Home Telugu ‘సమర్పణ, సంతులనం, కర్తవ్యం’ గుణాలతో మూర్తీభవించిన వ్యక్తిత్వం హరిహర శర్మ గారిది: శ్రీ దత్తాత్రేయ...

‘సమర్పణ, సంతులనం, కర్తవ్యం’ గుణాలతో మూర్తీభవించిన వ్యక్తిత్వం హరిహర శర్మ గారిది: శ్రీ దత్తాత్రేయ హోసబళే

0
SHARE

స్వర్గీయ హరిహర శర్మ సంస్మరణ సభలో శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు

ప్రముఖ విద్యావేత్త, కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థల కార్యదర్శి, జాగృతి ప్రకాశన్‌ ట్రస్టు కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ నాయకులు తుమ్మలపల్లి హరిహరశర్మ జూన్‌ 29 రాత్రి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. శర్మ సంస్మరణ సభ జూలై 11 మంగళవారం సాయంత్రం భాగ్యనగర్‌ నారాయణగూడలో గల కేశవ మెమోరియల్‌ కళాశాల ప్రాంగణంలోని పటేల్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, మరో సహ సర్‌ కార్యవాహ వి.భాగయ్య, ఎబివిపి అఖిల భారత నిర్వాహక కార్యదర్శి సునీల్‌ అంబేకర్‌ మొదలైన ప్రముఖులు పాల్గొని ప్రసంగించి, శర్మ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.

హరిహర శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రముఖ విద్యావేత్త అని, పాపులర్‌ కానప్పటికి ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి అని వక్తలు కొనియాడారు. ఆయన ఆదర్శ కార్యకర్త అని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించటం ఒక్కటే సరిపోదని, ఆయన అడుగు జాడలలో నడవడమే వారి మృతికి నిజమైన నివాళి అని అన్నారు.

ఈ సభలో ప్రముఖులతో పాటు స్వర్గీయ హరిహర శర్మ కుమార్తె శ్రీమతి పద్మజ కూడా ప్రసంగించారు. సభలో హరిహర శర్మ స్మారకార్ధం ప్రచురించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది.

సంస్మరణ సభలో పాల్గొన్న వక్తల సందేశాలు క్లుప్తంగా..

శ్రద్ధాంజలి ఘటిస్తే సరిపోదు – దత్తాత్రేయ హోసబళే, సహ సర్‌ కార్యవాహ, ఆర్‌.ఎస్‌.ఎస్‌.

పరమేశ్వరుని లీలలకు మనం తలవంచాల్సిందే. ఆ విధంగా హరిహర శర్మగారు కీర్తిశేషులయ్యారని మనం అంగీకరించాలి. శర్మగారి బహుముఖ వ్యక్తిత్వం, ప్రజ్ఞ మరువరానివి. తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి గాని, దేశంలోని వివిధ విషయాల గురించిగాని వారితో మాట్లాడి వారి యోగ్యమైన మార్గదర్శనం పొందేవారం. వారి మరణంతో అది లోపించింది. వృత్తి, ప్రవృత్తి పరంగా జీవితాంతం ఆదర్శంగా నడిచి గురుతుల్యులుగా ప్రసిద్ధి చెందారు. యశ్వంతరావు కేల్కర్‌ గురించి చెప్పుకుంటూ వారు డాక్టర్జీ అంశే అనుకునేవారం. శర్మగారికి కూడ ఇది వర్తిస్తుంది.

దేశం మొత్తంలో అనేక తరాల కార్యకర్తలకు శర్మగారి స్వయంసేవకత్వ జీవనం ఆదర్శం. ఒకవైపు టీచర్‌గా వారు నేర్చుకొంటూనే, మరోవైపు విద్యార్థులకు పరిషత్‌ ద్వారా మార్గదర్శనం చేశారు. జాగృతి వారపత్రికకు అనేక విధాల రచనలు చేసేవారు. ఎబివిపిలో తీర్మానాలను తయారు చేయాలంటే శర్మగారే. ఎబివిపిలో అభ్యాస వర్గ నమూనాలను వీరే రూపొందించేవారు. శర్మగారు ఆ విధంగా ఎబివిపి రథాన్ని ముందుకు లాగారు.

దేశభక్తి నిండిన జర్నలిస్టులను సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో రచన జర్నలిజం కళాశాలను స్థాపించిన వారిలో శర్మగారి కృషి అభినందనీయం.

వ్యక్తి నిర్మాణం అంటే ఏమిటనే విషయంలో ఆయనే రోల్‌మోడల్‌. యుగానుకూల ధర్మాన్ని పాటిస్తూ, తన జీవితాన్ని సమర్పించారు శర్మగారు.

‘సమర్పణ, సంతులనం, కర్తవ్యం’ అనే ఈ మూడు విషయాలను వారు సమర్థంగా పాటించారు. గృహస్థు ధర్మాన్ని, సంస్థ నిర్వహణ బాధ్యతలను, ఉద్యోగ ధర్మాన్ని సమానంగా, సమర్థంగా పాటించడం ఒక అసిధారా వ్రతం. శర్మగారు వారి జీవితంలో, వారు బాధ్యత వహించిన చోట, ఉద్యోగాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి సంయమనంతో, కర్తవ్య నిష్ఠతో ముందుకు సాగారు. ఎక్కడ తక్కువో అక్కడ దానిని పూరించడం వారి గొప్పతనం. కేశవమెమోరియల్‌లో వారి అవసరం ఉంది అని చెప్పగానే బాధ్యతలను స్వీకరించారు. సంఘం ఏ పని చెప్పినప్పటికీ కాదనకుండా బాధ్యతను స్వీకరించి పనిచేసేవారు.

గీతలో చెప్పినట్లు వాఙ్మయ తపస్సు, శారీరిక తపస్సు, మనో తపస్సును సాధించారు. స్థితప్రజ్ఞుని లక్షణాలు వారిలో ఉన్నాయి.

‘ముక్తసంఙ్గో న హంవాది – ధృత్యుత్సాహ సమన్వితాః’ అనే శ్లోకంలో చెప్పినట్లు అహంకారం దరికి రానీయలేదు. తన పేరు లేకుండా అనేక వ్యాసాలు రాసారు. వాటన్నిటిని కలిపితే 2000 పేజీల పుస్తకం అవుతుంది. సుఖ దుఃఖాలను, జీవితంలోని ఒడుదుడుకులను ఒకే విధంగా భావించారు శర్మగారు.

55 సంవత్సరాల వయస్సులో ఎల్‌ఎల్‌బి, తర్వాత ఎల్‌ఎల్‌యం చేసి యూనివర్సిటీలో 2వ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. నిర్వికార బుద్ధితో జీవించారు. భారతీయ జీవన విలువలలో దేవ, ఋషి, పితృ, సమాజ ఋణాలను తీర్చుకున్నారు. ఒక మౌన ఋషిలాగ ఈ 4 ఋణాలను తీర్చుకోగలగటం అద్భుతం. ప్రతి స్వయంసేవక్‌ నుండి సంఘం కోరేది ఇదే.

ఎబివిసి సంస్థ పనిలో ఎంతో సంఘర్షణ అనుభవించాల్సి వచ్చింది. అలాంటప్పుడు వెన్న లాంటి హృదయం గల శర్మగారు అవసరాన్న నుసరించి కఠోర నిర్ణయాలు కూడా తీసుకొని పనిలో మార్గదర్శనం చేసారు. అనేక మంది కార్యకర్తలకు కష్ట సమయాలలో తండ్రిలాగ అండగా నిలిచారు. వారు గతించినప్పటికి దీప స్థంభం వలె దేదీప్య మానంగా వెలుగుతూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. దారిలో నడుస్తూ నడుస్తూ స్వయంగా వారే దారిగా మారారు. అలాంటి హరిహరశర్మ గారికి నేను హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రద్ధాంజలి ఘటించటంతోనే మన పని పూర్తి కాదు. వారిని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగుజాడలలో నడిచినప్పుడే వారి జీవితానికి సార్థకం చేకూరుతుంది.

శర్మగారికి మరణం లేదు – వి.భాగయ్య, సహ సర్‌ కార్యవాహ, ఆర్‌.ఎస్‌.ఎస్‌.

హరిహర శర్మగారు ఆంధ్ర యూనివర్సిటిలో విద్యాభ్యాసం చేస్తూ క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. సంఘ పని చేస్తూ, గృహస్థుగా, కళాశాల ప్రిన్సిపాల్‌గా సమర్థజీవనం సాగించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్నో విపత్కర పరిస్థితులలో సమాజానికి మార్గదర్శనం చేశారు. సంపూర్ణ సమాజంలో ఏకత్వాన్ని సాధించటంలో శర్మగారి జీవితం అంకితమైంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సంస్థలకు శ్రద్ధా కేంద్రంగా సోమయ్యగారు, సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వరుసలో వారు జీవించారు. ఏ సమస్య వచ్చినా శర్మగారు చెప్పిందే అంతిమ నిర్ణయంగా స్వీకరించేవారం. ఎంత పనివత్తిడిలో ఉన్నా ఎన్నో పుస్తకాలు రాసారు. చనిపోయే ముందు వరకు జాగృతికి సంపాదకీయాలు రాసారు. చివరివరకు కేశవ మెమోరియల్‌ విద్యా సంస్థల అభివృద్ధి గురించి ఆలోచించారు. వృద్ధాప్యం కారణంగా వారి ఇంటి పనిలో సహాయంగా ఒక మహిళను జీతంపై నియమిస్తే, ఆమెకు ఎంత జీతం ఇచ్చేవారమో అంత మొత్తాన్ని తిరిగి కేశవ మెమోరియల్‌లో జమ చేసేవారు శర్మగారు. శర్మగారు ఎప్పుడూ గుర్తింపును కోరుకోలేదు. కొంతమంది పాపులర్‌ కారు, కాని వారికి ఫాలోయింగ్‌ ఉంటుంది. డాక్టర్‌ హెడ్గేవార్‌ పాపులర్‌ కాలేదు, కాని వారికి ఇప్పటికీ ఫాలోయింగ్‌ (అనుచర గణం) ఉంది. ఆ వరుసలోని వారే శర్మగారు కూడా.

శర్మ గారు సత్యాన్ని ప్రియంగా చెప్పేవారు. పొరపాటు జరిగితే తప్పక సున్నితంగా హెచ్చరించే వారు. ఇది ఒక సాధన.

మన మధ్య ఒక విద్యావేత్తగా, రచయితగా, సంఘర్షణ సమయంలో దారి చూపే దీపకళికగా ఉన్నారు. కేశవమెమోరియల్‌ విద్యా సంస్థలను ఎంతో వికసింపచేసారు. సంఘ పనిలో వారికి వారి కుటుంబసభ్యుల తోడ్పాటు ఎంతో ఉంది. శర్మగారికి మరణం లేదు. కర్మయోగం అది. వారి శరీరం వెళ్ళి పోయినా వారి జీవితం వెలిగే దీపం లాగ మనందరికీ ప్రేరణనిస్తుంది. ఆ విధంగా వారి జీవితం సార్థకం అయింది. వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

రాబోవు తరాలకు మార్గదర్శి-  సునీల్‌ అంబేర్‌, ఎబివిపి అఖిల భారత నిర్వాహక కార్యదర్శి

ఒక వ్యక్తిని చూసిగాని, లేదా అతను చేసిన మంచి పనులను చూసిగాని అతని వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు. స్వర్గీయ హరిహరశర్మ తన శాంత స్వభావంతో స్వర్గీయ గౌరీశంకర్‌ మొదలుకొని నేటి వరకు అనేకమంది ఎబివిపి కార్యకర్తలకు మార్గ దర్శనం చేసారు. ఆంధ్ర, తెలంగాణలలో ఎబివిపికి ఎదురైన సంఘర్షణాత్మక సమయంలో ప్రతిక్రియాత్మ కగా కాకుండా, సకారాత్మక ధోరణిలో రాబోవు తరాలకు మార్గదర్శకంగా ఉండేవిధంగా కార్యాన్ని ముందుకు నడిపించారు శర్మగారు. రాబోవు తరాలకు వారు మార్గదర్శనం చేసిన పద్ధతి మా అందరికీ ఆదర్శం.

జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి విశ్రాంత పాట్నా హైకోర్టు జడ్జి

హరిహరశర్మ గారి సంస్మరణ సభలో పాల్గొనడం నాకు అసాధారణం. వారు లేకుండా ఈ వేదికపై పాల్గొనడం మరీ విచారకరం. పని విషయంలో శర్మగారు చిన్నలకు, పెద్దలకు ఒకే రకమైన గౌరవం ఇచ్చేవారు. కేశవ మెమోరియల్‌కి వారి మరణం పూడ్చలేని లోటు. వ్యక్తులకంటే దేశమే ముఖ్యం. కానీ వ్యక్తులే సంస్థకు పునాది. సంస్మరించుకోవలసిన వ్యక్తులలో శర్మగారు ఒకరు. వారు మన మధ్య లేపోయినప్పటికి వారి జీవితం మనకు ఆదర్శం.

యస్‌.వి.శేషగిరిరావు, భాజపా వరిష్ఠ సిద్ధాంతకర్త

శర్మగారు నాకన్నా రెండేళ్ళు చిన్నవారు. వారి శ్రద్ధాంజలి సభలో పాల్గొనవలసి రావడాన్ని నేను ఊహించలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా భయంకర మైన సంఘర్షణ వాతా వరణంలో ఎబివిపి పని చేస్తూండేది. కనపడని శత్రువుతో యుద్ధం చేయవలసి వచ్చేది. 1970 నుండి 1995 వరకు 25 సంవత్సరాల పాటు ఈ సంఘర్షణ కొనసాగింది. ఈ సమయంలో శర్మగారు కార్యకర్తలకు ఏంతో అండగా ఉన్నారు. వారి అడుగు జాడలు ఎందరికో స్ఫూర్తినిస్తుంటాయి. వారి పాదాలకు నమస్కరిస్తున్నాను.

విఠల్‌రావు, ఆర్య సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షులు

కాలంతో పాటు సంస్థలు బలహీన పడతాయి. అలా కేశవ మెమోరియల్‌ విద్యా సంస్థలు బలహీన పడుతున్న సందర్భంలో హరిహర శర్మ గారు ఈ విద్యాసంస్థల బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత ఆ విద్యాసంస్థలు బాగా బలపడ్డాయి.

సోమయాజులు, వనవాసీ కళ్యాణ ఆశ్రమ అఖిల భారత కార్యనిర్వాహక కార్యదర్శి

గత 4 దశతాబ్దాలుగా నాకు శర్మగారితో సత్సంబంధాలున్నాయి. జీవిత చివరి క్షణం వరకు సంఘ కార్యంలో కొనసాగిన వ్యక్తి శర్మగారు.

లక్ష్మణ్‌, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు

శర్మగారి మరణవార్త విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. తుదిశ్వాస వరకు వారు నమ్మిన సిద్ధాంతంకై పని చేసారు. విద్యారంగం గురించి శర్మగారికి చక్కటి అవగాహన ఉంది. నేడు కేశవ మెమోరియల్‌ కళాశాల హైదరాబాద్‌లో ప్రముఖ కాలేజీలలో ఒకటిగా కొనసాగటం వెనుక శర్మగారి కృషి మరువరానిది. వారు లేని లోటు తీర్చలేనిది.

పి.వేణుగోపాల్‌ రెడ్డి, జాగృతి సంపాదకులు

1980లో జాగతి కార్యాలయం విజయవాడ నుండి హైద్రాబాద్‌కి బదిలీ అయ్యింది. అప్పటి నుండి శర్మగారికి జాగతితో సన్నిహిత సంబంధం ఉంది. శర్మగారు జాగృతిలో సంపాదకీయాలతో పాటు సినిమా, స్పోర్ట్స్‌ రివ్యూ కూడా రాసేవారు. నవలలు కూడా చదివి వాటి గురించి కూడా చెప్పేవారు. జాగృతిలో అత్యధిక వారాలు సంపాదకీయాలు రాసినవారు శర్మగారే. ఇన్ని సంవత్సరాల పనిలో ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా ఎలా పనిచేయవచ్చో శర్మగారు చేసి చూపించారు. సంస్థ నిర్ణయించిన విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించే మనస్తత్వం శర్మగారిది.

నీల్‌గోకటే, కేశవ మెమోరియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

శర్మగారు కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థలకు గొప్ప అండగా ఉండేవారు. వారి స్మరణపై ప్రతి సంవత్సరం లా కాలేజిలో ప్రతిభా పురస్కారం (గోల్డ్‌ మెడల్‌), ప్రతి జూన్‌ 29న శర్మగారి స్మారకోపన్యాసం ఉంటాయని నిర్ణయించాము.

(జాగృతి సౌజన్యం తో)