భారత రాజ్యాంగాన్ని లిఖించిన సమయంలో రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులందరూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో పుట్టి పెరిగిన మతాలన్నింటినీ హైందవ మతాలుగా రాజ్యాంగంలో ప్రస్ఫుటింపజేశారు. భారత్‌ను ‘మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం’ అన్నారు. అయితే, నేడు జరుగుతున్నదేమిటి? ఈ దేశంలో పుట్టి పెరగని ఇస్లాం, క్రైస్తవ మతాలను ‘మైనారిటీలు’గా పేర్కొంటూ వోటు బ్యాంకు రాజకీయాలతో పలురకాల తాయిలాలు ప్రకటిస్తున్నారు. హిందూమతం సర్వమత సమభావ వ్యవస్థకు నిదర్శనంగా అనాదిగా రాష్ట్రీయ స్వభావం కలిగి ఉండడంతో విదేశాల నుంచి మన దేశంలోకి చొరబడిన మతాలు స్వేచ్ఛను, సర్వహక్కులను పొందగలిగాయి.
సాంస్కృతికంగా, రాజకీయంగా ఇక్కడ బలపడిన విదేశీ మతాల వారిపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా పోయింది. హిందువుల ఆలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటి ఆదాయంపై అజమాయిషీ చేయడం పరిపాటిగా మారింది. హిందూ మతసంస్థల ఆస్తులపై తప్ప, జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాలపై పాలకులు దృష్టి సారించరు. పురాతన ఆలయాల్లో కోట్ల విలువ చేసే పంచలోహ విగ్రహాలు విదేశాలకు తరలిపోతున్నా మన ప్రభుత్వాలు పట్టించుకోవు. హిందూ ఆలయాల్లో చోరీలు జరుగుతున్నా ఆ కేసులు ఏళ్ల తరబడి కొలిక్కిరావు. దోషులకు శిక్షలు పడవు. ‘మైనారిటీల’ పేరిట ఇతర మతస్థుల కోసం ప్రభుత్వాలు దండిగా నిధులు ఖర్చు చేస్తుంటాయి. ఇతర మతాల పండుగల సందర్భంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఆ మతస్థులకు రానుపోను ఖర్చులు చెల్లించడం చూస్తున్నాము. ఇలాంటి సౌకర్యాలు హిందువులకు మాత్రం వర్తించవు.
రాయితీలు, సౌకర్యాల పేరిట ప్రభుత్వమే మతాల మధ్య అంతరాలను పాటించడం భావ్యం కాదు. ఇంత జరుగుతున్నా సహనశీలురైన హిందువులు పాలకుల విధానాలను ప్రతిఘటించడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పాలకులు ఇస్లాం మతస్థులకు ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం వోటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ఠ. ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇపుడు తెలుగు రాష్ట్రాల పాలకులు పోటీ పడి ప్రకటనలు గుప్పిస్తున్నారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం. అయినప్పటికీ పాలకులు ‘మైనారిటీల’ను మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అణగదొక్కబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన వరం. మత ప్రాతిపదికన ఈ సౌకర్యం ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాతలు ఏనాడూ భావించలేదు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని పౌరులందరూ సమానమే. అయితే, ‘ఉమ్మడి పౌరసత్వం’ వద్దంటున్న వారికి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? ‘ఉమ్మడి పౌరసత్వం’ అమలులో లేనందున ఓ వర్గం వారిలో బహుభార్యత్వం, అధిక సంతానం, మహిళలపై వివక్ష వంటివి కొనసాగుతున్నాయి. మతాచారాలను ఆధారంగా చేసుకుని ఆ వర్గం వారు ఈ దేశంలో తమ జనాభాను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భావజాలం ఇంకా పెరిగితే- భారత్ మరోసారి మత ప్రాతిపదికపై విడిపోయే ప్రమాదం లేదా? పాలకులు ఇకనైనా వోటు బ్యాంకు రాజకీయాలకు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలకు స్వస్తి పలకాలి. విదేశీ భావజాలం కలిగిన పార్టీలకు, కుహనా సెక్కులర్ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి.
బలుసా జగతయ్య
కార్యదర్శి, విస్తృత హిందూతత్వ సాహితి
(ఆంధ్ర భూమ సౌజన్యం తో )