Home News రాళ్ల మధ్య నుండి మొలకెత్తిన ‘నిప్పుకణాలు’

రాళ్ల మధ్య నుండి మొలకెత్తిన ‘నిప్పుకణాలు’

0
SHARE

– డా.పి.భాస్కరయోగి,
సామాజిక రాజకీయ విశ్లేషకులు

(16.06.2022 నాడు భాగ్యనగర్లో ప.పూ.సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారి చేతుల మీదుగా ఎబివిపి రాష్ట్ర కార్యాలయం ‘స్ఫూర్తి’- ఛాత్రశక్తి భవన్’ ప్రారంభం జరగబోతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం..)

అది 1980 జనవరి 26..
కాకతీయ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక.. ఆక్కడ కాకలుదీరిన అధ్యాపకులు.. యూనివర్సిటీ వీసీ.. అందరిముందే ఓ రాడికల్ విద్యార్థి త్రివర్ణపతాకం లాక్కొని దానిని కాల్చివేయాలని కదం త్రొక్కుతున్నాడు.. అంతటి దుందుడుకు చర్యకు పాల్పడుతున్న ఆ దేశద్రోహిని నిలువరించేందుకు అక్కడున్న అంతమందిలో ఎవరూ ముందుకు రాలేదు!?

కానీ.. ఇంతలో.. ఉన్నట్టుండి నిప్పుకణంలా దూసుకొచ్చాడు ఏబీవీపీ యువకెరటం సామా జగన్మోహన్రెడ్డి.. భారతమాత ఆత్మగౌరవమైన ‘జాతీయ పతాకాన్ని’ ఆ దేశద్రోహి చేతినుండి విడిపించి, ఎగురవేసి ‘‘వందేమాతరమ్.. భారత్ మాతాకీ జై’’ అని గట్టిగా నినదించాడు. ఆ ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన తెలంగాణ గడ్డమీద పెద్ద సంచలనమే అయ్యింది. ‘జస్టిస్ శ్రీరాములు విచారణ కమిషన్’ ఈ సంఘటనపై విచారణ చేపట్టి నిందితుడికి శిక్షపడాలన్నది..

వాయిదాలమీద వాయిదాలు..!! రెండేళ్ళు గడిచింది. ప్రథమసాక్షిగా సామా జగన్మోహన్రెడ్డి కోర్టుకు హాజరవుతూనే ఉన్నాడు. ఓ రోజు ‘నక్సల్స్’ మానవత్వం మరిచి దారికాచి నడిరోడ్డుపై ఆయనను క్రూరంగా నరికారు..!! అంతమొందించారు..!!

జాతీయజెండా గౌరవం కోసం అలా తన ప్రాణాలర్పించాడు ఏబీవీపీ కార్యకర్త సామా జగన్మోహన్రెడ్డి..!!
ఇలాంటివి లెక్కలేనన్ని ప్రాణాలు ఈ ‘మట్టికోసం’ బలిదానం అయ్యాయి.

‘మేమంతా విద్యార్థులం.. ఈ దేశపు తొలివెలుగులం..
నక్షత్రాల్లా ఈ ధరిత్రి కోసం రాలిపోగలం..!
మా గొంతు ఇక్కడి వేదఘోషల నినాదం..
మా ‘రక్తం’ బలిపీఠం ముందు జరిగే కుంకుమార్చన..
మా ‘ప్రాణం’ అమరజవాన్ల గుర్తుగా వెలిగే దీపం..
అంత గొప్పగా మాతృఅర్చన మేం చేయగలం..!!
ఇలా ఒక్కొక్క విద్యార్థి ‘‘క్షణం క్షణం.. కణం కణం ఈ దేశం కోసం’’ అంటూ నినదించిన గొంతుకలు చూస్తే
‘ఋషులే ఈ బిడ్డలైపుట్టారా!’ అని ఒళ్లు జలదరిస్తుంది.
జ్ఞానం..! మేం మా ఋషులనుండి.. సనాతన గ్రంథాల నుండి..
శీలం..! మాకు జన్మనిచ్చిన జ్యేష్ఠుల నుండి..
ఏకత..! చరిత్ర నేర్పిన పాఠాల నుండి మేం నేర్చుకున్నాం..!!
ఇవే మాకు త్రిశూల లక్ష్యాలు !!
మేం సరస్వతిని అర్చించే నిత్యపూజారులం..
విద్యార్థుల కోసం ఊపిరినిచ్చే సిద్ధార్థులం..!
విశ్వవిద్యాలయాల్లో ఈ దేశం కోసం ఎలుగెత్తే వివేకానందుని వారసులం !!
జార్జిరెడ్డితో ‘జగడం’ చేసి, ఎదురునిల్చి మృత్యుముఖం చూసివచ్చిన నరసింహారెడ్డి, విద్యాసాగర్రావు..! నక్సల్స్ దౌర్జన్యాన్ని ఎదిరించిన అశోక్రెడ్డి, రామ్మోహనరావు, భాస్కరరావు, రాజు, బ్రహ్మంలు..! అదే ఎర్రతుపాకుల చేతిలో హత్యకుగురైన బీహారీ వినోద్కుమార్ ఝా, నల్లగొండ ఏచూరి శ్రీనివాస్, అయినా లక్ష్మణరావు, జగన్మోహన్రావు, పూర్ణానందం, కోరుట్ల నాంపల్లి, అయినా రవీందర్రెడ్డి (జనగాం), బోయినపల్లి రామచందర్రావు, రాచకొండ గోపాల్రెడ్డి, మధుసూదన్గౌడ్, బి.కృష్ణవర్ధన్రెడ్డి, సమ్మిరెడ్డి, యం.జితేందర్రెడ్డి, వెంకటనారాయణరెడ్డి, ప్రేమేందర్, జి.గౌతమ్రావు, కె.వి.వి.భాస్కర్, జి.మనోహర్రెడ్డి, పాపారావు, యస్. షణ్ముఖ వంటి ఎందరో పరిషత్లో చురుకైన వాళ్లు ఎదురొడ్డి నిల్చినవారు, ప్రాణం పోగొట్టుకొన్నవారు ఉన్నారు. వాళ్ళందరికీ జేజేలు. గుండెను బుల్లెట్ చీల్చినా నిలబడ్డ పి.మురళీధర్రావు మన కళ్లముందే ఉన్నాడు. గౌరీశంకర్జీ లాంటి కార్యకర్తలు కైలాసపర్వతంలా కదలకుండా ఆదర్శప్రాయులై నిల్చారు.

ఎన్ని సాహసాలకు ఈ ‘విద్యార్థిపరిషత్’ సాక్ష్యమో.. తెలుసా..!!
– చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం విసిగా ఎస్సి, ఎస్టిలకు సంబంధించిన విద్యావేత్తను నియమించాలని 1991లో యల్.వీరగోపాల్ 5 రోజుల నిరాహారదీక్ష..
– కాశ్మీర్లో జరిగిన దారుణ మారణకాండను నిరసిస్తూ 1990లో ‘చలో కశ్మీర్’ పిలుపు..
– 1991లో రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలకపాత్ర..
– భారత్కు చెందిన తీన్బిగా ప్రాంతాన్ని బంగ్లాదేశ్కు ధారాదత్తం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఉద్యమం..
– 1997 సెప్టెంబర్ 21 నుండి 10 రోజులపాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి తీరక్షేత్రం బాసర సరస్వతి పాదాల నుండి కర్నూల్ జిల్లా కృష్ణాతీరక్షేత్రం శ్రీశైలం వరకు ‘సస్యశ్యామలయాత్ర’’ తెలుగురాష్ట్రాల గోదావరి`కృష్ణా ‘ఇరిగేషన్ వాటర్’ పై గొప్ప ఉద్యమం..
– ‘రోడామిస్త్రీ ఛోడోమినిస్ట్రీ’ అన్న నినాదంతో మహిళా ఆత్మగౌరవం కోసం పోరాటం..
– విశ్వవిద్యాలయ భూముల అన్యాక్రాంతంపై లెక్కలేనన్ని ఉద్యమాలు..
– అడ్మిషన్లు, ఫీజులు, నిరహారదీక్షలు, మెరుపుధర్నాలు, పోస్టుల భర్తీ, నకిలీ సర్టిఫికెట్లు, పరీక్షల నిర్వహణ.. విద్యావిధానాలు.. వీపులు చిట్లించుకోవడాలు..
ఇలా ఎన్నెన్నో విద్యార్థి ఉద్యమాల మైలురాళ్లను దాటించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.. నడక ఓ చారిత్రాత్మకం.. ఓ సజీవ సాక్ష్యం..!!
‘‘అవును.. మేం పడిలేసే కెరటాలం..
దేశాన్ని గుండెకు హత్తుకొనే ధర్మవీరులం.
చదువులతల్లి ఒడిలో సేదదీరిన బుద్ధిమంతులం..
మాతృభూమిని ప్రేమించడం మా రక్తానికున్న సహజ లక్షణం..
భారతమాత కోసం మరణించడం మా కర్తవ్యం..
ఈ దేశ అస్తిత్వాన్ని ధ్వంసం చేసే ఏ చర్యనూ ఏబీవీపీ సహించదు..
పాతనీరు వెళ్ళి కొత్త నీరు వస్తేనే ‘ఏరు’ శుభ్రంగా ఉన్నట్లు..
ఎందరు విద్యార్థులు వచ్చారో.. ఎందరు ముందుకు సాగిపోయారో..!
నక్షత్రాల్లా లెక్క చెప్పలేం..
దేశభక్తులుగా యువనాయకులుగా తీర్చిదిద్దడం మా పాఠశాల సిలబస్
‘‘మా రక్తంతో ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తాం..
మా ఇనుపకండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పంతో
భారతమాతకు అద్భుత ఆలయాలు నిర్మిస్తాం..
మా గొంతులకు ఉరితాడేసినా మేం చచ్చేటపుడు ‘వందేమాతరం’ అంటూనే చస్తాం..
వీపులను లాఠీలకు చూపి చేతులకు పోరాటం నేర్పి..
మనసుకు ధైర్యాన్ని అందించి కాశ్మీర్ నుండి కేరళ వరకు..
బలి ఇచ్చిన ప్రాణాలు, ఆత్మలు ఇప్పుడిప్పుడు సాంత్వన పొందుతున్నాయి..
మా కన్నీళ్ల కాసారంలో కలాన్ని అద్ది ఈ దేశ చరిత్రను తిరగరాస్తాం..
మాకు దేశమంటే, ఇక్కడి మట్టీ.. మనుషులతోపాటు ఇక్కడి సాంస్కృతిక వైభవం..!!
మమ్మల్ని వధించిన విశ్వవిద్యాలయాల ముందు
మేం చెట్లుగా మొలకెత్తి వేలమొక్కలై జాతికి జీవం పోస్తాం..
మా దేహంలోని ప్రతీ రక్తనాళం నుండి ప్రతీ రక్తపు బిందువు..
ఈ ‘దేశం’ కోసం ఒక్కో సూర్యుడిగా మారి వెలుగులను విరజిమ్ముతుంది..
దేశాన్ని ప్రేమించడం మా ఉచ్ఛ్వాసనిశ్వాసలు..
త్యాగం మాకు ఊపిరి.. తత్వం మాకు రహదారి..
ఇదే ఇదే ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ నినాదాల ప్రణవశబ్దం..!!