అయోధ్యలో రామజన్మభూమి వద్ద పురాతనమైన దేవాలయాన్ని వెలికి తీసే కార్యక్రమానికి నేతృత్వం వహించిన పేరొందిన పురావస్తు శాస్త్రవేత్త, బి.బి.లాల్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ బ్రిజ్ బాసి లాల్ గారు తమ 101వ ఏట స్వర్గస్తులైనారు. 1968 నుంచి 1972 మధ్య కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్‌గా వారు సేవలందించారు.
ఆర్కియాలజీ ఆఫ్ రామాయణ (రామాయణ పురాతత్త్వం) పేరిట చేపట్టిన ప్రాజెక్టునకు శ్రీ బి.బి.లాల్ గారు నేతృత్వం వహించారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా 1975 నుంచి 1976 మధ్యకాలంలో రామాయణం ప్రస్తావన కలిగి ఉన్న నిర్దేశిత ప్రాంతాలలో వారు పరిశోధనలు చేపట్టారు. ఆ క్రమంలో ఐదు ప్రాంతాల్లో తవ్వకాల ప్రాజెక్టులో భాగంగా అయోధ్య, నందిగ్రామ్, శృంగవెరాపూర్, భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట్ అనే రామాయణంతో అనుబంధం కలిగి ఉన్న ప్రాంతాలను శోధించారు.
శ్రీ బి.పి.లాల్ గారి ప్రకారం తవ్వకాల చేపడుతున్న సందర్భంగా బాబ్రీ కట్టడానికి ఆనుకొని దక్షిణాన నాలుగు స్తంభాలకు చెందిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ కట్టడానికి సమీపంలో తాము కనుగొన్న స్తంభాలకు చెందిన ఆధారాల గురించి ఏడు పేజీలతో కూడిన ఒక ప్రాథమిక నివేదికను వారు రాశారు.
అయితే ఆధారాలను కనుగొన్న వెంటనే ఆ ప్రాంతం నుంచి అన్ని రకాల సాంకేతిక సదుపాయాలు ఉపసంహరణకు గురయ్యాయి. ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రొఫెసర్ లాల్ గారు పదే పదే అభ్యర్థులు చేసినప్పటికీ ప్రాజెక్టు తిరిగి ప్రారంభం కాలేదు. 10 నుంచి 12 సంవత్సరాల కాలానికి ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి కదలిక చోటు చేసుకోలేదు. తుది నివేదిక ఒక్కనాటికి సమర్పించబడలేదు.
కానీ శ్రీ బి.పి.లాల్ గారు సమర్పించిన ప్రాథమిక నివేదికను రామాయణం మరియు మహాభారతం తాలూకు చారిత్రకత (Historicity of Ramayana and Mahabharata) పేరిట భారతీయ చారిత్రక పరిశోధనా మండలి(Indian Council of Historical Research) 1989లో ప్రచురించింది.
బాబ్రీ కట్టడం కింద ఒక పురాతనమైన దేవాలయపు ఆనవాళ్ళను శ్రీ బి.బి.లాల్ గారు వెలికితీయడంతో అది రామ మందిరానికి మద్దతుగా ఒక కీలకమైన వాదనకు అండగా నిలిచింది. ఫలితంగా మందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఒక తీర్పును ఇచ్చింది.
2021 సంవత్సరం నవంబర్ 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రొఫెసర్ బి.బి.లాల్ గారిని భారత్ అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో రెండవదిగా వినుతికెక్కిన పద్మ విభూషణ్‌తో సత్కరించారు.
ప్రొఫెసెర్ బి.బి.లాల్ గారి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.