రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్ భాగవత్ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా ప్రకటనతో సంఘానికి సంబంధం లేదు…” అని మోహన్ భాగవత్ అన్నట్లుగా ఆ పత్రిక తెలిపింది. అంతేకాకుండా మోహన్ భాగవత్ ప్రకటనను బీజేపీ లేదా సంఘ్ విధానాలతో సరిపోల్చకూడదని కూడా అందులో వుంది. దైనిక్ జాగరణ్ వార్తపై అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పందించారు. ఆ పత్రిక పేర్కొన్న వార్త పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. మోహన్ భాగవత్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంఘ్ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాల్లో పాల్గొనడం కోసం దేశమంతా పర్యటిస్తున్నారని తెలిపారు.