Home News ఓపీ బాబా రక్షిస్తాడు!!

ఓపీ బాబా రక్షిస్తాడు!!

0
SHARE

సియాచిన్‌ అంటే నల్ల గులాబీ అని అర్థం. కానీ అక్కడ నలుపు ఉండదు. అంతా తెలుపే. ఎక్కడ చూసినా మత్యు వస్త్రంలా కప్పుకునే ముప్ఫై అయిదు అడుగుల మందం మంచు. మైనస్‌ 48 డిగ్రీల శవ పేటిక లాంటి డీప్‌ ఫ్రీజర్‌ సియాచిన్‌. అక్కడ గులాబీ కాదు కదా గడ్డిపోచ కూడా ఉండదు.

నిజానికి 1971లో సిమ్లా ఒప్పంద సమయంలో సరిహద్దు నియంత్రణ రేఖను నిర్ధారిస్తున్నప్పుడు మ్యాప్‌లో పాయింట్‌ 9842 అనే చోటు వరకు రేఖను నిర్ణయించారు. ఆ తరువాత అంతా మంచు. మైనస్‌ 48 డిగ్రీల చలి. ఆ సియాచిన్‌లో మనిషి బతకడం అసాధ్యం. అందుకని ఆ తరువాత రేఖను నిర్ధారించ లేదు. హిరణ్యకశిపుడు పగలూ రాత్రి కానప్పుడు; ఇంట్లో, బయటా కాని చోట; మనిషీ, పశువూ కాని ప్రాణి చేతిలోనే చావాలని నిర్ణయించుకున్నట్టు పాకి స్తాన్‌ ఆ సియాచిన్‌ను యుద్ధ భూమిగా ఎంచుకుంది.

అంకాపూర్‌, అనంతపురం, అనకాపల్లిలో కూర్చుని సియాచిన్‌లో పరిస్థితుల్ని ఊహించడం అసంభవం. ప్రతి భారతీయ జవాన్‌ తన జీవితంలో రెండేళ్లు సియాచిన్‌లో గడపాలని కోరుకుంటాడు. ఆ డీప్‌ ఫ్రీజర్‌లో నిరంతరం చలితో, చావుతో పోరాడుతూ పనిచేసేందుకు పోటీపడతాడు. ఛాతీపై తెలుపు, గోధుమ రంగున్న పట్టీని ధరిస్తే బతుకు ధన్యమనుకుంటాడు. సియాచిన్‌లో పనిచేస్తే ఆ పట్టీని ప్రదానం చేస్తారు.

ఇంతా చేస్తే ఒక సైనికుడి రెండేళ్ల డ్యూటీలో వాస్తవానికి సియాచిన్‌లో పనిచేసేది కేవలం మూడు నెలలే. మిగతా సమయమంతా ఆ మూడునెలల కోసం తయారవుతాడు. శారీరకంగా, మానసికంగా సంసిద్ధమవుతాడు. అయితే ఆ మూడు నెలలూ అనుక్షణం మత్యువు పొంచి ఉంటుంది. చలికి ఊపిరితిత్తుల్లో మంచు చేరవచ్చు. చేతులు, కాళ్లు నీలం రంగుతో చచ్చుబడిపోవచ్చు. వేళ్లు తెగిపోవచ్చు. ఊపిరి అందకపోవచ్చు. తెల్లటి మంచు దుప్పటిని చూసి కళ్లు జిగేల్మని, అంధత్వం రావచ్చు. ఇవన్నీ తట్టుకుంటే మంచు తుఫాను రావచ్చు. నడుస్తున్న మంచు నేల ఉన్నట్టుండి నోరు తెరిచి, అగాథం లోతు పగులు చూపించేసి సైనికుడిని అమాంతం మింగేయవచ్చు.

సియాచిన్‌లో పనిచేసే సైనికులను మరి కాపాడేదెవరు? చావు బిగి కౌగిలిలో ఉన్న మన సైనికులని చావు మింగకుండా కాపాడేందుకు ఒక్కడున్నాడు. అయనే ఓపీ బాబా ! సియాచిన్‌లో పనిచేసే ప్రతీ సైనికుడు ఓపీ బాబాను తలచుకుంటూనే ఉంటాడు. 70 చదరపు కిలో మీటర్ల ఆ మంచుగడ్డపై ఉన్నంత సేపూ సిగరెట్‌ కాల్చడు. మాంసం తినడు. ఓపీ బాబాపై అంత నమ్మకం.

ఇంతకీ ఎవరీ ఓపీ బాబా? ఓపీ బాబా అంటే ఓం ప్రకాశ్‌! 1980లో ఆయన మంచుకొండలపై గస్తీ కాసేవాడు. ఒక రోజు శత్రువులు దాడిచేశారు. సైనికులకు వెనక్కి రమ్మని ఆదేశాలు వచ్చాయి. అందరూ వెళ్లారు. ఒక్క ఓం ప్రకాశ్‌ తప్ప. ఒంటి చేత్తో ఆయన శత్రువును పారద్రోలాడు. కానీ ఓపీ తిరిగి రాలేదు. ఆయన శవమూ దొరకలేదు. ఆ తరువాత నుంచి మంచుకొండల్లో పనిచేసే మన జవాన్లకు మాత్రం ఆయన కలలోకి వచ్చేవాడు. ఫలానా వైపు వెళ్లకండి. రేపు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించేవాడు. మాట వినని వారు మళ్ళీ తిరిగిరాలేదు. దాంతో సైనికులు ఆయనకు గుడి కట్టుకున్నారు. ఓపీ బాబా ని పిలవడం మొదలు పెట్టారు. సైనికుల దష్టిలో ఓపీ బాబా తమ పై ఆఫీసర్‌. అందుకే ప్రతి రోజూ డ్యూటీలోకి ఎక్కగానే ఓపీ బాబా గుడికి వెళ్లి సైనిక వందనం చేస్తారు. తమ రిపోర్టును సమర్పిస్తారు. సెల్యూట్‌ చేసి తిరిగి వస్తారు. సియాచిన్‌లోని ప్రతి అవుట్‌ పోస్ట్‌లో ఓపీ బాబా గుడి ఉంటుంది. హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్‌లతో సంబంధం లేకుండా ప్రతి సైనికుడూ ఓపీ బాబాకి సెల్యూట్‌ చేస్తాడు. ‘ఓపీ బాబా ఉన్నాడు లే’ అని ప్రతీ సైనికుడు భరోసాగా ఉంటాడు.

హేతువాది దృష్టిలో ఇది మూఢనమ్మకం కావచ్చు. తర్కించే వాడికి ఇది మూర్ఖత్వం కావచ్చు. కానీ సైనికుడికి ఇది ఒక నమ్మకం. ఒక భరోసా. అంతే కాదు. భారత సైన్యంలో సరిహద్దుల్లో నిలబడే ప్రతి సైనికుడిదీ భారతీయ మతమే తప్ప మరొకటి కాదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఏడెనిమిది మంది సైనికులు నడుములకు తాళ్లు కట్టుకుని కలిసి నడుస్తారు. ‘బతికితే ఎనిమిది మంది బతుకుతాం. చనిపోతే ఎనిమిది మంది చనిపోతాం’ అన్న ధీమాతో నడుస్తారు. వాళ్ల ధీమా ఏమిటి? ‘ఓపీ బాబా ఉన్నాడు లే’ అని.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)