Home News ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం

ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం

0
SHARE

ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ నాయగి, గణపతి, బాల మురుగర్‌, సప్త ఋషులతో పాటు నవనాథులు, 18 మంది సిద్ధపురుషులు, నవగ్రహాలతో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా వున్నాయి. శివాలయం వ్యవస్థాపకులు ఆచార్య ఈశ్వరానంద మాట్లాడుతూ… ఈ ఆలయం ప్రారంభం కావడం తమకు బాగా సంతోషాన్నిచ్చిందన్నారు. సనాతన ధర్మాన్ని ఋషులు, అనేక మంది సిద్ధులు అనుసరిస్తున్నారని, వారి అడుగు జాడల్లో నడుస్తున్నామని, ఈ దేవాలయం సనాతన ధర్మం బోధనలు, అంకిత భావానికి ప్రతీక అని అభివర్ణించారు.

ఈ ఆలయం 5500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వుంటుంది. ఎస్టోనియన్‌ రాజధాని టాలిన్‌కి సమీపంలో వుండే లిల్లేరు అనే సుందరమైన ప్రాంతంలో వుంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఆగమ, శిల్ప శాస్త్రాలకనుగుణంగా నిర్మాణం చేశారు. పూర్తిగా హిందూ పద్ధతులు, సంప్రదాయాలను అనుసరించే చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే తమిళనాడుకి సంబంధించిన శ్రీతెంకని సంప్రదాయ పద్ధతిని కూడా అనుసరించామని పేర్కొన్నారు.

ఎస్టోనియాలో హిందువుల జనాభా చాలా తక్కువగా వుంటుంది. అయితే.. హిందువులు జీవిస్తున్న తీరు, వారి జీవన శైలి అక్కడి వారిని బాగా ప్రభావితం చేసింది. యోగా, ధ్యాన పద్ధతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందూ సంప్రదాయల పట్ల అక్కడి వారు బాగా ఆకర్షితులయ్యారు.