మనదేశంలోకి అక్రమంగా చొరబడి ఏళ్ల తరబడి నివసిస్తున్న ‘రోహింగియా’ తెగకు చెందిన వారిని దేశం నుంచి బయటికి తరలించరాదని ‘ఐక్యరాజ్య సమితి’ హక్కుల సంస్థ కోరడం విచిత్రమైన వ్యవహారం. మనదేశపు అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి ఇది మరో నిదర్శనం! శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి నియమావళిని అనేక దేశాల ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలను ఐక్యరాజ్య సమితి వారు నిరసించాలి! కానీ ఇలాంటి ‘నిరసన’ను ఎంపిక చేసిన కొన్ని దేశాలకు పరిమితం చేయడం చరిత్ర! కానీ మన ప్రభుత్వం శరణార్థులకు సంబంధించిన ఏ నియమావళిని కూడా ఉల్లంఘించ లేదు. ఐక్యరాజ్య సమితి వారు శరణార్థులకు ఆశ్రయం కల్పించడం గురించి నియమావళిని రూపొందించడానికి పూర్వం వేల సంవత్సరాలుగా వివిధ విదేశీయ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర మనది! కానీ బర్మా-మ్యాన్‌మార్-నుంచి వచ్చిపడిన, వచ్చిపడుతున్న ‘రోహింగియా’ జనాలు, శరణార్థులు కాదు! మన దేశంలోకి చొరబడిన అక్రమ ప్రవేశకులు వారు! అందువల్ల ఐక్యరాజ్య సమితి ‘హక్కుల’ సంఘం వారు మనదేశంలోని ‘‘శరణార్థుల’’కు అన్యాయం జరిగిపోతున్నట్లు ఆర్భాటించడం ‘‘అంతర్నిహిత భారత వ్యతిరేకతకు, విద్వేషానికి’’ నిదర్శనం. ఐక్యరాజ్య సమితి మాత్రమే కాదు ‘ఇస్లాం మతరాజ్య కూటమి’- ఒఐసి – ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ – ‘ఐరోపా సమాఖ్య’- యూరోపియన్ యూనియన్- వంటి అంతర్జాతీయ సంస్థలు, ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటి స్వచ్ఛంద ఆర్థిక సంస్థలు ఇతరేతర కూటముల వారు తరచూ మన దేశపు అంతర్గత వ్యవహారాల గురించి ‘నిరసనలు’ తెలపడం నడుస్తున్న చరిత్ర. మన ప్రభుత్వపు మెతక విధానం ఇందుకు కారణం! గోరక్షణ పేరుతో మన దేశంలో దౌర్జన్యకాండ జరిగిపోతోందని కూడా సోమవారం ‘ఐక్యరాజ్య సమితి’ ‘మానవ అధికార సమితి’ – హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ – వ్యాఖ్యానించడం అక్రమ ప్రమేయానికి మరో నిదర్శనం.
చైనా వంటి నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలోను, ఇస్లాం మతరాజ్య వ్యవస్థలున్న దేశాలలోను మానవ అధికారాలకు నిరంతరం విఘాతం వాటిల్లుతూనే ఉంది. ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించేవారిని, విమర్శించేవారిని ‘న్యాయ ప్రక్రియ’ ద్వారా ప్రభుత్వాలు హత్య చేయడం అంతర్జాతీయ బహిరంగ రహస్యం! ‘హక్కుల’ సంఘాల వారు కాని, ‘ఐక్యరాజ్య సమితి’ వారు కాని ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాల నిర్దయ గురించి వ్యాఖ్యానించడం లేదు. మనది పరిణతి చెందిన ప్రజాస్వామ్యం మాత్రమేకాదు, సర్వమత సమభావం అనాదిగా వ్యవస్థీకృతమైన దేశం! వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం హైందవ జాతీయ సనాతన స్వభావం! ఈ స్వభావానికి మన రాజ్యాంగం ధ్రువీకరణ. అందువల్ల శరణార్థులకు ఆశ్రయమివ్వడంలో మన దేశం అనాదిగా అపార భూతదయకు అనురూపమైంది! తరిమివేతకు హత్యాకాండకు గురి అయిన యూదులను ప్రపంచంలోని ఇతర దేశాల వారు అక్కున చేర్చుకొనలేదు. కానీ భారతదేశం యూదులకు రెండువేల ఏళ్లకు పైగా ఆశ్రయం కల్పించింది. ఆత్మీయతను పంచిపెట్టింది! ఈ సంగతిని యూదులు తమ చరిత్రలో వ్రాసుకున్నట్లు క్రీస్తుశకం 1893 సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికాలోని చికాగోలో ‘ప్రపంచ మత సమ్మేళనం’ – పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్- లో ప్రసంగించిన సందర్భంగా వివేకానంద స్వామి వివరించారు. పారశీకులకు, ఇస్లాం జిహాదీలు క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో తరిమివేసిన పారశీకులకు, శతాబ్దులుగా స్వదేశంగా మారిన దేశం మనది. వివేకానంద స్వామి ఫ్రసంగాలలోని ప్రధాన ఇతివృత్తం హిందూ జాతీయుల ఆశ్రయం కల్పించే ప్రవృత్తి! ఈ ప్రసంగానికి సంస్మరణోత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఐక్యరాజ్య సమితి మనపై ఇలా ‘అసహిష్ణుతా ఆరోపణ’ల అభాండాన్ని’ వేయడం వాస్తవాల వక్రీకరణకు పరాకాష్ట. 1970, 71 సంత్సరాలలో కోటి మంది బంగ్లా దేశీయ శరణార్థులను దాదాపు పద్దెనిమిది నెలలపాటు పోషించిన చరిత్ర మనది! అలాంటి మన దేశంపై ‘సమితి’ నిందలు వేయడం దురహంకారానికి నిదర్శనం…
‘రోహింగియా’ల వివాదం శరణార్థుల సమస్య కాదు. ఇది బర్మా దేశపు ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమ అధికారానికి సంబంధించిన అంశం. అంతర్జాతీయ బీభత్సకాండలో ముడిపడిన అంశం! ‘రోహింగియా’లు సౌదీ అరేబియా, ఆఫ్ఘానిస్తాన్ తదితర పశ్చిమ ఆసియా దేశాల నుంచి శతాబ్దుల తరబడి వచ్చి బర్మాలో స్థిరపడిన వారి సంతతి! ఈ ముస్లింలు బర్మాలోని ‘రఖినే’ – అరకాన్ – ప్రాంతంలో అధిక సంఖ్యాకులు. బర్మా అంతటా అధిక సంఖ్యాకులైన బౌద్ధులు ఈ ‘రఖినే’ – రక్షణ – ప్రాంతంలో మాత్రం అల్ప సంఖ్యాకులు. బర్మా 1937 వరకు మన దేశంలో భాగం. 1937లో బర్మాను బ్రిటన్ పాలకులు మన దేశం నుంచి విడగొట్టారు. అప్పటి నుంచి ఇస్లాం మతస్థులు – రోహింగియాలు – అధిక సంఖ్యాకులుగా ఉన్న ‘రఖినే’ ప్రాంతా న్ని బర్మా నుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడానికి ‘జిహాదీ’లు ప్రయత్నిస్తున్నారు. 1947 ఇస్లాం మత ప్రాతిపదికపై పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ‘రఖినే’ ప్రాంతంలో ఈ విచ్ఛిన్న భావజాలం మరింత బలపడింది! ‘రఖినే’ ప్రాంతాన్ని బర్మా నుంచి విడగొట్టాలన్న లక్ష్యంతో రకరకాల జిహాదీ ఉగ్రవాద ముఠాలు బీభత్సకాండను జరపడం దశాబ్దుల వైపరీత్యం! ‘రఖినే’ ప్రాంతంలోని అల్పసంఖ్యాక బౌద్ధులపై జిహాదీలు దాడులు జరపడంతో ‘ప్రతిక్రియ’గా బౌద్ధులు ఇస్లాం ప్రజలపై దాడులు చేయడం ఆరంభమైంది. బర్మా ప్రభుత్వం కూడా విచ్ఛిన్నకారులను, బీభత్సకారులను కఠినంగా అణచివేస్తోంది! ఈ సంఘర్షణ ఫలితంగా ‘రఖినే’ ప్రాంతం నుంచి బౌద్ధులు, ముస్లింలు కూడ ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు!!
ఇలా వలసపోయిన ముస్లింలు బంగ్లాదేశ్‌లోకి, మన ఈశాన్య ప్రాంతంలోకి వచ్చేస్తున్నారు! ‘రోహింగియా’ జిహాదీలు తమ బీభత్స కృత్యాలను విడనాడినట్టయితే ‘రఖినే’ ప్రాంతంలోని రోహింగియాలకు రక్షణ సహజంగా ఏర్పడుతుంది. కానీ బర్మాను విభజించాలన్న లక్ష్యంతో జిహాదీలు చేస్తున్న నేరాలకు సాధారణ ముస్లింలు శిక్షలు అనుభవించవలసి వస్తోంది. నిజమైన శరణార్థులకు మన దేశంలో ఆశ్రయం ఇవ్వవచ్చు. కానీ మనదేశంలోకి చొరబడిన వేలాది ‘రోహింగియా’లు శరణార్థులు కాదు. ‘శరణార్థులన్న’ పేరు పెట్టుకుని అక్రమంగా చొరబడినవారు. అందువల్లనే అక్రమ ప్రవేశకులను గుర్తించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది!
(ఆంధ్రభూమి సౌజన్యం తో)