరుతో మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి రావడంతో తనిఖీలు నిర్వహించామని ఐసీడీఎస్ పీడీ స్రవంతి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా చైల్డ్ హోమ్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించి, సీజ్ చేశామన్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేయించామని, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు తారాచంద్ నాయక్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి నర్సింహులు తదితరులు చేరుకుని మతమార్పిడి యత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)