దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాల విషయంలో గట్టి నిర్ణయమేదీ తీసుకోలేక ప్రభుత్వం తల పట్టుకుంటోంది. నిజమే. అంత తీవ్రమైన సమస్యే ఇది. అలా చొరబడుతున్నవారు ఒకరో, ఇద్దరో, ఏ కొందరో కాదు. వేల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ ఎర్రతివాచీ పరచి స్వాగతించాల్సిందేనని, ఆశ్రయమిచ్చి ఆదరించాల్సిందేనని కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. కేంద్రప్రభుత్వ స్పందన కోసం కూడా ఎదురుచూడకుండా ఆ తరహా వాదనల్ని సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా కొట్టివేయాల్సిన సందర్భమే ఇది. తనకు ఆ అవకాశం ఉంటే సుప్రీంకోర్టు అదే పనిచేసేది. కానీ, చట్టాలు చేసి వాటిని నిర్వచించే అధికారాన్ని న్యాయమూర్తులకు మన రాజ్యాంగం కల్పించలేదు. రోహింగ్యాలను స్వీకరించాలా వద్దా అన్న దానిమీద నిర్ణయం తీసుకొనే అధికారం రాజకీయ కార్యనిర్వాహక వర్గానిదేనని, అది పూర్తిగా వారి పరిధిలోని అంశమేనని చెప్పడానికి పెద్ద విజ్ఞాని కానక్కర్లేదు. ఈ విషయంలో న్యాయస్థానం చెప్పగలిగింది, చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు. కానీ, వరస వెంబడి తప్పులు చేస్తున్న కార్యనిర్వాహక వర్గం, కొన్ని విషయాల్లో న్యాయవ్యవస్థ సైతం కలుగజేసుకొనక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. కొంతవరకు పరిధి దాటి, చొరవ చూపేందుకూ కొందరు న్యాయమూర్తులు సిద్ధపడటాన్నిబట్టి పరిస్థితుల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు రోహింగ్యాల విషయంలోనూ అదే జరుగుతోంది.
రాజకీయాలే ముఖ్యమా?
రోహింగ్యాల విషయంలో వామపక్ష ఉదారవాదుల వైఖరి మరీ విచిత్రంగా ఉంది. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంగతే తీసుకోండి. స్వదేశం (బంగ్లాదేశ్)లో కరడుగట్టిన మత ఛాందసవాదుల నుంచి ఆమె ప్రాణహాని ఎదుర్కొంటున్నారు. కొంతమంది మూఢులు ఆమెను కడతేర్చేందుకు కంకణం కట్టుకొన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఆమె అర్థిస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ ఆమెను భారతదేశంలోకి రానివ్వరాదని వామపక్ష ఉదారవాదులమని చెప్పుకొంటున్నవారు వాదిస్తున్నారు. ఇక్కడ నివసించడానికి ఆమెకు వీసా ఇవ్వరాదంటున్నారు. భారతదేశంలో వివిధచోట్ల పర్యటించినప్పుడు ఆమె మీద జరిగిన దాడుల్ని వారు గట్టిగా ఖండించలేకపోయారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా భారత్‌లోకి వెల్లువలా వచ్చిపడుతున్న రోహింగ్యాలను మాత్రం అక్కున చేర్చుకోవాలంటున్నారు. దేశంలో ఎక్కడైనా నివసించేందుకు వారికి అవకాశం కల్పించాలంటున్నారు. అలాంటి వాదన లేవదీస్తున్నవారిలో కొందరు ప్రముఖ న్యాయవాదులూ ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితులు. మానవతా దృక్పథంతో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలంటున్నారు. వారి వాదనలో పసలేదు. తినడానికి తిండిలేక, దొరికిన చోట తలదాచుకొంటూ కాలం వెళ్లదీస్తున్నవారు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి బతుకులకే భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఎక్కడో మియన్మార్‌లో సైనిక అణచివేత కారణంగా పరారై, అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నవారికి ఎక్కడ ఆశ్రయం కల్పిస్తారు? చాలీచాలని వనరులతో దేశం ఇప్పటికే అవస్థలు పడుతోంది. అక్రమంగా వచ్చినవారికి ఆ వనరుల్లో వాటా ఎలా ఇస్తారు? భారతదేశం ఏమన్నా ధర్మశాలనా… ఎవరుబడితే వారు వచ్చి తిష్టవేయడానికి?
రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించాల్సిందేనని అంటున్నవారు, రాజకీయ కారణాలు, అవసరాల దృష్ట్యానే ఆ వాదన చేస్తున్నారనడంలో మరోమాట లేదు. చట్టపరమైన నిర్వచనం ప్రకారం రోహింగ్యాలు ఎంతమాత్రం శరణార్థులు కారు. వారికి ఆశ్రయం ఇవ్వాలంటున్నవారికి ఈ విషయం తెలుసో, లేదో? ఇక్కడ ఒక సంగతి గుర్తుచేయాలి. అసోం నుంచి, దేశం వివిధ ప్రాంతాల నుంచి అక్రమ బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని డిమాండు చేసినవారిలో ఆ మానవతావాదులూ ఉన్నారు మరి! ట్రైబ్యునళ్ల ద్వారా నిర్థారించి, అక్రమ వలసదారులను తిప్పిపంపడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు 1983లోనే ఆమోదించింది. దరిమిలా అది చట్టమైంది. కానీ, ఆ చట్టంకింద ఒక్క అక్రమ బంగ్లాదేశీనీ స్వదేశానికి తిప్పిపంపిన దాఖలా లేదు. అక్రమంగా నివసిస్తున్నవారందరినీ తిప్పి పంపాల్సిందేనని సుప్రీంకోర్టు ఇప్పటికే విస్పష్టంగా, నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. రోహింగ్యాలకూ అది ఎందుకు వర్తించదు?
అక్రమ వలసదారుల వల్ల వాటిల్లే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. వారి కారణంగా దేశీయంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. స్థానిక జనజాతులు అస్థిరతకు లోనవుతాయి. పెద్దసంఖ్యలో చొచ్చుకువచ్చే అక్రమ వలసదారులు, ప్రభుత్వం మీద రకరకాల ఒత్తిళ్లు తేవడం ద్వారా దేశభద్రతకే ముప్పుగా పరిణమిస్తారు. తాము అక్రమ వలసదారులం కామని, శరణార్థులమని, అందుకే భారతదేశంలో తమకు ఆశ్రయం కల్పించి తీరాల్సిందేనని అంటున్నారు రోహింగ్యాలు. స్వదేశీ పౌరులైనా, విదేశీయులైనా అందరినీ ప్రభుత్వం సమానంగా చూడాలని, రక్షణ కల్పించాలని, ఈ మేరకు భారత రాజ్యాంగ నిర్దేశానికి కట్టుబడాలనీ అంటున్నారు. తమను తిప్పిపంపితే మానవ హక్కులను మంటగలిపినట్లవుతుందని, శరణార్థులపై అంతర్జాతీయ చట్టాలను భారత్ ఉల్లంఘించినట్లవుతుందని సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వైఖరినే తప్పు పట్టేందుకు, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకూ వారు సిద్ధపడుతున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలవడంలో, వత్తాసు పలకడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అక్రమ వలసదారుల కారణంగా అధిక సంఖ్యాకులు కాస్తా అల్ప సంఖ్యాకులుగా మారిపోతున్న విషాద దృశ్యం ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అలాంటి అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ వచ్చింది. అక్రమ వలసదారులకు అండదండలు అందజేస్తూ వచ్చింది. ఇప్పుడూ అదే చేస్తోంది. ఇది వారికి అలవాటైన విద్యే. కాంగ్రెస్ దుర్రాజకీయాల వల్ల దేశానికి ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది. అక్రమ వలసల అనర్థాన్ని అవగాహన చేసుకోవాలంటే ఒక్కసారి అసోం, పశ్చిమ్ బంగ రాష్ట్రాల వైపు చూస్తే చాలు. అసోమ్‌లో, పశ్చిమ్ బంగలోని సరిహద్దు జిల్లాల్లో అక్రమ వలసదారులే ఇప్పుడు మెజారిటీ వర్గీయులుగా, ఎన్నికల రాజకీయాల్లో నిర్ణాయక శక్తిగా మారారు. ఈ దేశం మీద విషం కక్కుతున్న కొందరు మౌల్వీలు, ముల్లాలకు వంతపాడుతూ, భుజం కలుపుతూ కదం కదుపుతున్న కొంతమంది లౌకిక రాజకీయవాదులు, దేశానికి తామెంత చెరుపు చేస్తున్నదీ గ్రహించలేకపోతున్నారు. తమ వైఖరి కారణంగా దేశానికి నష్టం జరుగుతుందని, జరుగుతోందని వారిలో కొందరికి తెలిసినప్పటికీ- స్వీయ రాజకీయ మనుగడకోసం వారు దేనికైనా, ఎంతకైనా తెగిస్తున్నారు. పెట్రో డాలర్లతో తులతూగుతున్న సంపన్న దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఆ దేశాల్లో అత్యధికం సాటి జాతిజనులైన రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అనేక సమస్యలతో సతమతమవుతున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం అనవసర భారాన్ని భరించాలట! రోహింగ్యాలను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మియన్మార్ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటప్పుడు, వారిని స్వదేశానికి తిప్పి పంపాలన్న ప్రతిపాదనపట్ల ఎవరైనా అభ్యంతరం తెలపాల్సిన అవసరం ఏముంది? ఏవో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నవారే అడ్డగోలు వాదనలు లేవదీస్తున్నారు, అలాంటి వాదనలకు మద్దతూ పలుకుతున్నారు. వారిపట్ల అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
—-
ఐరోపా ఉక్కిరిబిక్కిరి
ఒక దేశంలో ఆశ్రయం పొందాలని ఎవరైనా ఆశిస్తుంటే, వారి పూర్వాపరాలు ఆరా తీయకుండా, పరిస్థితులు, పరిణామాలను బేరీజు వేయకుండా ఏ దేశమూ తలుపులు బార్లా తెరవదు. పెద్ద దేశాలకైనా, పేద దేశాలకైనా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికిగల ప్రధాన కారణాల్లో ఒకటి- అడ్డూఆపూలేని అక్రమ వలసలే! అక్రమ వలసల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థమీద మోయలేని భారం పడుతుండటమే కాకుండా సామాజిక సమస్యలూ తలెత్తుతుండటంతో బ్రిటన్ అంతటి తీవ్ర నిర్ణయం తీసుకొంది. యుద్ధపీడిత పశ్చిమాసియా, ఆఫ్రికాల నుంచి అక్రమ వలసదారులు వెల్లువలా వచ్చిపడుతుండటంతో ఐరోపాలోని అనేక దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఆ అక్రమ వలసదారులెవరూ ఆ ప్రాంతంలోనే ఉన్న సంపన్న పెట్రో డాలరు దేశాలకు మాత్రం వెళ్లడం లేదు. ఐరోపావైపే పరుగెడుతున్నారు. దాంతో ఆందోళన చెందుతున్న పలు ఐరోపా దేశాలు అక్రమ వలసదారులకు ఎక్కడికక్కడ అడ్డుకట్టవేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు అవి కఠినంగా వ్యవహరిస్తున్నాయి. శరణుకోరి వచ్చేవారికి ఆశ్రయం కల్పించి, అక్కున చేర్చుకోవడం అనాదిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగం. ఈ విషయంలో ఇప్పటికే దేశం ఎంతో ఉదారంగా వ్యవహరించింది, వ్యవహరిస్తోంది. ఈ దేశంలోకి వచ్చి, ఇక్కడే స్థిరపడి, జాతీయ జనజీవనంలో అవిభాజ్యంగా మారినవారు ఎందరో ఉన్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ- కొన్ని వర్గాలు ఇక్కడి సామాజిక జీవనంలో ఇమడలేక దేశ విచ్ఛిన్నానికి కారణమైన చేదు అనుభవాన్నీ మరవరాదు.
—–
ప్రమాదంపై పారాహుషార్
తమ నెత్తురులోనే ఉదారవాదం ఉందని, తమ నరనరాల్లో ఉదారవాద రక్తకణాలే ప్రవహిస్తున్నాయని నమ్ముతున్నవారు, నమ్మబలుకుతున్నవారు- దాని వల్ల తాత్కాలికంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారేమోకానీ పొంచివున్న ప్రమాదాలను విస్మరిస్తున్నారు. నిజాలు చూడలేక వారు కావాలనే కళ్లు మూసుకొంటున్నట్లు కనిపిస్తోంది. అక్రమ వలసదారులకు వారి ప్రోత్సాహ ప్రోద్బలాల కారణంగా జనాభా స్థితిగతుల్లో విపరీతమైన మార్పులు చేర్పులు వచ్చి, ఆ దుస్థితి భవిష్యత్తులో మరోసారి దేశ విభజనకు దారితీసినా ఆశ్చర్యపడ్సాందేమీలేదు. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మానవ హక్కులను కాపాడాల్సిందే. మానవత్వంతో వ్యవహరించాల్సిందే. కొన్ని సందర్భాల్లో కర్మం అని వదలిపెట్టకుండా ధర్మంగా నడచుకోవలసిందే. కానీ, మానవ హక్కులను కాపాడే క్రమంలో దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు ముంచుకొస్తుంటే కళ్లు మూసుకొని, చేష్టలుడిగి చూస్తూండిపోవాలా? ఎవరూ అలాగని చెప్పలేరు, చెయ్యలేరు. దేశం ఏమైనా కానీ, తమ పబ్బం గడిస్తే చాలు, ప్రయోజనం నెరవేరితేచాలు అనుకొనేవారితోనే ప్రమాదం. అందుకే సదా, సర్వదా అప్రమత్తంగా ఉండాల్సిందే. రోహింగ్యాలు కష్టాల్లో ఉన్నమాట నిజమే. కానీ, వారికష్టం మనకు నష్టంగా పరిణమించరాదు. ప్రపంచ జిహాదీ వ్యవస్థలో రోహింగ్యాలు భాగంగా మారారని, అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి అల్‌ఖైదాకు చెందిన హఫీజ్ సయీద్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాద నాయకుల అండదండలు దండిగా లభిస్తున్నాయని పక్కా సమాచారం అందుతోంది. వహాబీ తరహా ఉగ్రవాదవ్యాప్తికి పెద్దయెత్తున పెట్రో డాలర్లు గుమ్మరిస్తున్న సౌదీ అరేబియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విచ్ఛిన్న శక్తులకు ఉదారంగా నిధులు సమకూర్చేందుకు సిద్ధంగానే ఉంది. ఈ వాస్తవాలను ఎలా విస్మరించగలం?
–వీరేంద్ర కపూర్
(ఈనాడు సౌజన్యం తో)