నిజాం రహస్యంగా ఆయుధాలు కొని తెప్పించుకుంటున్నాడు ఆకాశంలో విమానం చప్పుడు. ఆ విమానం స్థావరంలో దిగుతుండగా ఆ రైతు యువకుడు కంబళి కప్పుకొని స్థావరానికి దగ్గరగా పాకుతూ మొత్తం దృశ్యాన్ని చూచాడు. విమానంలోంచి రకరకాల ఆయుధాలను క్రిందికి దించి అక్కడే సిద్ధంగా ఉన్న ట్రక్కులలో నింపారు. ఆ తర్వాత ఆ ట్రక్కు హైద్రాబాద్‌వైపు సాగిపోయింది. నిజాం రహస్యంగా ఆయుధాలు కొన్ని తెప్పించుకుంటున్నాడనే వదంతి నిజమని రూఢి అయ్యింది. సముద్రపు దొంగ అని పేరుమోసిన ఇంగ్లీషు నావికుడు సిడ్నీ కాటన్ రహస్యంగా ఆయుధాలను తన నౌకలో పశ్చిమ పాకిస్తాన్, గోవాల గుండా తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని విమానం ద్వారా బీదర్, వరంగల్ స్థావరాలకు చేర్చేవాడు.
అక్కడ నుండి ట్రక్కులలో హైద్రాబాద్‌కు ఆయుధాలు చేరేవి. వరంగల్ ఎయిర్‌స్ట్రిప్ దగ్గర రాత్రి జాగారం చేస్తూ కూపీలాగుతున్న రైతు యువకుడు అసలు ఒక విద్యార్థి. అతడే శ్రీ ఎ. రామారావు. ప్రాణాలకు తెగించి ఈ రహస్యాలను లాగుతూ అతను మారుపేరుతో ఉత్తరాల ద్వారా హైద్రాబాద్‌కు సాంకేతిక భాషలో సమాచారం అందచేసేవాడు. శ్రీ రామారావు చూడడమే కాకుండా విమానం స్థావరం ఉద్యోగుల్ని కొందరిని కలుసుకొని వివరాలు సేకరించేవారు. అదే విధంగా రాయచూర్ విమాన స్థావరం దగ్గర శ్రీ టి. రాజగోపాలాచార్య అనే విద్యార్థి ఈ రహస్యాలను సేకరించేవాడు.
ఇక్కడ హైద్రాబాద్‌లో భికాజీపటేల్ అనే న్యాయవాది చిరునామాపై ఎల్.ఎన్.సింగ్ అనే పధ్నాలుగేళ్ళ కుర్రవాడికి ఉత్తరాలు వస్తుండేవి. పోస్ట్‌మాన్ వచ్చే సమయానికి శ్రీ వందేమాతరం అక్కడే ఒక పేపర్లు అమ్మే దుకాణంలో కూర్చొని ఉండేవారు. సింగ్ వెళ్ళి తన ఉత్తరాలు తీసుకొచ్చేవాడు. ఆ ఉత్తరాలు వరంగల్ నుండి శ్రీ రామారావు వ్రాసినవే. శ్రీ ఎల్.ఎన్.సింగ్, శ్రీ రామారావులు కలిసి నాసిక్‌లో భోంసా మిలిట్రీ స్కూలు నిర్వహించిన క్యాంప్‌లో శిక్షణపొందిన విప్లవవీరులు. ఎల్.ఎన్. సింగ్ మామూలుగా నిక్కర్ వేసుకొని ఒక్కోసారి బొలారం వరకూ కాలినడకన వెళ్ళేవాడు. వందేమాతరం అందించిన సమాచారాన్ని మున్షీ స్థావరానికి చేర్చేవాడు.
బీదర్ దగ్గర ఉన్న పాపనాస్ ఎయిర్‌స్ట్రిప్‌లో సిడ్నీ కాటన్ తన విమానాల ద్వారా ఆయుధాలు దింపేవాడు. కాని ఒకరోజు స్నేహితుడైన తన విమాన పైలట్‌తో కాటన్‌కు తగాదా వచ్చింది. ఆ పైలట్‌ను నిజాం అరెస్టుచేసి అక్కడే కాల్పించాడు. నిజాం సైన్యంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అనేకమంది హిందువులు సైనిక రహస్యాలను వందేమాతరంకు అందచేస్తుండేవారు. గవర్నర్ హోదాలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ ఒక ముఖ్యమైన వార్తను అందచేశాడు. పాప్‌నాస్ విమాన స్థావరంలో 30 ఎం.ఎం.ఒ.టి ఎయిర్ క్రాఫ్ట్‌గన్‌ను దిగుమతి చేస్తున్నారనే అంశం అది. ఇక మిగతా హిందూ ఉన్నత సైనికాధికారులు ఆనాటి పరిస్థితుల్లో భయంవల్ల సమాచారం అందచేసేవారు. అయినా లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్‌సింగ్ అనే ఒక సిక్కు అధికారి వీలున్పప్పుడల్లా రహస్యాలు చెప్పేవాడు. నిజాం సైన్యంలో అంత పెద్ద హోదాలో ఉన్న ఈ అధికారి ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో సైకిల్‌పై తిరుగుతూ జీవించాడు.
సాహసంతో ముందుకు వచ్చి దేశభక్తితో తమ కర్తవ్యాన్ని నిర్వహించిన విద్యార్థి విప్లవవీరులు శ్రీ ఎ. రామారావు, శ్రీ ఎల్.ఎన్.సింగ్‌లు హైద్రాబాద్ విముక్తి తర్వాత పోలీసు శాఖలో చేరదలచుకున్నారు. వాళ్ళిద్దరిని మొదట సబ్ ఇన్‌స్పెక్టర్ల హోదాకు ఎన్నుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ పూర్వ చరిత్ర కారణంగా అధికార్లు ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగానికి గురై కొంతకాలం తర్వాత శ్రీ రామారావు క్షయ వ్యాధితో బాధపడినప్పుడు కూడా చికిత్సా సౌకర్యాలు సమకూరలేదు. తర్వాత అతను కరీంనగర్ జిల్లాలో ఎక్కడో కుట్టుమిషన్ ద్వారా జీవితాన్ని గడుపుకున్నాడు. దేశభక్తికి విప్లవ కార్యకలాపాలకు ప్రతిఫలాన్ని ఆశించడం కాదు. కాని ఈ విప్లవవీరులపట్ల ప్రభుత్వం, ప్రజలు నిర్లక్ష్యం చూపడమే బాధాకరమైన అంశం.
శ్రీ వందేమాతరం తన రహస్య కార్యకలాపాల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని మున్షీగార్కి అందచేస్తూ వచ్చాడు. శ్రీ మున్షీ వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీ వెంకటవరదన్ అయ్యంగార్ స్వయంగా కారులోవచ్చి రహస్యంగా శ్రీ వందేమాతరాన్ని కలుసుకునేవారు. అప్పుడప్పుడు శ్రీ వినా ఇంట్లోనే సమాచారం అందించేవారు. నిజాం ఆర్డినెన్సు డిపో ఆయుధ కర్మాగారంలో టైపిస్టుగా పనిచేసిన శ్రీ భారత్‌సింగ్ స్వయంగా ఆ కర్మాగారానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు కార్బన్ కాపీలను తీసుకువచ్చి ఒక నిర్ణీతస్థలంలో వందేమాతరంకు అందచేస్తుండేవాడు. నిజాం తన ఆయుధ కర్మాగారానికి కావలసిన ఇనుమును ఉక్కును, అనేక మార్గాల ద్వారా ఆ పని చేయించేవాడు.
హిందూ వ్యాపారులు, డబ్బు కక్కుర్తికి వ్యాపారం పేరుతో భారత ప్రభుత్వాన్ని మోసంచేసి ఇనుము, ఉక్కు వగైరా సరఫరా చేసేవారు. ఆర్డినెన్స్ స్టోర్‌లో ఉండే ఆయుధాల వివరాలు చీఫ్ అడ్మిరల్ హీరాలాల్ ద్వారా తెలుస్తుండేది. ఆర్టిలరీ విభాగంలో పనిచేసిన సుబేదార్ లక్ష్మీనారాయణ హవల్దార్ శివరాం సింగ్‌లు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్‌గన్‌ను ఉపయోగించే శిక్షణ పొందారు. ఈ విషయాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వయంగా వెల్లడిచేశాడు. ఇతను నిజాం ఆర్టిలరీలో ఉంటూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. పోలీసు చర్య జరగబోయే సమయంలో షోలాపూర్ ఫ్రంట్ నుండి నిజాం సైన్యం వెనక్కి వస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో నిజాం సైన్యంలో గందరగోళం ఆవరించింది.
ఆ అవకాశాన్ని వినియో శ్రీ లక్ష్మీనారాయణ విధ్యంసక ఫిరంగిని భారత విమానాలకు గురిపెట్టినా ఎప్పుడూ పేల్చలేదు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆనాడు తయారవుతున్న కొన్ని ఆయుధాల వివరాలు అత్యవసరంగా కావలసి వచ్చాయి. ముఖ్యంగా 19. మిల్స్ హాండ్ గ్రైనేడ్, జపనీస్ టైప్ .303 రైఫిళ్ళ వివరాలు వాటి నకళ్ళతో సహా అవసరమైనాయి. శ్రీ వందేమాతరం స్వయంగా తమ ప్రాణాలతో చెలగాటమాడాలని నిశ్చయించుకున్నారు. మిలట్రీ యూనిఫారం ధరించి వందేమాతరం అన్ని జాగ్రత్తలతో బయలుదేరారు. తోడుగా నిజాం మిలట్రీలో పనిచేస్తున్న ఇద్దరు సైనికులు జగన్నాథ్, గణేష్ సింగ్‌లు వెళ్ళారు. ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే కోడ్‌వర్డ్ ఉపయోగించవలసి ఉంటుంది. ఆనాటి వర్డ్ “బోంబే” ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వందేమాతరం ఫ్యాక్టరీలో ప్రవేశించారు.
ఎంతో నేర్పుతో ధైర్యంగా లోపల తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. దాదాపు మూడు గంటల పాటు లోపల ఉండిపోయారు. అడ్మిరల్ శ్రీ హీరాలాల్ సహాయంతో లోపలి వివరాలు ఆయన సేకరించారు. నిజాం భారీ ఎత్తున్న చేస్తున్న సైనిక సన్నాహాలను శ్రీ వందేమాతరం సవివరంగా ఏజంట్ జనరల్ శ్రీ కె.యం. మున్షీకి అందచేశారు. తత్ఫలితంగా భారత ప్రభుత్వం పోలీసు చర్య తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధై కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి “శాంతి సంఘాలు” అనే వాటిని ఏర్పరిచి హిందువుల కళ్ళు కప్ప ప్రయత్నించింది.
జనగామలో ఇలాంటి శాంతిసంఘంలోనే పరిశ్రమల శాఖ సూపర్‌వైజర్ శ్రీ ఎం.ఎన్.రెడ్డి, వ్యవసాయ శాఖ సూపర్‌వైజర్ శ్రీ శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు ఈ సంఘాలలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికి ఈ తతంగం జరుగుతుండేది. అయితే హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేస్తే ప్రాణాలతో మిగలడం కష్టం. ఒకసారి శ్రీ శఠగోపాచార్యులు శాంతి సంఘ సమావేశంలో మితిమీరిపోతున్న రజాకార్ల చర్యలను ఖండించారు. మరుసటిరోజు ఆయనను జనగామ దారిలోకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. శ్రీ ఎం.ఎన్. రెడ్డి నమ్రతతో ఈ ఆగడం గురించి ఫిర్యాదు చేశారు. కాని ఆయనను కూడా తుపాకీతో కాల్చేస్తామని అధికారులు బెదిరించారు. ఆ రోజుల్లో తిప్పర్తి ప్రాంతంలో ముస్లిం అధికారులు సివిల్ మిలిటరీ అనే భేదభావం లేకుండా ఆయుధాల అభ్యాసం చేస్తుం హిందువులకు కాల్పులలో తర్ఫీదు ఇచ్చి హిందువులనే హత్య చేయించేవారు.
(విజయక్రాంతి సౌజన్యం తో)