కె.బి.సోమయాజులు సంస్మరణ సభలో పాల్గొన్న వక్తల సందేశం
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వహిందూ పరిషత్ స్థాపకులలో ఒకరైన స్వర్గీయ కె.బి.సోమయాజులు సంస్మరణ సభ 25 జూలై 2017 న భాగ్యనగర్ కాచిగూడ లోని జాగృతి భవనంలో జరిగింది. సోమయాజులు గత 13వ తేదీన పరమపదించిన విషయం తెలిసినదే.
ఈ సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు గునంపల్లి రాఘవరెడ్డి, అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై. రాఘవులు, కేంద్రీయ కార్యదర్శి కోటేశ్వర శర్మ, ఆర్.ఎస్.ఎస్. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్యామ్‌కుమార్, తదితర ప్రముఖులు పాల్గొని కె.బి.సోమయాజులుకు నివాళి అర్పించారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు గునంపల్లి రాఘవరెడ్డి మాట్లాడుతూ ‘ఒకసారి నేను, సోమయాజులుగారు ఒక పనిమీద సచివాలయానికి (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం) వెళ్ళాం. సచివాలయం గేటు వద్ద సోమయాజులుగారు యుక్తితో ప్రేమతో మాట్లాడినందువల్ల సచివాలయం లోపలికి ప్రవేశించాం. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారి వద్దకు వెళ్ళిన తర్వాత సోమయాజులుగారు ఎన్.టి.రామారావుతో ‘నీ పంచెకట్టు విధానం, నీ బొట్టు చాలా బాగుంది’ అని ప్రశంసించారు. తర్వాత మా పనిని సాధించుకొని వచ్చాం. ఎదుటి వారిని ప్రశంచించటం ద్వారా సులభంగా పనిని సాధించుకోవచ్చు అని వారి జీవితం ద్వారా నేను గ్రహించాను’ అని చెబుతూ సోమయాజులుతో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై. రాఘవులు మాట్లాడుతూ ‘లక్ష్య సాధన కొరకు వెలిగిన దీపం సోమయాజులు. శరీరం కష్ట సుఖాలను ప్రకన పెట్టి, లక్ష్య సాధనకోసం జీవితాంతం కృషి చేశారు. వారు లేని లోటు తీరాలంటే వారి మార్గంలో మనం పయనించి, సమాజ హితం కోరకు పనిచేయాలి’ అని అన్నారు.
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యదర్శి కోటేశ్వర శర్మ మాట్లాడుతూ ‘సోమయాజులు రచించిన ‘ఆణిముత్యాలు’ మనందరికి ఆదర్శం. ఒక వివాహానికి పూరోహితుడు లభించని సమయంలో వివాహ తంతును క్రమంగా నిర్వహిస్తూ ఏకాత్మతా మంత్రాన్ని చదివి వివాహాన్ని నిర్వహించారు. ఇది ఒక చమత్కారం’ అన్నారు.
ఆర్.ఎస్.ఎస్. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ ‘ కె.బి.సోమయాజులు విశ్వహిందూ పరిషత్‌కు పునాది రాయి. గృహస్తు జీవితం గడుపుతూ కూడా లోకకళ్యాణం, సమాజ సంక్షేమం కొరకు తన జీవిత సర్వస్వాన్ని సమర్పించిన మహా మనిషి ఆయన’ అన్నారు.
సంఘ జ్యేష్ఠ కార్యకర్తలలో ఒకరైన మంచెన గుండేరావు మాట్లాడుతూ ‘సోమయాజులు గారు తమ గంభీరమైన కంఠంతో వేలాది మందిని ముగ్ధులను చేసేవారు. వారు ఆత్మీయతతో కార్యకర్తలను చేరదీసి పని నేర్పేవారు’ అని అన్నారు.
అవధానులు తన భావాన్ని వ్యక్తీకరిస్తూ ‘1975 లో తిరుపతిలో జరిగిన హిందూ ధర్మ సంమ్మేళనంలో 30 వేల మందికి ఆలయ ఇఒ తో మాట్లాడి తగిన వ్యవస్థ ఏర్పాటు చేశారు సోమయాజులు గారు. సమ్మేళనానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగిపోతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోకుండా సిమెంటు పట్టిని కట్టుకొని వెళ్ళారు. తమ కుమారుడు ఇంటి వద్ద తప్పిపోయాడని వార్త వచ్చినప్పటికీ సభా స్థలం వదిలి వెళ్ళలేదు. తిలక్ స్వామి వెంట ఉంటూ అనేక అనువాదాలను చేస్తూ అపారమైన జ్ఞానాన్ని సముపార్జించారు. స్వర్గీయ సోమయాజులు గారు సుఖ దుఃఖాలను, జయాపజయాలను సమానంగా భావించారు’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇటీవల స్వర్గస్తులైన డి.విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, పటోళ్ళ రెడ్డి లకు కూడా శ్రద్ధాంజలి ఘటించారు.
(జాగృతి సౌజన్యం తో)