Home News దేశీయ ఆవులే మేలు, విదేశీ సంకరజాతి వీర్యం సేకరణకు రైతుల నిరాదరణ

దేశీయ ఆవులే మేలు, విదేశీ సంకరజాతి వీర్యం సేకరణకు రైతుల నిరాదరణ

0
SHARE

తెలంగాణలో నాటు ఆవుల ఉత్పత్తిపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఇంతకాలం సంకరజాతి గిత్తల వీర్యంతో ఆవుల్లో కృత్రిమ గర్భధారణకు మొగ్గుచూపిన రైతులు ఇప్పుడు నాటు, దేశవాళీ జాతి పాలకు డిమాండు పెరుగుతున్నందున వాటి పెంపకానికే మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒంగోలు, గుజరాత్‌కు చెందిన గిర్‌ జాతి గిత్తల వీర్యం తమ ఆవులకు కావాలని అడిగేవారి సంఖ్య బాగా పెరిగిందని తెలంగాణ పశుసంవర్థకశాఖకు చెందిన ‘రాష్ట్ర పశుగణాభివృద్ధి సొసైటీ’(ఎల్‌డీఏ) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సొసైటీకి కరీంనగర్‌లో పశు ఘన వీర్య అభివృద్ధి కేంద్రం‘(ఎఫ్‌ఎస్‌బీఎస్‌) ఉంది. గతేడాది కరీంనగర్‌ ఈకేంద్రంలో 12.72 లక్షల వీర్యం నమూనాలు ఉత్పత్తి కాగా అవి సరిపోలేదు. తమిళనాడు నుంచి 4.50 లక్షలు, గుంటూరు కేంద్రం నుంచి మరో 50 వేలు తెప్పించి మొత్తం 16 లక్షల నమూనాలు తెలంగాణ పాడి పశువులకు ఇచ్చారు. ఈ ఏడాది మరో 16 లక్షల నమూనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నా ఇక్కడే ఉత్పత్తికి అవకాశాల్లేక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017-18 చివరికల్లా తెలంగాణలో పశువీర్యం ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి కొత్తగా ఎఫ్‌ఎస్‌బీఎస్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇది పూర్తయితే అదనంగా 20 లక్షల నమూనాల ఉత్పత్తికి అవకాశముంటుంది.

గిత్తల కొరతతో సమస్యలు

మేలైన పాడి పశువులు పుట్టాలంటే వీర్యం సేకరణకు గిత్తల ఎంపిక అత్యంత ముఖ్యం. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ‘కేంద్ర గిత్త పంపిణీ కమిటీ’ని ఏర్పాటుచేసింది. తెలంగాణకు ఈఏడాది 36 మేలైన గిత్తలు, మరో 30 దున్నలు కావాలని ఎల్‌డీఏ ప్రతిపాదనలు పంపింది. ఒక్కోదానికి రూ.3 లక్షల వరకూ ధర నిర్ణయించారు. మొత్తం 36 గిత్తల్లో ఒంగోలు జాతివి 10, గిర్‌ జాతి 6 గుజరాత్‌ నుంచి తెప్పిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ కేంద్రంలో 58 దున్నలు, మరో 34 గిత్తలుండగా వీటి వీర్యదానకాలం తీరడంతో 20 పశువులను పంపేస్తున్నారు. సంకరజాతి పాడి పశువుల నిర్వహణ భారంగా ఉండటంతో రైతులు దేశవాళీవైపు మొగ్గు చూపుతున్నారు.

మేలైన పశుజాతి సంఖ్యను పెంచుతాం

తెలంగాణలో అధిక పాలనిచ్చే ఆవులు, గేదెల సంఖ్యను పెంచడానికి కృత్రిమ గర్భధారణను భారీగా నిర్వహిస్తున్నాం. రైతు రూ.40 చెల్లిస్తే పశువుకు వీర్యం నమూనా ఇస్తాం. ఇప్పటికే అధిక పాలిచ్చే ఆవుకు మా దగ్గర ఉన్న మేలైన గిత్త వీర్యం ఇచ్చి పుట్టే ఆవుదూడను జాగ్రత్తగా పెంచుతారు. వాటికి మళ్లీ మా కేంద్రం నుంచే మేలైన గిత్త వీర్యం ఇచ్చి ఆపైన పుట్టే గిత్తను మాత్రమే రూ.3 లక్షలిచ్చి కొంటారు. ఈ కార్యక్రమం వల్ల పలు రాష్ట్రాలు, విదేశాల్లో అధిక పాలిచ్చే పశువుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

(ఈనాడు సౌజన్యం తో )