విచక్షణకు తావులేని
వైరుధ్యం నిక్కుతోంది
విపక్షాల ‘ఏకత్వం’
పిల్లిమొగ్గలేస్తోంది..
అపురూపపు వ్యూహరచన
‘కపి’ రూపం దాల్చుతోంది,
విపరీతపు పులుసుకూర
విస్తళ్లను మింగుతోంది…
మమతా బెనర్జీకి గొప్ప అపశకునం రావడం సరికొత్త శుభపరిణామం. ‘ఐక్యజనతాదళ్’కు చెందిన హరివంశ నారాయణ్‌సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక కావడం మమతా బెనర్జీకి ఎదురైన అపశకునం… సిద్ధాంత సమానత్వంలేని మరుగుజ్జు పార్టీలతో ‘మహాకూటమి’ని ఏర్పాటు చేయడానికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది. మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న ‘భారతీయ జనతా పార్టీ’ వ్యతిరేక విన్యాసాలకు ఇతర ప్రతిపక్షాల నుంచి పెద్ద స్పందన లభించిన దాఖాలా లేదు. అయినప్పటికీ ఆమె పరుగులు పెడుతోంది.. ప్రకటనలను గుప్పిస్తోంది! వాటిలో అతి ప్రధానమైన ప్రకటన ఇదీ.. “భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఏర్పడనున్న కూటమి లక్ష్యం కేవలం 2019లో బీజేపీను ఓడించడం.
ఓడించిన తరువాత ఏమి చేయాలి…?” అన్నది రూపొందవలసి ఉన్న ఈ ‘బీజేపీ’ వ్యతిరేక కూటమికి తెలియని వ్యవహారం. అందువల్ల ప్రతి ‘ప్రతిపక్షం’ వారు ప్రధానమంత్రి పదవి తమకే దక్కిపోతుందని ఉవ్విళ్లూరుతున్నారు. మమతాబెనర్జీ ఇలా ఉవ్విళ్లను ఊరుతున్న వారిలో ముందు వరుసలో ఉండటం వర్తమాన వైచిత్రి… అందువల్లనే రాజ్యసభ ఉపాధ్యక్ష డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.కె.హరిప్రసాద్ ఓడిపోవడం ప్రధానంగా మమతా బెనర్జీకి అపశకునం! ఈ అపశకునం మాయావతి, ములాయంసింగ్ వంటి వారికి ‘మంచి శకునం…’ మమతాబెనర్జీ ‘వ్యూహం’ బెడిసికొట్టింది కనుక ‘ప్రతిపక్షాల కూటమి’కి ఇక తాము నాయకత్వం వహించవచ్చునని ‘బహుజన సమాజ్ పార్టీ’ బసపా అధిన్రేతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముస్తాబవుతున్నారట.. మమతా బెనర్జీకి నచ్చని మరో విపరిణామం ఇది.
ప్రతిపక్ష ప్రధానమంత్రి పదవీ అభ్యర్ధిత్వం నుంచి కా్రంగెస్ నిష్క్రమించడంతో ఇక తానే ‘అభ్యర్ధినని’ మమతాబెనర్జీ ప్రచారం చేసుకొంటోంది. ప్రధాని అభ్యర్ధిత్వపు పరుగుపందెం నుంచి కాంగ్రెస్ స్వచ్ఛందంగా తప్పుకుందా లేక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతాబెనర్జీ తప్పించిందా? అన్నది వేరే వ్యవహారం. కానీ ‘కాంగ్రెస్‌తో కలసి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీపార్టీ, బహుజన సమాజ్‌పార్టీ తదితర విపక్షాలు ఏర్పాటు చేయదలచిన కూటమి’ వారు ప్రధానమంత్రి అభ్యర్థిని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ప్రకటించబోరట! ఎన్నికల తరువాత మాత్రమే ఎన్నికైన లోక్‌సభ ప్రతినిధులు పార్లమెంటరీ పార్టీ నాయకుడి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయమట! భారతీయ జనతాపార్టీ అధినాయకుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో దీటైన నాయకుడు కాంగ్రెస్‌లో, ఇతర ప్రతిపక్షాలలోకాని కనిపించకపోవడం అసలు సంగతి! ‘రాజకీయ విదూషక శిఖామణి’గా ‘కీర్తి’ని గడించిన రాహుల్‌గాంధీ అధ్యక్షుడుగా ఉన్నంతవరకు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కల్ల.
కనీసం అతి పెద్దపార్టీగా అవతరించే అవకాశాలు కూడా లేవనేది కాంగ్రెస్ కార్యకర్తల సైతం అంగీకరిస్తున్న వాస్తవం! “ఆయన నోరు తెరిస్తే చాలు.. నోటిలో కాలు పెట్టుకుంటాడన్న భయం కలుగుతోంది..” అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ ‘అధినేత’ గురించి వ్యాఖ్యానిస్తున్నారట! “ప్రధానమంత్రి పదవి సంగతి దేవుడెరుగు.. రాహుల్‌గాంధీ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి మళ్లీ గెలవాలికదా..!” అని ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారట! అందువల్లనే కాంగ్రెస్‌కు ఉత్తరప్రదేశ్‌లో మాయావతి పార్టీతోను, అఖిలేశ్ యాదవ్‌పార్టీతోను జట్టుకట్టడం అనివార్యమైపోయింది. విపక్షాల ఏకత్వానికి మౌలికమైన ప్రాతిపదిక ఇది… రాహుల్‌గాంధీకి ప్రధాని పదవి అందని ద్రాక్ష, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని వదిలించుకోనంత వరకూ కాంగ్రెస్‌కు కేంద్రంలో మరోసారి అధికారం కల్ల! కాంగ్రెస్ విముక్త భారతదేశం కావాలని కొంతమంది కోరుతున్నారు.
కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో ప్రతిపక్షాలు కూడా అవసరమే. ఈ మహానేత వచ్చిన తరువాత కాంగ్రెస్‌పార్టీ గెలిచిన ‘ఎన్నిక’ లేదు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు సరికొత్త సాక్ష్యాలు! “ప్రధానమంత్రి పదవి రాకపోయినా ఫర్వాలేదు.. కానీ రాహుల్‌గాంధీకి అమేధీ లోకసభ స్థానం దక్కితే చాలు!” అన్నది కాంగ్రెస్ వినిపిస్తున్న ప్రతిపక్ష ఏకత్వ మంత్రానికి గీటురాయి! ఎన్నికలలో గెలవగలమని ధీమా పెరిగిన సమయంలో రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి తానే తమ పార్టీ అభ్యర్థినని స్వయంగా ‘డప్పు’ కొట్టుకున్నాడు. తన అభ్యర్థిత్వాన్ని తానుగాక పార్టీకి చెందిన మరో ప్రముఖుడుగానీ, ఇతరులుగానీ ప్రకటించడం ఔచిత్యమన్న ఇంగితజ్ఙానం కూడా లేనివాడు రాహుల్‌గాంధీ.. అందువల్లనే రాజకీయ విదూషకుడు! కర్ణాటక ముఖ్యమంత్రి పదవి తమపార్టీకి దక్కదని తెలిసిన తరువాత, ‘బీజేపీ’కు దక్కకుండా చేయడానికి మాత్రమే దాన్ని ‘రాహుల్ బృందం’ వారు త్యాగం చేశారు.
తమకు 2019 నాటి లోకసభ ఎన్నికలలో సైతం గెలుపు దక్కదన్నది కాంగ్రెస్ వారికి కర్ణాటక ‘శాసన’ సమరం తర్వాత గ్రహించిన పాఠం. అందువల్లనే ‘ప్రధాని పదవీ త్యాగం’ ప్రకటించారు కాంగ్రెస్‌వారు! మమతా బెనర్జీకి ప్రధాని పదవిపై మక్కువ పెరగడానికి ఇదీ నేపథ్యం! మమతా బెనర్జీ ‘ప్రతిపక్షాల కూటమి’ స్వభావాన్ని, స్వరూపాన్ని మార్చి వేసింది. ‘కాంగ్రెస్‌లేని ‘బీజేపీ’ వ్యతిరేక కూటమిని రూపొందించాలన్నది గత మార్చి మూడవ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రతిపాదన! ఈ ప్రతిపాదనను మమతా బెనర్జీ వెంటనే అందిపుచ్చుకొంది! ఆయనతో దూరవాణి ద్వారా చర్చలు జరిపింది.
మార్చి పంతొమ్మిదవ తేదీన చంద్రశేఖరరావు కలకత్తాకు వెళ్లి మమతా బెనర్జీతో చర్చలు జరిపాడు! కాంగ్రెస్‌కు బీజేపీకు కూడా వ్యతిరేకంగా ‘సమాఖ్య కూటమి’ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆ చర్చల ఇతివృత్తం! కానీ మార్చి 28న ఢిల్లీకి వెళ్లిన మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో చర్చలు జరిపింది! కాంగ్రెస్‌తో కూడిన ‘బీజేపీ’ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించింది. ప్రతిపక్ష ఏకత్వం ప్రహసనంలో పొడసూపిన మొదటి అపశ్రుతి ఇది. మరుగుజ్జు పక్షాల మహాకూటమిలో పొడసూపుతున్న వైరుధ్యాలు అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రస్ఫుటిస్తూనే ఉన్నాయి. మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు చేరువవుతున్న కొద్దీ చంద్రశేఖరరావు పాటిస్తున్న ‘వ్యూహాత్మక మౌనం’ మరింతగా ప్రచారమౌతోంది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలోను, రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నిక సమయంలోను ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ విపక్షాలతో కలవకపోవడం ‘సమాఖ్య కూటమి’ పుట్టకముందే ప్రస్ఫుటించిన వైరుధ్యం. మమతా బెనర్జీకి ఎదురైన అపశకునం ఇది! ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడానికి ‘జనతాపరివార్’ పక్షాలు సిద్ధంగా లేవు. విశ్వనాథ ప్రతాప్‌సింగ్‌నాయకత్వంలో ఏర్పడిన ‘జనతాదళ్’ ఆయన ప్రధానమంత్రి పదవీచ్యుతుడైన తరువాత కుక్కలు చింపిన ‘విస్తరి’వలె మారి ఉంది. అనేక పార్టీలుగా విడిపోయింది. ములాయంసింగ్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించాడు. లాలూప్రసాద్ యాదవ్ ‘రాష్ట్రీయ జనతాదళ్’ను స్థాపించాడు. మాజీ ప్రధాని దేవగౌడది లౌకిక జనతాదళ్.
ఈ మూడు పార్టీలు ఒక పార్టీగా ఎందుకు ఏర్పడలేదు? ప్రతిపక్షాల ఏకత్వం కోసం ఆర్భాటిస్తున్న వారు సమాధానం చెప్పాలి! ‘సిద్ధాంతం’ కార్యక్రమ ప్రాతిపదికలు కాలేదు. వ్యక్తుల అహంకారం ఆధిపత్య ప్రాతిపదికలయ్యాయి. ఇన్ని మరుగుజ్జు పార్టీలు దేశంలో పుట్టడానికి ఇదీ కారణం. ఇంకా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలో ‘ఐక్య జనతాదళ్’, ఒరిస్సా ముఖ్యమ్రంతి నవీన్‌పట్నాయక్ ఆధ్వర్యంలో ‘బిజూ జనతాదళ్’ పనిచేస్తున్నాయి. ఈ ఐదింటినీ కలిపి ఒకే ‘జనతాదళ్’గా ఏర్పాటు చేయడానిక గతంలో జరిగిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇందుకు కారణం వ్యక్తిగత ఆధిపత్యం.
ఒక పార్టీ నాయకుని నాయకత్వం కింది మరోపార్టీ నాయకుడు పనిచేయడు. ఇప్పుడు ‘ఐక్యజనతాదళ్’ బీజేపీతో జట్టుకట్టి ఉంది. ఈ మైత్రి ఫలితంగానే ‘ఐక్యజనతాదళ్’కు చెందిన హరివంశ నారాయణ్‌సింగ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా గురువారం ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్ ‘బీజేపీ’ వైపు మొగ్గుచూపుతున్నాడు. కానీ మిగిలిన మూడు ‘జనతాదళాలు’ ఒకేపక్షంగా ఏర్పడడానికి ఏమిటి అభ్యంతరం? “ఏకత్వం”లో నిహితమీ వైరుధ్యాలు ఇవీ…..
తంగేడుకుంట హెబ్బార్
9908779480
(విజయక్రాంతి సౌజన్యం తో)