Home Telugu Articles మతాన్ని బట్టి న్యాయం మారితే చట్టం ముందు పౌరులందరూ సమానమన్న సెక్యులర్‌ సూత్రం ఏమైనట్టు?

మతాన్ని బట్టి న్యాయం మారితే చట్టం ముందు పౌరులందరూ సమానమన్న సెక్యులర్‌ సూత్రం ఏమైనట్టు?

0
SHARE

ఎప్పుడైతేనేమి, ఎలాగైతేనేమి – ఎమర్జన్సీ చిమ్మచీకటిలో ‘సెక్యులర్‌’ పదం భారత రాజ్యాంగ పీఠికలోకైతే ఎక్కింది కదా ! కాబట్టి రాజ్యాంగరీత్యా మనది సెక్యులర్‌ రాజ్యం కాదా?

కాదు. ఇంటి ముందు ‘బృందావనం’ అనో ‘శాంతి నికేతన్‌’ అనో ఫలకం వేసినంత మాత్రాన ఆ ఇల్లు బృందావనం కాదు. అచ్చమైన శాంతి నికేతనమూ అయిపోదు. రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులర్‌’ పదం చేరినంత మాత్రాన మనది సెక్యులర్‌ రాజ్యాంగమూ ఆటోమేటిగ్గా అయిపోదు.

ఎందుకంటే సెక్యులర్‌ రాజ్యానికీ, రాజ్యాంగానికీ కొన్ని లక్షణాలు కంపల్సరీగా ఉండాలి. రాజ్యానికీ, మతానికీ మధ్య, కచ్చితమైన విభజన రేఖ ఉండాలి. రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం, లేక మత ప్రభావం ఉండకూడదు. ఎవరి మతం ఏమైనా చట్టాలు మాత్రం పౌరులందరికి సమానంగా వర్తించాలి. శాసనాలకు సంబంధించినంతవరకూ రాజకీయ అధికారం మతాలకు కాక రాజ్యానికే ఉండాలి. ఇతర విధాల తేడాపాడాలు ఎన్ని ఉన్నా ప్రపంచంలో సిసలైన సెక్యులర్‌ దేశాలు అనుకొనబడేవి అనుసరిస్తున్న పంథా ఇది.

మరి మనదేశంలోనో ? కొన్ని పాశ్చాత్య దేశాలలో లాగా రాజ్యవ్యవహారాల నుంచి మనం మతాన్ని పూర్తిగా వేరు చేయం; అన్ని మతాలను సమానంగా చూస్తాం; మతాల విషయంలో తటస్థంగా ఉండటమే మన విధానం అని మహానేతలు చెబుతారు. చట్టం ముందు అందరూ సమానులు అనీ; చట్టాలు, రాజ్యాంగ సూత్రాలు పౌరులందరికీ సమానంగా వర్తించాలనీ మన రాజ్యాంగం ఘోషిస్తుంది. మంచిదే. కాని ఆచరణలోనో ?

అందరూ సమానులే అయినప్పుడు కోడ్‌ ఆఫ్‌ లా అనేది పౌరులందరికీ కలిసి ఒకటే ఉండాలి కదా? మన దేశంలో మాత్రం అలా ఉండదు. దాని దగ్గరికి వచ్చేసరికి మతాల ప్రసక్తి వస్తుంది. మతాల తారతమ్యం కనిపిస్తుంది. పెళ్లి, విడాకులు, వారసత్వ హక్కులు, మనోవర్తి వగైరాల విషయంలో ‘పర్సనల్‌ లా’ లు ఆయా వ్యక్తుల మతాన్ని బట్టి మారతాయి. మహమ్మదీయ పౌరులకు షరియా ఆధారమైన ముస్లిం పర్సనల్‌లా వర్తిస్తుంది. ముస్లిం పర్సనల్‌లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్‌ అనే 1937 నాటి బ్రిటిషు కాలపు చట్టమూ, 1939లో తెల్లవాడు పెట్టిన ‘డిజల్యూషన్‌ ఆఫ్‌ ముస్లిం మారేజస్‌ యాక్ట్‌’ స్వతంత్ర భారతానికి సొంత రాజ్యాంగం అమరిన ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా మహమ్మదీయుల విషయంలో ఇంకా చెల్లుబాటు అవుతున్నాయి. ఎప్పుడో 1950ల్లోనే పార్లమెంటు పౌరులందరికి కలిపి రూపొందించిన సివిల్‌ జోన్‌ హిందువులకు, క్రైస్తవులకు, ఇంకా ఇతర మతాలకే తప్ప ముస్లింలకు మాత్రం వర్తించడం లేదు. వారి దగ్గరికి వచ్చేసరికి పార్లమెంటు చేసిన చట్టం బలాదూరు. మతం నిర్దేశించే న్యాయానికి మాత్రమే చెల్లుబాటు.

బాల్య వివాహం, బహుభార్యాత్వం, ఏకపక్షంగా విడాకులు వంటివి ఒక మతం వారు పాల్పడితే న్యాయబద్ధం. అదే పని వేరే మతాలవారు చేస్తే శిక్షార్హమైన నేరం. మహమ్మదీయుడు ఎన్ని పెళ్ళిళ్లయినా చేసుకోవచ్చు. హిందువులకేమో భార్య ఉండగా మారుమనువు చట్టరీత్యా నిషిద్ధం. మతాన్ని బట్టి న్యాయం మారేటప్పుడు చట్టం ముందు పౌరులందరూ సమానమన్న సెక్యులర్‌ సూత్రం ఏమైనట్టు?

చట్టం ముందు అందరూ సమానులేకాని మహమ్మదీయులు మాత్రం ఎక్కువ సమానులా? వారు మాత్రం రాజ్యశాసనాలను పక్కకు బెట్టి తమ మతాచారం ప్రకారం నడచుకోవచ్చా? ఇది ముస్లింల పట్ల పక్షపాతం, ఇతర మతాల పట్ల అనుచిత వివక్ష కాదా? మతాచారాలు ముస్లింలకు మాత్రమే ఉన్నాయా? ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మ సూత్రాలు హిందూ మతానికి లేవా? హిందువుల్లో మాత్రం బహు భార్యాత్వం ఎప్పటి నుంచో లేదా?

హిందువులు పూజించే దేవుళ్లకే పలువురు భార్యలు ఉన్నారు. ఇద్దరేసి, ముగ్గురేసి భార్యలు ఉండటం హైందవ గృహస్థులకు వేల సంవత్స రాలుగా పరిపాటే. బహుభార్యాత్వాన్ని హిందూ ధర్మశాస్త్రాలూ సమ్మతించాయి. ఇదిగో – ఇలాంటి సబబులు చూపించి తమకు బాహుభార్యాత్వం వెసులుబాటు కావాలని ఎవరైనా హిందువులు అడిగితే సభ్య సమాజం అంగీకరిస్తుందా?

మతాచారాలు, సంప్రదాయాలు, నాగరిక నడవడికి విరుద్ధంగా ఉన్నట్టయితే వాటిని తప్పని సరిగా మానేసి, ఆధునిక సమాజానికి అనుగుణ్యమైన శాసనాలకు లోబడి తీరాలని హిందువుల విషయంలో కట్టడి చేశారు. బాగానే ఉంది. మరి అదేవిధమైన కట్టుబాటు మహమ్మదీయులకు మాత్రం వద్దా? మన కపట రాజకీయుల దృష్టిలో ముస్లింలు ప్రత్యేక తరగతి పౌరులా? వారు చట్టానికి అతీతులా?

నేరాలకు సంబంధించిన క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ దేశమంతటికీ కలిపి ఒకటే ఉన్నప్పుడు పెళ్లీ పెటాకులూ, ఆస్తి హక్కులు, వారసత్వాల్లాంటి సివిల్‌ వ్యవహారాలకూ సివిల్‌ కోడ్‌ ఒకటే ఉండాలి. భారత రాజ్యాంగానికి డెబ్భై వసంతాలు నిండవస్తున్నా కామన్‌ సివిల్‌ కోడ్‌ అనేది ఆకాశ కుసుమంగానే మిగిలింది. బుల్లి రాష్ట్రమైన ఒక్క గోవాలోనే సివిల్‌ కోడ్‌ మత ప్రసక్తి లేకుండా పౌరులందరికీ సమానం. అక్కడ ఎప్పటినుంచో ఎంచక్కా అమలు అవుతున్న కామన్‌కోడ్‌ను విశాల దేశంలో మాత్రం ఎందుకు అమలు పరచలేము? దానికి రాజకీయ దృఢ సంకల్పం, రాజకీయ పార్టీలకు కాస్తంత వివేకం, ప్రభుత్వాలకు కొంచెం చేవ, చొరవ కావాలి. ఎటొచ్చీ అవే మనకు కరవు.

1976లో ఇందిరమ్మ ‘చేతబడి’తో దిక్కుమాలిన సెక్యులరిజం

ఒక జాతికి చెందిన ప్రజలు ఒకేరకమైన శాసనాల కింద జీవించనవసరం లేదంటే.. వివిధ వ్యక్తులకు సంబంధించి చట్టాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు ఏ మతానికి చెందినవారన్న దానిని బట్టి ఉంటే అది సెక్యులర్‌ వ్యవస్థ అనిపించుకోజాలదు. అలాగే నిజమైన సెక్యులర్‌ వ్యవస్థలో రాజకీయాలపైన, ప్రభుత్వంపైన, పబ్లిక్‌ పాలసీ పైన, సాంఘిక వ్యవస్థల మీద, విద్యావిధానం మీద, ఉపాధి కల్పన మీద మతాల నీడ పడనేకూడదు. కాని మనదేశంలో మతం పేరుతో పార్టీలుంటాయి. పేరులోనే ‘ముస్లిం’, ‘క్రిస్టియన్‌’ లాంటి పదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. చట్ట సభలకూ ఎన్నికవు తుంటాయి. (ఇప్పుడు ఉనికి లేదుగాని, ఒకప్పుడు హిందూ మహాసభ అని హిందువుల పార్టీ ఉండేది.)

మత పార్టీలను అనుమతించినప్పుడు మత రాజకీయాలూ, మత దుష్ప్రభావాలూ వాటి వెనువెంటే ఉంటాయి. బిజెపిని హిందూ పార్టీగా ముద్రవేసి, అంటరానిదిగా చూసే సెక్యులర్‌ నిష్ఠాపరులు కల్తీలేని కమ్యూనల్‌ అయిన ముస్లింలీగు లాంటి పార్టీలతో కొంగుముడి వేసుకోవటానికి ఎప్పుడూ వెనుకాడరు. సంకీర్ణ ప్రభుత్వాలకు ఆ పార్టీల మద్దతుకు ప్రతిఫలంగా జిల్లాలను చిందర వందర చేసి ముస్లిం మెజారిటీ గల మలప్పురం లాంటి జిల్లాలను ఏర్పరచి మతతత్వానికి దాసోహమనడానికీ మన రాజకీయ నేతాశ్రీలు ఎంతమాత్రం జంకరు. అదేవిధంగా జాతిభవితకు ప్రాణప్రదమైన విద్యావ్యవస్థలోనూ దిక్కుమాలిన ఓట్ల లబ్దికోసం మతాల చిచ్చుపెట్టటంలో మన రాజకీయ జీవులవి అందె వేసిన చేతులు.

దేశంలో నూటికి 80% మంది హిందువులని అధికారిక గణాంకాలు చెబుతాయి. ఆ హిందువులు మతం లేనివారా? వారిది అనాగరిక, ఆదిమ జాతి మతమా? కాదు. హైందవం ప్రపంచంలోకెల్లా గొప్పమతం, ప్రపంచంలో కెల్లా గొప్పధర్మం, ప్రపంచంలోకెల్లా గొప్ప జీవన విధానం అని ప్రపంచంలోని దేశదేశాల మహాజ్ఞానులు, మహా మేధావులు ఎన్నో శతాబ్దాలుగా కొనియాడుతున్నారు. వేద విజ్ఞానం, భారతీయ శాస్త్రం, హైందవ తత్వం, సారస్వతం, సాంస్కృతిక వైభవాల లోయలను, ఎత్తులను లీలగానైనా పోల్చుకోవటానికి పాశ్చాత్య దేశాల్లో విస్తృత పరిశోధనలు, సమగ్ర అధ్యయనాలు తరతరాలుగా సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు లాంటి ఎన్నో దేశాలు యూనివర్సిటీల్లో హిందూమతాన్ని ఎప్పటినుంచో బోధిస్తున్నారు. దాని తాత్త్విక, వైజ్ఞానిక, శాస్త్ర పౌరస్వతాల మీద క్షుణ్ణంగా రిసెర్చిలు చేయిస్తున్నారు.

మరి – నిఖిల జగతికి వెలుగుదారులు చూపిన హైందవానికి దాని సొంతగడ్డ మీద ఉన్న విలువ ఎలాంటిది? స్వదేశంలో దాని అధ్యయనానికి ఇస్తున్న ప్రాముఖ్యం ఏపాటిది? జాతికి సిగ్గుచేటు ఏమిటంటే హిందూ దేశంలో హిందూ మతానికి, హిందూ తత్వానికి పూచికపుల్లపాటి విలువ లేదు. సెక్యులర్‌ గంతలు తగిలించుకున్న మన ప్రభుత్వాల, పాలక వర్గాల దృష్టిలో హిందూ మతం గడ్డిపోచతో సమానం. తెల్లవాళ్లు ఏలిన కాలంలో కనీసం పాఠశాలల్లో హైందవ ధర్మానికి, హైందవ వీరులకు హిందూ ఇతిహాస పురాణాలకు సంబంధించిన పాఠాలను అనుమతించారు. హిందూ కాలేజీలను, హిందూ యూనివర్సిటీలను ప్రోత్సహించారు. తెల్లవాళ్లు పోయి దేశీయ ప్రభువులు వచ్చాక పరిస్థితి నానాటికీ దిగజారింది. స్వతంత్రం తరువాత తొలి దశాబ్దాల్లో ‘రామాయణ, భారత, భాగవతాల పాఠాలను, హిందూ దేశ పవిత్రతను కొంతలో కొంతైనా పిల్లలకు బోధించనిచ్చేవారు. 1976లో ఇందిరమ్మ ‘చేతబడి’తో దిక్కుమాలిన సెక్యులరిజం వచ్చిపడ్డాక ఆ పాఠాలు అటకెక్కాయి. హిందూ మతం, హిందూ చరిత్ర విద్యార్థులకు ఎంత మాత్రమూ నేర్పకూడని నిషిద్ధ పదార్థాలు అయ్యాయి. దేశంలో వందల సంఖ్యలో ఉన్న యూనివర్సిటీల్లో ఏ ఒక్కదానిలోనూ హిందూ మత అధ్యయనానికి ప్రత్యేక విభాగమంటూ లేదు.

మన సెక్యులర్‌ ప్రభువుల దృష్టిలో మతం అశాస్త్రీయం కాబట్టి విద్యాసంస్థల్లో మత అధ్యయనాన్ని నిషేధించారేమో అనుకుందామా? చచ్చుదో పుచ్చుదో ఒక విధానమంటూ పెట్టుకొన్నప్పుడు అన్ని మతాల పట్ల ఒకే వైఖరి చూపాలి కదా? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?

హిందూ మత పాఠశాలలను ఎంతమాత్రమూ దగ్గరికి రానివ్వని సెక్యులర్‌ సర్కార్ల వారు ఇస్లామిక్‌ మత పాఠశాలలను మాత్రం అక్కున చేర్చు కుంటున్నారు. హిందూ పాఠశాలలకు పైసా విదల్చని పాలకులు ముస్లిం మదరసాలకు మాత్రం ఉదారంగా డబ్బులిస్తున్నారు. మహమ్మదీయ మతబోధలను పిల్లలకి యధేచ్చగా బోధించటానికి, ముస్లిం ఫండమెంటలిజాన్ని నూరిపోయటానికి గవర్నమెంటు వారు సర్వవిధాల సహాయపడుతున్నారు. మత సంస్థలను, విద్యను రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో చేర్చినందువల్ల హైందవేతర మతాలకు, వాటి విద్యా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి వరాలు ఇస్తున్నాయి. మదరసాలలో, ఉన్నత విద్యాసంస్థలలో ఇస్లామిక్‌ స్టడీస్‌ పేరుతో ఎంత అభ్యంతకరమైన, జాతి సమైక్యతకు, సమగ్రతకు మహాప్రమాదకరమైన విషయాలను బోధిస్తున్నా, జిహాదీల ఉత్పత్తి కేంద్రాలుగా అవి ఎన్ని వెర్రితలలు వేస్తున్నా ప్రభుత్వాలకు పట్టవు.

ఎలాంటి పర్మిషన్లూ లేకుండా, అధికారుల ఆదేశాలను, హైకోర్టు తీర్పును కూడా లక్ష్యపెట్టకుండా అనుమానాస్పదమైన చరిత్రగల ఒక మహిళ తిరుపతిలో ఆరు అంతస్థుల ఇస్లామిక్‌ యూనివర్సిటీని చట్ట విరుద్ధంగా నెలకొల్పి, అడ్డగోలుగా నడుపుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికీ చలనం లేదు. కేంద్ర పోషణలో, దేశ ప్రజల సొమ్ముతో నడిచే అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ పేరుకు సెంట్రల్‌ యూనివర్సిటీ అయినా పక్కా మైనారిటీ సంస్థగా నడుస్తోంది. జాతి శత్రువైన జిన్నాను అక్కడ పటం కట్టి పూజిస్తారు. రంజాన్‌ మాసంలో మహమ్మదీయేతరులకు కూడా పగటిపూట తిండి పెట్టకుండా బలవంతపు ఉపవాసం చేయిస్తారు. మిగతా సెంట్రల్‌ యూనిర్సిటీల్లో వలె ఎస్‌.సి., ఎస్‌.టి.లకు అడ్మిషన్లు, రిక్రూట్‌మెంట్‌లలో రిజర్వేషన్లు అక్కడ అమలు కావు. అయినా అడిగే దిక్కు లేదు.

మతాల, మతసంస్థల విషయంలో, మైనారిటీ విద్యాసంస్థలకు సంబంధించి మన వింత సెక్యులర్‌ విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి ఊసులు మరోసారి.

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)