ప్రముఖ కథక్ నృత్యకళాకారుడు శ్రీ బిర్జూ మహరాజ్‌గా కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
బిర్జూ మహారాజ్ 1937 ఫిబ్రవరి 4న లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందిన కథక్ కళాకారుల కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవారు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దారు.
తండ్రి అచ్చన్ మహరాజ్ రాయ్‌ఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నారు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.
బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించారు. తరువాత భారతీయ కళాకేంద్ర, సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో పదవీ విరమణ చేశారు.
పండిట్ బిర్జూ మహారాజ్ పద్మ విభూషణ్(1996)తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం ఆయనకు లభించిన ఇతర అవార్డులు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం , ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు బిర్జు మహారాజ్‌కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.
బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా షత్రంజ్ కే ఖిలారి లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవదాస్ , దేద్ ఇష్కియా , ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి 2012 లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన ‘మోహే రంగ్ దో లాల్ పాటకు కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆయన మృతి పట్ల దేశంలోని ప్రముఖులు, సంగీత కళాకారులు, రాజకీయ నాయకులు సంతాపాన్ని ప్రకటించారు.