Home Telugu Articles ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, భారతీయతను తుడిచిపెట్టాలన్నది జిహాదీల లక్ష్యం

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, భారతీయతను తుడిచిపెట్టాలన్నది జిహాదీల లక్ష్యం

0
SHARE

శరణార్థుల శిబిరంలో
పురుడు పోసుకున్న వధువు,
ఆకాశపు నీడలందు
ఆటలాడుతున్న శిశువు,
క్షతధరిత్రి ప్రాంగణాన
చ్యుత జీవన రూపాలు,
మతోన్మాద బీభత్సపు
వధ్యశాల ‘బలిపశువులు’….

పాకిస్తాన్‌లో మిగిలిన హిందువులు దశాబ్దాలుగా ‘జిహాదీ’ బీభత్సకాండకు బలి అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులు శతాబ్దాలుగా ఈ బీభత్సకాండకు బలి అయ్యారు. కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్దినాటికి  క్రీస్తు శకం ఏడవ శతాబ్దినాటికి  ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై వందశాతం హిందువులుండేవారు…సనాతన వేద మతాలవారు, బౌద్ధులు, వన మతాలవారు….! కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని దాదాపు మూడు కోట్ల జనాభాలో హిందువుల సంఖ్య కేవలం వెయ్యిమంది. శతాబ్దుల తరబడి సర్వమత సమభావం అడుగంటి పోవడం ఇందుకు కారణం. ఈ మిగిలిన అవశేషాలను సైతం తుడిచిపెట్టడానికి ‘జిహాదీ’లు యత్నిస్తుండడం ఆఫ్ఘనిస్తాన్‌ను ఆవహించి ఉన్న వర్తమాన విషాదం. జూలై ఒకటవ తేదీన జలాలాబాద్ నగరంలో జిహాదీలు జరిపిన దాడిలో పదిహేడు మంది హిందువులు హతులయ్యారు.

మరో 20 మంది గాయపడ్డారు. జలాలాబాద్ ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం అంతటా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’లు విచ్చలవిడిగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ ‘గూఢచర్య విభాగం’గా చెలామణి అవుతున్న ‘ఇంటర్ సర్వీసెస్’ ఇంటెలిజెన్స్’  ఐఎస్‌ఐ  నిజానికి జిహాదీ బీభత్స సంస్థ, ఆసియా, ఆఫ్రికా  ఖండాలలో ఉన్న“జిహాదీ’ ముఠాలను ‘ఐఎస్‌ఐ’ అనుసంధానం చేస్తుంది. భారత వ్యతిరేక బీభత్స కలాపాలను సాగించడం ఈ ముఠాల లక్ష్యం. పేర్లు ఏవయినప్పటికీ “భారతదేశాన్ని బద్దలు కొట్టాలన్న” లక్ష్యంలో ఈ ముఠాలు జిహాదీ బీభత్స కలాపాలను కొనసాగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని అత్యల్ప సంఖ్యాకులైన అవశేష హిందువులను సైతం తుడిచిపెట్టాలన్నది జిహాదీల లక్ష్యం. ఈ పథకంలో భాగంగానే జలాలాబాద్‌లో హిందువులను జిహాదీలు హత్య చేశారు.

జలాలాబాద్‌లో విడిది చేసి ఉండిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రష్‌ఘనీని కలుసుకొనడానికై ‘గవర్నర్’ నివాసం వద్ద  వేచి ఉండిన  ఈ హిందువులు వాహన శ్రేణిపై ‘జిహాదీ’లు దాడులు జరుపగలగడం భద్రతారాహిత్య స్థితికి ప్రబల నిదర్శనం. జలాలాబాద్ ఆఫ్ఘానిస్తాన్ తూర్పు ప్రాంతం  ప్రావిన్స్  అయిన నాంగ్‌ధహార్ రాజధాని. పైగా అధ్యక్షుని రాక సందర్భంగా ‘భద్రత’ను మరింత కట్టుదిట్టం చేసి ఉండాలి. అయినప్పటికీ ‘జిహాదీ’లు దాడి చేశారు. హిందువులను  సిక్కులను, సనాతన మతస్థులను  బాంబు పేలుళ్ళకు బలి చేయగలిగారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’లు 2014 నుంచి మరింత విశృంఖల విహారం చేస్తున్నారు. 1976 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఎనభైవేల మంది హిందువులున్నారు. నలభైఏండ్లలో డెబ్బయితొమ్మిది వేల మంది హిందువులు హత్యలకు గురయ్యారు. తరిమివేతకు గురయ్యారు.

నిర్వాసితులైన హిందువులు మన దేశంలోను, బ్రిటన్‌లోనూ మరికొన్ని దేశాలలోను శరణార్థులుగా జీవిస్తున్నారు. బంగ్లాదేశ్‌నుంచి, పాకిస్తాన్ నుంచి తరిమివేతకు గురి అవుతున్న హిందువుల గురించి అప్పుడప్పుడు విషాదగాధలు ప్రచారం అవుతున్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమివేతకు గురయిన హిందువుల ‘విషాదస్మృతులు’ కాలగర్భంలోకి పోయాయి, కలిసిపోతున్నాయి. అఖండ భారత్ నుంచి ‘పాకిస్తాన్’ గా మారిన ప్రాంతాలు విడిపోయిన ధ్యాస మనకు ఇంకా మిగిలి ఉంది. కానీ శతాబ్దుల పూర్వం అఫ్ఘానిస్తాన్ ‘అఖండ భారత్’ నుంచి విడిపోయిన ధ్యాస మనకు లేదు. ‘ఆఫ్ఘనిస్తాన్’ గా మారిన ఈ సువిశాల ప్రాంతంలో సనాతన హైందవ సంస్కృతి యుగాలుగా వికసించింది. ఈ సాంస్కృతిక నందనవనాన్ని జిహాదీ బీభత్సకారులు శతాబ్దుల పాటు వేళ్ళతో సహా పెకలించి వేయడం చరిత్ర.

అవశేష హైందవ చిహ్నాలను 1996వ , 2001వ సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌పై పెత్తనం వహించిన ‘తాలిబన్’ జిహాదీలు ‘అల్‌ఖాయిదా బీభత్సకారులు’ నిర్మూలించారు. బుద్ధుని విగ్రహాలను ముక్కలు చేశారు. అడవులలో శతాబ్దుల పాటు నిలిచి ఉండిన శివలింగాలను పగుల కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులు శతాబ్దుల తరబడి తమ ఇళ్ళను, పల్లెలను, పొలాలను, వనాలను, యుగాలనాటి సాంస్కృతిక కేంద్రాలను వదిలి పెట్టి శాశ్వత శరణార్థులై తూర్పు వైపుగా వలస వచ్చారు. ఈ పూర్వ దిశా ప్రస్థాన క్రమానికి సైతం 1947 తరువాత ఆటంకం ఏర్పడింది. భారత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పాకిస్తాన్  ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా మారడం ఈ ఆటంకం. ప్రపంచంలోని మరే జాతికూడ కొన్ని శతాబ్దుల పాటు తమను నిర్మూలించడానికి ప్రయత్నించిన మతోన్మాదులతో సంఘర్షణ జరుపలేదు.

హైందవజాతి మాత్రమే జరిపింది! కానీ ఈ సతత సంఘర్షణ సమయంలో అనేక భూభాగాలను ‘అఖండ భారత్’ కోల్పోయింది. ఐదువేల నూటపంతొమ్మిది ఏళ్ళనాటి అంటే కలియుగం ఆరంభంనాటి ‘భారతదేశం’లో సగానికి పైగా భూభాగాలు దేశం నుండి పోయాయి. కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి! కలియుగంలో ప్రస్తుతం ఐదువేల నూట ఇరవయ్యవ సంవత్సరం నడుస్తోంది. కలియుగానికి పూర్వం ద్వాపరియుగం చివరిలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ‘గాంధారం’ అఖండ భారతదేశంలోని ఒక రాజ్యం! ఈ ‘గాంధారం’ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో భాగమైవుంది. నేటి బలూచిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు కలిసిన ప్రాంతంలో మహాభారత యుద్ధ సమయంలో అనేక రాజ్యాలు విస్తరించి ఉండేవి. ఇవన్నీ ‘వాయువ్య’ భారత రాజ్యాలు! ‘గిరివ్రజం’, ‘ఇంద్రప్రస్థం’, ‘పాటలీపుత్రం’,‘ఉజ్జయిని’ నగరాలు రాజధానులుగా విలసిల్లిన భారతరాజ్యాంగ వ్యవస్థలో గాంధారంతో సహా ఈ పశ్చిమోత్తర రాజ్యాలు భాగం! ప్రముఖ చరిత్రకారుడు కోటు వెంకటాచలం తమ “అశోకుని కాలము” అన్న గ్రంథంలో ఈ వాయువ్య రాజ్యాలను వివరించి ఉన్నాడు.

అవి అభిసార, ఉరగ, సింహపుర, కటుక, ఉత్తర, జ్యోతిష, అమరపర్వత, రామఠ, హార, దరద, కేకయ, సింధు, నౌవీర, గ్రామీణీయు, గాంధార! ‘కేకయ’  రాజ్యం ప్రస్తుతం మధ్య ఆసియాలోని ‘టర్క్‌మెనిస్థాన్’ గా మారి ఉంది. గాంధార, రామఠ, హార, అమరపర్వత, కటుక, సింహపుర, అభీర, ఉరగ, ఉత్తరజ్యోతిష రాజ్యాలు నేటి ఆఫ్ఘనిస్థాన్‌లో విస్తరించి ఉండేవి! ఈ రాజ్యాలన్నింటిలోను కలియుగం ముప్పయి ఎనిమిది శతాబ్దివరకు హైందవ జాతీయ మతాలు విలసిల్లాయి. సర్వమత సమ భావ రాజ్యాంగ వ్యవస్థపై పరిఢవిల్లింది. అనేక మతాల వారు ఏకకాలంలో ప్రశాంతయుత సహజీవనం చేయడం అప్పటి వరకు అంటే క్రీస్తుశకం ఏడవ శతాబ్దివరకు నడచిన చరిత్రే. ఈ ముప్పయి ఎనిమిది శతాబ్దులపాటు ‘అఖండభారత్’ మొత్తం ఒకే సమీకృత రాజ్యాంగ వ్యవస్థ! మొదట గిరివ్రజం, ఆ తరువాత ఇంద్రప్రస్థం, మళ్ళీ గిరివ్రజం, ఆ తరువాత పాటలీపుత్రం, ఉజ్జయిని నగరాలు ఈ ‘అఖండ భారత’ సమీకృత రాజ్యాంగ వ్యవస్థకు కేంద్ర రాజధానులు.

కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్ది  క్రీస్తుశకం ఏడవ శతాబ్దినుంచి  ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం ‘ఆఫ్ఘనిస్తాన్’ అఖండ భారత్ నుంచి విడిపోవడానికి ప్రాతిపదిక! ఈ ‘విచ్ఛిత్తి’ జరుగుతుండిన సమయంలోనే ఇస్లాం మత ‘జిహాదీ’లు ఆఫ్ఘనిస్తాన్‌లోకి  అప్పటి గాంధార, రామఠ తదితర రాజ్యాలలోకి చొరబడడం సమాంతర పరిణామం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో ఇస్లాం మతం పుట్టింది. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను మట్టు పెట్టి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించాలన్నది ‘జిహాది’ ల లక్ష్యం. ఈ అన్యమత నిర్మూలన లక్ష్య సాధనకోసం జిహాదీలు శతాబ్దులుగా అనుసరిస్తున్న మాధ్యమం బీభత్సకాండ.ఇస్లాయేతర మతాల వారిని హత్య చేయడం, బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఇస్లామేతర మతాల మహిళలను లైంగిక అత్యాచారాలకు గురి చేయడం, బానిసలుగా మార్చి విక్రయించడం, స్వస్థలాల నుంచి ఇస్లాయేతరులను తరిమివేయడం  వంటి చర్యలు జిహాదీ బీభత్సకాండలో భాగం.

అందువల్ల ‘అరేబియా’ నుంచి బయలుదేరిన ‘జిహాదీ’లు పారశీక దేశంలోకి, భారత్‌లో భాగంగా ఉండిన గాంధారాది రాజ్యాలలోకి చొరబడినారు. దశాబ్దుల పాటు పారశీకులపై హత్యకాండ జరిపారు. పారశీకులు సహస్రాబ్దులక్రితం భారత్ నుంచి వెళ్ళి స్థిరపడిన ప్రాంతం పారశీక దేశం. భారతదేశం పడమటి సరిహద్దులకు సమీపంలో నెలకొన్న పారశీక దేశం, పారశీక మతస్థులు భారతీయ మతాలతోనూ జీవన పద్ధతులలోను సాన్నిహిత్యం కలవారు. పారశీక దేశం ‘శకస్థానం’గా కూడా ప్రసిద్ధికెక్కింది. జిహాదీలు పారశీక జాతిని సమూలంగా నిర్మూలించారు. లక్షల పారశీకులు ‘భారత్’లోకి శరణార్థులుగా వచ్చేశారు. పారశీక దేశాన్ని ‘ఇరాన్’గా మార్చిన జిహాదీలు వెంటనే ‘అఖండభారత్’లోకి చొరబడ్డారు. పశ్చిమోత్తర భారత్‌లో దక్షిణాన ఉన్న ‘సింధు’, మదీన భాగంలోని ‘గ్రామణీయ’ ‘సౌ వీర’  నేటి బలూచిస్థాన్  రాజ్యాలలోకి, ఉత్తరాన ఉన్న‘గాంధారాది’  నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని ‘జిహాదీ’లు చొరబడ్డారు.

లక్షలాది హిందువులను హత్య చేశారు. మతం మార్చారు. సింధు, బలూచిస్థాన్ ప్రాంతాలలో ఈ జిహాదీ విదేశీయులను శతాబ్దుల పాటు స్వజాతీయులైన హిందువులు ఎదిరించారు. కానీ గాంధారాది రాజ్యాలలో పదవ శతాబ్ధి చివరినాటికి జిహాదీలు తిష్ఠ వేశారు. ఈ రాజ్యాలలోని అత్యధిక శాతం హిందువులు అప్పటికి ‘ఇస్లాం ’ మతంలోకి మారిపోయారు. లేదా హత్యలకు గురి అయ్యారు. కొందరు పారిపోయి ఇతర భారత ప్రాంతాలకు వచ్చేశారు! ఫలితంగా గాంధారం తదితర తొమ్మిది భారతీయ రాజ్యాలు విస్తరించిన దాదాపు ఆరున్నర లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో యుగాలనాటి స్వజాతీయులైన హిందువులు అల్ప సంఖ్యాకులుగా మారారు. అందువల్ల ఇస్లాం మత జన బాహుళ్యం ఏర్పడిన  ఈ సువిశాల ప్రాంతం అఖండ భారత్ నుంచి విడిపోయింది.

ఈ రాజ్యాలభారతీయమైన పేర్లు మరుగున పడి ‘ఆఫ్ఘనిస్తాన్’ అనే కొత్త దేశం ఏర్పడింది. ‘నిషధ’ పర్వతాలకు ఆవల ఉండిన ఈ ప్రాంతం భారతీయుల పాలిట వి‘దేశం’ గా మారింది. ‘నిషధ’పర్వత శ్రేణిని జిహాదీలు ‘హిందూమష్’ అని పిలిచారు. ‘హేలమంద’ నది ‘హాల్మండ్’ నదిగా మారింది! ఇదంతా క్రీస్తుశకం పదవ శతాబ్దినాటి మాట! ఆఫ్ఘనిస్తాన్ అలా అఖండ భారత్‌నుంచి విడివడి పోయింది. మూడు తరాలు గడిచాయి. మతం మారి ఇస్లాం మతస్థులుగా చెలామణి అయిన ‘హిందువులు’ తాము ఒకప్పుడు హిందూజాతీయులమన్న చారిత్రక వాస్తవాన్ని విస్మరించారు. అనాదిగా తాము ఇస్లాం మతస్థులు మన్న భ్రాంతికి గురి అయ్యారు. ‘జిహాదీ’ స్వభావాన్ని అలవరచుకున్నారు. వీరందరూ ‘నిషధ  హిందూకుష్  నాటి అవశేష భారత్‌పై దాడులు చేయడం క్రీస్తుశకం పదకొండవ శతాబ్దినాటి కథ. మహ్మమ్మద్ గజనీ అనీ జిహాదీ ముష్కరుడు గాంధారం  ఆఫ్ఘనిస్తాన్  నుంచి అవశేష భారత్‌లోకి చొరబడ్డాడు.

ఇలా పదకొండవ శతాబ్దినాటికి ఆఫ్ఝనిస్తాన్‌లో అల్పసంఖ్యాకులుగా మారిన హిందువులను తరువాత శతాబ్దుల తరబడి ‘జిహాదీ’లు ఊచకోత కోశారు, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో కేవలం వెయ్యిమంది హిందువులు మాత్రమే మిగిలి ఉండడానికి ఇదంతా వికృత చారిత్రక నేపథ్యం. సర్వమత సమాభావ స్వభావులైన హైందవ జాతీయులకు, ఏక మతోన్మాద స్వభావులైన జిహాదీలకు మధ్య శతాబ్దులుగా సంఘర్షణ జరిగింది,జరుగుతోంది. హైందవ జాతీయులు ఓడని చోటు సర్వమత సమాభావ రాజ్యాంగ వ్యవస్థలు విలసిల్లాయి. జిహాదీలు గెలిచిన చోట ‘సర్వమత సమాభావ వ్యవస్థ’ నశించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ‘జిహాదీ’లు గెలిచారు. ‘గాంధార శిల్పం’ విశ్వవిఖ్యాతిగాంచిన కళారూపం. గాంధారంలో అతి మన్నికైన మేలైన వీణలు తయారయ్యేవి. గాంధారం  పుట్టిన సంస్కృత వ్యాకరణవేత్త పాణిని ‘తక్షశిల’ మహా విద్యాలయంలో చదువు చెప్పారు. ఇది కలియుగం పదహైదవ శతాబ్దినాటి స్మృతి! ఇదంతా ఆఫ్ఘనిస్తాన్‌లోని యుగ యుగాల భారతీయత…… నేడు ఇదంతా ధ్వంసమైంది. ‘జిహాద్’ నడుస్తోంది…….

మాతాపిత సోదరులను
కోల్పోయిన వారి కథలు,
సతుల సుతుల నెడబాసిన
భాగ్యహీన జనుల వ్యథలు,
గాంధార విలాప గీతి
పలికించిన అపశ్రుతులు,
కాలమందు కలిసిపోక
కదలాడు విషాదస్మృతులు!

-తంగేడుకుంట హెబ్బార్
(9908779480)

(విజయక్రాంతి సౌజన్యం తో)