-వాణి సక్కుబాయి
భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాన్ని అనుసరించి మనం ఆచరించే ప్రతి పండగకీ ఒక పరమార్థం ఉంటుంది. విశ్వ మానవకళ్యాణానికి, సర్వమాననవ సౌభ్రాతృత్వానికి దారి చూపిస్తుంది. పురాణేతిహాసాల ప్రకారం అతి ప్రాచీనమైన, అపురూపమైన కుటుంబ బాంధ్యవాల పండగ రాఖీ పండగ. శ్రావణమాసం పౌర్ణమి నాడు జరుపుకునే దివ్యమైన వేడుక. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. జంధ్యాల పౌర్ణమిగా పిలవబడే రాఖీ పౌర్ణమి వేడుక.
స్వర్గలోకాధిపతి దేవేంద్రునికి ధైర్యం నింపుతూ, అతని పట్టపురాణి ఇంద్రాణి త్రిమూర్తులను ఆరాధించి, సర్వశక్తిని రక్షాబంధనం రూపంలో దేవేంద్రుని చేతికి కట్టగా ఆ రక్షా బంధనం ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించేలా చేసిన పురాణకథ మనకు నేటికీ ఆదర్శం.
అలాగే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి శాశ్వత ప్రతీక శ్రీ కృష్ణ, ద్రౌపతి అనుబంధాన్ని తెలిపే ఇతివృత్తం. నూరు తప్పుల శిశుపాలుని సంహార సమయంలో ధర్మ పరిరక్షణార్థమైన తన సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగిస్తారు. ఆ సందర్భంగా వారి చూపుడు వేలికి గాయమవుతుంది. అప్పుడు ద్రౌపది చీర కొంగు శ్రీకృష్ణ పరమాత్ముని చూపుడు వేలుకు రక్షా బంధనం అవుతుంది.
కౌరవ దుశ్శాసన కీచక పర్వంలో నిస్సహాయురాలైన ద్రౌపది స్వాభిమానానికి రక్షగా నిలిచి, సోదరిపట్ల సోదరునికి ఉన్నా అనంతమైన బాధ్యతను గుర్తుచేసే అపురూప బంధం రక్షాబంధనం నేటికీ మనకు ధర్మబద్ధమైన ఆదర్శం.
విశ్వ విజేత కావాలనే దూకుడుతో క్రీస్తుపూర్వం 326లో మారణహోమం సృష్టించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌కు ప్రాణభిక్ష పెట్టమని ఆయన భార్య, ఆఫ్ఘనిస్తాన్ యువరాణి రుక్సానా అప్పటి మన భారత దేశ పాలకుడైన పురుషోత్తముడిని సోదరునిగా భావించి, భారతీయ సనాతన ధర్మంలో అన్నా చెల్లెల అనుబంధానికి ఉన్న శక్తిని తెలుసుకుని, తన భర్తను వదిలి వేయమని రక్షాబంధనాన్ని పంపిన చరిత్ర మనకు తెలుసు.
ఇలా నేటికి కూడా ఎన్ని యుగాలైనా మారని అనుబంధానికి ప్రతీక రక్షాబంధనం. విశ్వవ్యాప్తంగా విస్తరించిన సనాతన ధర్మబద్ధులైన ప్రతి ఒక్కరూ జరుపుకునే కుటుంబ బంధాల మాధుర్యాన్ని తెలిపే పండగ రాఖీ పౌర్ణమి.
ప్రతి భారతీయ కుటుంబంలో అన్నా, చెల్లెలు, అక్క, తమ్ముడు, అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సోదరులుగా భావిస్తూ, దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షణగా ఉండాలనే కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ,
నిత్య జీవనంలో మన సామాజిక జీవనానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అనగా పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజా నాయకులు ఇలా ప్రతి రంగంలో పనిచేస్తున్న అందరిని ఈ రక్షాబంధన్ సందర్భంగా కలుస్తూ ఆత్మీయతను పంచుకుంటున్నాం.
నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవన విధానంలో, తోబుట్టువులకు సమయం లేదని భావిస్తున్న తరుణంలో, ప్రత్యేకించి ఈ రాఖీ పండగ రోజు మాత్రం ఎక్కడ ఉన్నా, ఎంత దూరం ఉన్నా, అన్నాచెల్లెళ్లు ఒకే గూటికి చేరే అపూర్వ వేడుక రాఖీ పౌర్ణమి.
సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కలకాలం అందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ, భారతీయ కుటుంబ జీవన మాధుర్యాన్ని, బాంధవ్యాల అనుబంధాన్ని నిత్యం స్మరించుకునేలా, రాఖీ పండుగ జరుపుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరిది.