Home News రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే దేవాలయం

రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుచుకునే దేవాలయం

0
SHARE

– అంజలి అంఖడ్

భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంటుంది. సంవత్సరంలో మిగిలిన అన్నిరోజులు దేవస్థానం తలుపులు మూసి ఉంటాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవస్థానం పురాణేతిహాసాలతో ముడిపడి ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉర్గమ్ వ్యాలీలో ఈ అరుదైన బన్సీ నారాయణ్ దేవాలయం ఉంది. చరిత్ర ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితమైన బన్సీ నారాయణ్ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంనాటిది. వామనావతరం సమాప్తి అనంతరం శ్రీ మహావిష్ణుమూర్తి తొలిసారిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారని స్థలపురాణం చెబుతున్నది.

యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న బలి మహారాజుతో ఇబ్బందులను పడుతున్న దేవతలను ఆదుకోవడానికి శ్రీమహావిష్ణువు ఉపక్రమించారు. బలి చక్రవర్తిని ఓడించడానికి తన ఐదవ అవతారమైన వామనావతరంలో భూమిపైకి వచ్చారు. మరుగ్గుజు రూపంలో ఉన్న వామనుని చూసి ఏమి కావాలో కోరుకోమని బలి చక్రవర్తి అడిగారు. మూడు అడుగుల భూమి చాలని వామనావతరంలో ఉన్న శ్రీమహావిష్ణువు కోరారు.

వామనావతరంలోని పరమార్థాన్ని గ్రహించలేని బలిచక్రవర్తి వామనుడు కోరినదే తడువుగా అనుగ్రహించారు. అయితే ఇంతింతై వటుడింతై అన్న చందంగా విశ్వరూపం దాల్చిన వామనుడు రెండు అడుగులతో యావత్ విశ్వాన్ని అధీనం చేసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రాజుగా బలి చక్రవర్తికి పేరు ఉంది. అందులో భాగంగా వారి మూడవ అడుగును తన శిరస్సుపై ఉంచవలసిందిగా వామనుని బలి చక్రవర్తి కోరారు.

వామన రూపంలో వచ్చింది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న బలి చక్రవర్తి తన రాజ్యాన్ని రక్షించవలసినదిగా కోరారు. అలాగే తనకు ద్వారపాలకుడిగా ఉండాలని శ్రీ మహావిష్ణువును అభ్యర్థించారు. అయితే బలి మహారాజు కోరికను నెరవేర్చడానికి వారు శ్రీ మహాలక్ష్మికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అయినప్పటికీ బలి చక్రవర్తి అభ్యర్థనకు అంగీకరించారు. ఇది చూసిన శ్రీ మహాలక్ష్మి ఖిన్నులైనారు. బలి చక్రవర్తి రాజ్యానికి వేంచేశారు. దివ్యమైన శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి చేతి మణికట్టునకు రక్ష సూత్రాన్ని శ్రీ మహాలక్ష్మి కట్టారు. ఇందుకు చలించిపోయిన బలి మహారాజు ఏదైనా వరం కోరుకోమ్మని శ్రీ మహాలక్ష్మిని అడిగారు. శ్రీ మహావిష్ణువును వైకుంఠానికి పంపించాలని వారు కోరారు. స్థల పురాణాన్ని అనుసరించి ప్రస్తుతం బన్సీ నారాయణ్ దేవస్థానం ఉన్న ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు పాతాళం నుంచి ఉద్భవించారు.

ఈ దేవస్థానంలో కొలువైన దేవదేవులకు 364 రోజులు పూజలు జరుగుతాయి కానీ కేవలం రక్షా బంధన్ రోజున మాత్రమే మానవులకు పూజలు చేసే అవకాశం ఉంటుందని స్థలపురాణం చెబుతున్నది. శ్రీమన్నారాయణుడు, మహాశివుడు, విఘ్నేశ్వరుడు, వనవాసిని దేవస్థానంలో కొలువై ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఒక్క రోజు మాత్రమే అదీ రక్షా బంధన్ రోజున తెరిచి ఉండే దేవస్థానం బన్సీ నారాయణ్ దేవస్థానం.

SOURCE : NEWS BHARATHI