Home Interviews రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సమాజంతో కలిసి నడుస్తుంది – ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి...

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సమాజంతో కలిసి నడుస్తుంది – ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి (మొదటి భాగం)

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభమై 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సంఘ ప్రస్థానంపై సర్‌కార్యవాహ భయ్యాజీ జోషితో ఆర్గనైజర్‌ వార పత్రిక జరిపిన ముఖాముఖి.

ప్రశ్న : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ 90 సంవత్సరాల పయనంపై మీ అభిప్రాయం ఏమిటి ? ఇన్ని సంవత్సరాలుగా జాతీయ జీవనానికి సంఘం చేసిన దాంట్లో అతిగొప్ప అంశం ఏమిటి?

సమాధానం : ఈ కార్యం ప్రారంభించిన సమయంలో మనం చేయవలసినందంతా హిందూ సమాజం కోసం, హిందూ సమాజంతో, హిందూ సమాజపు శక్తియుక్తుల ప్రాతిపదికగానే చేయాలనే భావన స్పష్టంగా ఉంది. ఒక సాధారణ వ్యక్తి సైతం అనుసరించగల, ప్రభావోపేతమైన కార్య సరళి ఆరంభించబడింది. కలసి ఆడుకోవడానికి, పాడుకోవడానికీ, చర్చించుకోవడానికి ఒక మైదానంలో అందరూ కలవటం, మేధో మథనాల వంటివేవీ లేకుండా సామాన్య వ్యక్తులు పాటించగల సాదా సీదా కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి.

ఇక సంఘం దేశం కోసం ఏం చేసిందంటే మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటగా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జన సామాన్యంలో ‘ఈ దేశం నాది’ అనే భావనను పెంపొందించటంలో సంఘం విజయవంతమైంది. రెండవది సాధారణ వ్యక్తి సైతం సమాజంలో ఏదైనా నిర్మాణాత్మకమైన పనికి పూనుకోగలడనే ఒక ఆత్మవిశ్వాసం నిర్మాణమైంది. ఇక మూడవది మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మనందరికీ తెలిసినవేనని మొదటి నుంచి సంఘం చెబుతూ వచ్చింది. కనుక సమస్యలు సృష్టించే వారు మనకు అక్కర్లేదు. సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపే వ్యక్తులను సంఘ వ్యవస్థ ఉత్పాదన చేస్తూ వచ్చింది.

ప్రశ్న : దైనందిన శాఖా వ్యవస్థ ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారి సొంత ఆలోచనా లేక ప్రపంచంలో ఎక్కడైనా జరిగిన ఏవైనా ప్రయోగాల నుంచి స్వీకరించినదా ?

స : ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగం జరగలేదు. సామాజిక జాగృతికై చిన్న చిన్న కేంద్రాలను నెలకొల్పాలని వివేకానంద స్వామి అన్నారు. భారతదేశపు మధ్య ప్రాంతం నుంచి అలాంటి చొరవ మొదలయ్యే సూచనలు నాకు గోచరిస్తున్నాయని కూడా ఆయన అన్నారు. కనుక ఆయన ఆలోచనా ప్రభావం ఉన్నది. ఏదో ఒక విధంగా ఈ దిశలోనే సంఘ కార్యం నడుస్తూ వస్తున్నది. కనుకనే డా||హెడ్గేవార్‌ ‘నేను క్రొత్తగా ఏమీ చేయటం లేదు’ అని స్పష్టంగా చెప్పేవారు. వేల సంవత్సరాలుగా కొనసాగతూ వస్తున్న నిర్విరామ ప్రయత్నాలతో ఇలా సంఘకార్యాన్ని ఆయన అనుసంధించారు. ఎక్కడ హిందువు ఉన్నా అక్కడకు చేరాలనే లక్ష్యంతో నాగపూర్‌ నుంచి సంఘ ప్రస్థానం ఆరంభమైంది.

ప్రశ్న : ఈ 90 సంవత్సరాల పయనంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా సంఘప్రస్థానం సాగుతూనే వుంది. ఇది ఎలా సాధ్యమైంది?

స : ఈ పయనలో కొన్ని దశలున్నాయి. 1925 నుంచి 1940 వరకు గల మొదటి దశలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం సాధ్యమేనని నిరూపితమైంది. 1948 నాటికి సంఘం సామాజిక జీవితంలో ఒక గణనీయమైన శక్తిగా తయారైంది. స్వాతంత్య్రానికి ముందున్న వాతావరణంలో హిందువులకు ఆత్మ విశ్వాసాన్నిచ్చే ఏకైక సంస్థగా సంఘం నిలిచింది. రాజకీయ నాయకుల్లో అత్యధికులు తమ స్వప్రయోజనాలలో తలమునకలుగా ఉండేవారు. 1948 నుంచి 1977 వరకు గల కాలాన్ని తదుపరి దశగా పరిగణిస్తాను.

మూడు కారణాలవల్ల ఈ దశ ముఖ్యమైనది. మొదటగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు, జిల్లాలకు చేరుకుంది. రెండవది సంస్థాగత కార్యపద్ధతి సంపూర్ణంగా వికసించింది. మూడవదేమంటే సంఘం యొక్క సైద్ధాంతిక భూమిక మరింత స్పష్టమై అసలు సంఘం అవసరమేమిటనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఈ విషయంలో 1973 వరకు సర్‌సంఘచాలక్‌గా వున్న పూజ్యశ్రీ గురూజీ అందించిన సేవ నిరుపమానం.

1975 తదుపరి సామాజిక పరివర్తనా ప్రక్రియకు చొరవ తీసుకున్న దశ వచ్చింది. సామాజిక శక్తి ప్రదర్శించబడిన శ్రీరామజన్మ భూమి ఉద్యమం కానివ్వండి, లేక సామాజిక సమరసత అంశాన్ని ముందుకు తీసుకుపోవటం కానివ్వండి. ఈ ప్రక్రియ 1969లోనే ఉడిపిలో ప్రారంభమైంది. సామాజిక సమస్యలకు మూలకారణం వివక్షేనని, దానిని నిర్మూలించాలని అక్కడ అన్ని సంప్రదాయాల వారు ముక్త కంఠంతో ప్రకటించారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత ఈ సమస్యకు సంబంధించిన ఆచరణాత్మక పరిణామాల గురించి శోధించాం. 1977 తర్వాత సంఘకార్యం ద్విగుణీకృతం కావడంతో బాటు చాలా సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రక్రియ ప్రారంభమైంది.

1990లో డా||హెడ్గేవార్‌ శతజయంతి ఉత్సవాలను తదుపరి ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. సమాజం పట్ల స్వయంసేవకులకు ఉన్న భావనలు అభివ్యక్తం కావాలి. సేవా పథకాల రూపంలో అది జరగాలి. ఇక ఇతర రంగాల్లోకి కూడా కాలుమోపే సాహసానికి పూనుకున్నాం. 1990 తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకోవడంతో సేవా, ప్రచార (మీడియా సంబంధాలు), సంపర్క (ప్రజా సంబంధాలు), ధర్మజాగరణ సమన్వయాల వంటి సరిక్రొత్త విభాగాలు మా కార్యవిధాన సరళిలో అదనంగా చేరాయి. శ్రీ గురూజీ శతజయంతి ఉత్సవాలు జరిగిన 2006-07 నుంచి మొదలైన తదుపరి దశలో సమాజంలో వీలైన అన్ని వర్గాల వారివద్దకు సంఘం చేరింది.

కులాన్ని సాధారణంగా ఒక సంక్లిష్టమైన సమస్యగా భావిస్తుంటారు. సామాజిక పరివర్తన ప్రక్రియలో ఈ కుల సముదాయాల నాయకులను తోడ్కోని పోవాలంటే నూతన చర్యలు అన్వేషించవలసి వున్నదని గ్రహించాం. 2006 తర్వాత ఈ ప్రక్రియకు మంచి ప్రోత్సాహం లభించింది. సామాజిక సద్భావనా సమావేశాలు జరిపాం. అలా ఈ 90 సంవత్సరాలలో కాలంతోపాటుగా సంఘం వికసించింది.

ప్రశ్న : ఆర్‌.ఎస్‌.ఎస్‌. రెండుసార్లు నిషేధానికి గురైంది. వేలాదిమంది కార్యకర్తలను జైళ్ళలో పెట్టారు. అయినా సంఘం పెరుగుతూనే వచ్చింది. దీని వెనుక ఉన్న రహస్యమేమిటి ?

స : దీనికి సంఘం యొక్క అనియత కార్యపద్ధతి ఒక కారణం. మాకు వ్యవస్థ (కార్య నిర్వాహణా శైలి) ముఖ్యమే, కాని ఈ నిర్వహణా శైలి మీదనే సంఘకార్యం ఆధారపడిలేదు. ఇందులో ఒక అనియత పద్ధతి ఉంది. సహజమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. విస్తృత సమాజంతో భావ ప్రసారం జరిపే ప్రక్రియ ఇందులో ఉంటుంది. సంఘంలో విశేషంగా చెప్పుకోవలసిన ప్రత్యేకత ఏమంటే దాని అనియత కార్యపద్ధతే. కనుక నిషేధాలు విధించినప్పుడు శాఖలు పనిచేయటం ఆగిపోయింది గాని అనియతమైన పరస్పర చర్యలు ఆగిపోలేదు. అందువల్ల నిషేధం ఎత్తివేయడంతో శాఖలు పనిచేయటం మొదలైంది. రెండవది వ్యక్తిగత లాభనష్టాలు పట్టించుకోకుండా పనిచేస్తూండే అంకితభావం కలిగిన కార్యకర్తలే మా బలం. ఈ కార్యకర్తల అంకితభావం వల్లనే సంఘం కష్టకాలాలను దాటి పయనించింది. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైన అంశమేమంటే ఎన్నిరకాల తుఫానులు చెలరేగినా మా మౌలికమైన సైద్ధాంతిక నిబద్ధత విషయంలో మేము రాజీ పడలేదు. సంఘం అప్పటికీ, ఇప్పటికీ నిరంతరంగా పెరుగుతూనే ఉంది.

ప్రశ్న : 1925లో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించటమే సంఘానికి ప్రధాన లక్ష్యంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ లక్ష్యాన్ని ఎలా పునర్‌ నిర్వచించారు ?

స్వాతంత్య్రోద్యమపు రోజుల్లోనే ఈ రకమైన పని (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) గురించి డా||హెడ్గేవార్‌ మనస్సులో మథనం జరుగుతుండేది. ఈనాటి సమస్యలకు మూలకారణం హిందూ సమాజపు మనస్తత్వంలోనే ఉంది తప్ప, కేవలం వలస పాలకుల వల్ల కలిగిన దాస్యం కాదనే మౌలికమైన భావనతో ప్రాతిపదికగా ఈ పక్రియ ఆరంభమైంది. ఆయన దృష్టిలో వలసపాలన అనేది ఈ మనస్తత్వానికి బాహ్య అభివ్యక్తీరణ మాత్రమే. అయితే అంతర్గతంగా సమాజం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. కనుక ఈ వ్యాధి మూలకారణానికి చికిత్స చేస్తే తప్ప మన జాతిని పీడిస్తున్న సమస్యల నుంచి బయట పడలేము. బ్రటిషువారు వెళ్ళిపోతారు, ఇంకెవరో వచ్చిపడతారు. సామాజిక శక్తిని జాగృతం చేస్తే బాహ్య దురాక్రమణ దారులతో మనం పోరాడగలుగుతాం.

‘మన లక్ష్యమేమిటి? ఎవరూ హిందూ సమాజం వైపు దుష్టబుద్ధితో కన్నెతి చూడటానికి కూడా సాహసించరాదు’ అని డాక్టర్‌జీ ఒకసారి అన్నారు. అలాంటి శక్తిని నిర్మాణం చేయటమే సంఘ మౌలికమైన ఆలోచన. ఇందుకుగాను ముందుగా స్వాతంత్య్రం సాధించాలి. ఎవరూ కన్నెతి చూడజాలని శక్తి నిర్మాణమైతే ఇక సంఘం అవసరం ఉండదు. కాని స్వాతంత్య్రం వచ్చినా కూడా సమస్యలు అపరిష్కృతంగా ఉండటం మనం స్పష్టంగా చూస్తున్నాం. కాని సమాజం మెల్లగా సమస్యల నుంచి బయటపడే ప్రక్రియ ప్రారంభమైందని ఈ రోజు మనం చెప్పగలం.

ప్రశ్న : సంఘం నిజంగా భారతీయులనందరినీ సమైక్యపరిచే ఉద్యమమని చెప్పగలమా ?

స : తరచుగా మనం హిందూ సంఘటన గురించి మాట్లాడుతుంటాం. అయితే మొత్తం సమాజాన్ని జాగృతం చేయాలనే ఆశిస్తున్నాం. తమను తాము హిందువుగా పరిగణించుకునే వారిని బలోపేతం చేయటం మొదటి దశ. హిందువును నిర్వచించడానికి సంఘం ఎన్నడూ ప్రయత్నించలేదు. ”తనను తాను హిందువుగా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా హిందువే” అని బాలాసాహెబ్‌ దేవరస్‌ ఒకసారి నిర్వచించారు. ఇంతకంటే మెరుగైన నిర్వచనం లేదు. హిందు, రాష్ట్ర అనేవి వేరువేరు కాదని, ఒకటేనని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం అనే పేరు సూచిస్తున్నది. హిందూ సమాజ జీవితమే ఈ జాతి జీవితం. కనుక హిందూ సమాజం కోసం పనిచేయడమంటే దేశం కోసం పనిచేయడమే.

”ఈ భూమి మీద కనీసం ఒక్క హిందువు ఉన్నంతవరకు కూడా హిందూరాష్ట్రం ఉంటుంది” అంటూ ఈ విషయాన్నే డాక్టర్‌జీ సరళమైన సుందరమైన పదాలలో చెప్పారు. హిందూ రాష్ట్రమనేది సంఖ్యాబలం మీద ఆధారపడలేదు. దీనిని సరియైన దిశలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు గాను మనం దీనికొక నూతన దృక్పథాన్ని ఇవ్వవలసి వుంది. ఈ మాటలకు సంబంధించి ఎలాంటి అయోమయాన్ని మేము సృష్టించాలనుకోవటం లేదు. ముందుగా మేము హిందువులలో పని చేస్తామని మాత్రం చెప్పదలుచుకున్నాం. అంతిమంగా ఇది మొత్తం సమాజాన్ని సంఘటితం చేసే పని. అదే సరియైనది, సరియైన దిశలోనే ఈ పని జరుగుతున్నది.

ప్రశ్న : గాంధీజీ కూడా సనాతన భారతీయ చింతన గురించి, స్వరాజ్యం, స్వదేశీ, గ్రామస్వరాజ్యం, గోరక్ష, ఆధ్యాత్మికత, నైతికత, సౌశీల్య నిర్మాణం వంటి జీవన విలువల గురించి చెబుతారు. సంఘం కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తున్నది. మరి సంఘాన్ని గాంధేయ ఆలోచనలకు ప్రత్యర్థిగా ఆరోపిస్తుంటారెందుకు? గాంధీ హత్యారోపణ కూడా సంఘం మీద మోపారు గదా! కారణమేమిటి?

స : స్వాతంత్య్రోద్యమంతో గాఢంగా పెనవేసుకున్న ఒకే పేరు చెప్పాలంటే అది మహాత్మాగాంధీజీ మాత్రమే. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించే వరకు గాంధీజీ నాయకత్వంలోనే ఉద్యమం నడిచింది. గాంధీగారి అనుచరులమనే చెప్పుకునే కొందరు గాంధీజీ తమవాడేనంటారు. గాంధీజీ యావత్‌ జాతికి చెందినవాడని మేము చెబుతున్నాం. స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యంతో ఏర్పడిన వేదిక (కాంగ్రెసు) ఇక అవసరం లేదని ఆయన చెప్పారు. కాని ఒకానొక రాజకీయ దృక్పథం కలిగిన వారికి తమ భవిష్యత్తు ఈ పేరుతోనే ముడిపడి ఉన్నదని తెలుసు. వారు గాంధీజీ మాటను పెడచెవిని బెట్టారు. తరువాత దురదృష్టవశాత్తు ఆయన హత్యకు గురయ్యారు.

గాంధీగారి కొన్ని రాజకీయ ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు గాని జాతి, సమాజం, భారతీయ తాత్వికతలకు సంబంధించి ఆయన ఆలోచనలతో సంఘానికి ఎలాంటి వైరుధ్యాలు లేవు. కాని దేశంలో ఆవిర్భవిస్తున్న ఒక బలీయమైన శక్తిని (ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను) బలహీన పరచాలనుకున్న వారికి గాంధీజీ హత్య ఒక సాకుగా దొరికి సంఘం మీద ఆ నేరాన్ని ఆరోపించారు. వారి దృష్టిలో వారి భవిష్యత్తుకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఒక రాజకీయ ముప్పు. కనుక ఎలాగైనా సరే దానిని నిర్మూలించాలనుకున్నారు. సాధారణ ప్రజానీకానికి గాంధీజీ పట్ల అపారమైన గౌరవాదరాలున్నాయి. అందువల్ల పదేపదే ఈ ఆరోపణ చేశారు. ఇప్పటిదాకా చేసిన అలాంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. అలాంటి ఆరోపణలు చేసినవారంతా ప్రతిక్రియ చూసి తోకముడవక తప్పలేదు. న్యాయ ప్రాతిపదిక మీదగాని మరేవిధంగా గాని ఈ అంశాన్ని ఉపయోగించి మమ్మల్ని ఎవరూ ఓడించలేరని ధీమాగా చెప్పగలం. మేము చిత్తశుద్ధితో ముందుకు వచ్చాం.

ప్రశ్న : సంఘం గురించి చాలా అపోహలున్నాయని, ఈ అయోమయాలలో చాలా వాటిని తొలగించవలసి ఉన్నదని మీరు భావిస్తున్నారా ?

స : తప్పకుండా! మేము ఎదిగిన కొద్దీ గ్రామీణ ప్రాంతాలకు, మురికి వాడలకు సమాజంలోని వివిధ కులాలకు, వర్గాలకు, షెడ్యూల్‌ కులాలకు, షెడ్యూల్‌ జాతులకు చేరుకుంటున్నాము. అనేక విధాలుగా మా సేవా కార్యక్రమాలు కూడా వారికి చేరుతున్నాయి. దీనంతటి ఫలితంగా ప్రజల మనసుల్లోని అపోహలు తొలగిపోతున్నాయి. కాలక్రమంలో మరికొన్ని తొలగిపోతాయి.

ప్రశ్న : ఎమర్జెన్సీ తర్వాత సంఘం రాజకీయ పాత్ర గురించి చాలా విషయాలు పత్రికల్లో వచ్చాయి. 2014 సాధారణ ఎన్నికలలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పాత్ర గురించి కూడా చర్చ నడిచింది. సంఘానికి ఎమైనా రాజకీయ శక్తి ఉన్నదా ? లేక సంఘం తనను తాను నైతిక మార్గదర్శిగా భావించుకుంటున్నదా ?

స : వాస్తవమేంటే సంఘానికి రాజకీయ రూపాన్ని కల్పించే ప్రయత్నాలు 1948లోనే ప్రారంభమైనాయి. 1975-77 మధ్య మన ప్రజాస్వామిక జీవితానికి ముప్పు ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యమైంది. అందువల్ల సంఘం మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి లోక్‌ సంఘర్ష సమితి ద్వారా తన శక్తినంతటినీ కూడగట్టింది. ఫలితంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. సంఘమే గనుక అప్పట్లో రాజకీయ శక్తిని ప్రభావితం చేయదలుచుకొని వుంటే ఆ రాజకీయ ప్రక్రియ చేపట్టడానికి కావలసినంత శక్తి సామర్థ్యాలు ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు ఉన్నాయి. సంఘం చెప్పిన దానిని ప్రజలు అనుమతించి వుండేవారు. కాని 1977 సాధారణ ఎన్నికలు అవగానే సంఘం ఇక మా పాత్ర ముగిసిందని, దేశ రాజకీయ శక్తిని నడిపించవలసిన వారంతా కలసి కూర్చొని పరస్పర సంప్రదింపులతో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

ఆ సమయంలో రెండు అసాధారణ వ్యక్తిత్వాల నాయకత్వం పరీక్షకు నిలిచింది. వారిలో ఒకరైన జయప్రకాశ్‌ నారాయణ్‌ 1977 విజయానంతరం ఉద్యమం నుంచి, జనతాపార్టీ నుంచి తనకు తాను వేరైనారు. రెండవ వారు బాలా సాహెబ్‌ దేవరస్‌ ఎన్నికల ఫలితాల అనంతరం తక్షణమే స్వయంసేవకులు ఇక తమ మౌలికమైన పనిలోకి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మొత్తం సమాజం ప్రభావితమైన ప్రక్రియలో సంఘం దూరంగా ఎలా ఉండగలదు ? సంఘం సమాజం వెంట నిలిచి సమాజంతో పాటు కలిసి నడుస్తుంది. ఇక ముందుకూడా సమాజ మేల్కొలుపు, సామాజిక ప్రయోజనాల నిమిత్తం ఉద్యమాలు వచ్చినప్పుడల్లా వాటికి దూరంగా ఉండటం స్వయంసేవకులకు సాధ్యం కాదు. ఈ రకమైన ఉద్యమాలతో మాకు అవినాభావమైన అనుబంధం ఉంటుంది.