Home News మీడియా శక్తి ని దేశ హితం కొరకు వినియోగించాలి – శ్రీ రాక సుధాకర్ 

మీడియా శక్తి ని దేశ హితం కొరకు వినియోగించాలి – శ్రీ రాక సుధాకర్ 

0
SHARE
శ్రీ రాక సుధాకర్

నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు.

విశ్వ సంవాద్ కేంద్రము, సమాచార భారతి అద్వర్యంలో బుధవారం 2 మే నాడు హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్ మోహన్ స్మారక భవనంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత ప్రభావవంతమైన రంగం మీడియా రంగమని, ప్రజల్లో తాము అనుకున్న భావాన్ని కల్పించగలిగే శక్తి పత్రిక రంగానికి ఉన్నదన్నారు. మీడియా యాజమాన్య ప్రతిబందకాలు వలన పాత్రికేయులలో కొంత  ఇబ్బంది ఉన్నపటికీ వార్తలను నిర్బయంగా రాయడం వలన ప్రభుత్వాలలో ప్రజలలో సమాజ హితం కొరకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు.

ముఖ్యంగా పాత్రికేయ బాష అంటూ కుంభకోణం, స్వాహా, శఠగోపం, కైంకర్యం, చెవిలో పూలు లాంటి  హిందూ ఆద్యాత్మిక పదాలను వక్రీకరించటం జరుగుతుంది అని, వీటి వాడుకలో పాత్రికేయులు, పాఠకులు ఇద్దరు జాగ్రత్త పడాలని కోరారు.

సత్యం ఆధారంగా వెలువడే వార్తలకే ప్రజలలో ఆదరణ ఉంటుంది అనడానికి నేటి సోషల్ మీడియా ప్రత్యక్ష అనుభవమని గుర్తు చేసారు. నియంతృత్వంగా వ్యవహరించే ప్రభుత్వాల పీఠాలు  సహితం మీడియా చైతన్యం కారణంగా కుప్పకూలయన్నారు. సోషల్ మీడియా రాకతో సిటిజన్ జర్నలిజం ప్రారంభమై మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు పాత్రికేయులుగా మార్పు చెందుతున్నారన్నారు. పత్రిక/టి వి నిర్వహణ కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన కారణంగా ఇప్పుడు వెబ్ చానల్స్ ప్రారంభమయ్యాయన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ సంవాద కేంద్రం సంయోజకులు ప్రొఫెసర్ చిలకమారి సంజీవ మాట్లాడుతూ పాత్రికేయులు నారద మహర్షి లాగా మానవాళి శ్రేయస్సు కోసం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం కృషి చేయాలన్నారు.

ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో పాత్రికేయ వృత్తి లో విశేషంగా కృషి చేస్తున్న దూరదర్శన్ అల్ ఇండియా రేడియో స్టాఫ్ రిపోర్టర్ శ్రీ పి వి మదన్ మోహన్, ఆంద్రజ్యోతి  వరంగల్ ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ శంకర్ రావు శెంకేసి, తెలంగాణ టుడే వరంగల్ ప్రత్యేక కరస్పాండెంట్ శ్రీ పి లక్ష్మా రెడ్డి లను ఘనంగా సన్మానించారు.

సమాచార భారతి నిర్వాహకులు శ్రీ దాస్యం రామానుజం, శ్రీ ఆర్ లక్ష్మణ్ సుధాకర్, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం శాఖ విద్యార్థులు, రచయితలు , కవులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

శ్రీ చిలకమారి సంజీవ
అవార్డు గ్రహీత శ్రీ పి వి మదన్ మోహన్
అవార్డు గ్రహీత శ్రీ శంకర్ రావు శెంకేసి
అవార్డు గ్రహీత శ్రీ లక్ష్మా రెడ్డి