Home Ayodhya అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు: సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు 

అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు: సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు 

0
SHARE

 అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం అయోధ్య, రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై గత నలభై రోజుల నుండి కొనసాగుతున్న విచారణకు తెర దించి తీర్పును రిజర్వు చేసింది. ‘వౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్’ కోసం మూడు రోజుల లోగా తమ వాదనలను రాతపూర్వకంగా అందజేయాలని వాద, ప్రతివాదులను గొగోయ్ ఆదేశించారు.

వివాదాస్పద భూమిపైనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించాడని చూపించే కీలక పత్రాలను సున్ని వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టులో చింపివేయటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేస్తున్నందున ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు నవంబర్ 13, 14, 15 తేదీల్లో వెలువడవచ్చు. గొగోయ్ పదవీకాలం నవంబర్ 17న అంటే ఆదివారం ముగుస్తుంది. అంతకుముందు రోజు శనివారం కావడంతో తీర్పును 13, 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది.

Follow us on Facebook

రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసేలోగా తీర్పు రాని పక్షంలో సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, ఆశోక్ భూషన్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం అయోధ్య-బాబ్రీ మసీదు భూమి టైటిల్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై గత ఆగస్టు ఆరోతేదీ నుంచి అంటే నలభై రోజుల నుంచి వరుసగా విచారణ కొనసాగించింది. 

బుధవారం ఆఖరు రోజు సుప్రీం కోర్టులోని ఒకటో నంబర్ కోర్టులో విచారణ సందర్భంగా అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. బాబ్రీ మసీదు ఉన్నచోటనే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించాడని చూపించే పత్రాలను అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది కోర్టులో ప్రతిపాదించేందుకు ప్రయత్నించారు. ఈ పత్రాల్లో శ్రీరాముడు జన్మించినట్లు చూపించే ఒక చిత్రపటం కూడా ఉన్నది. అయితే సున్ని వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్ ఆగ్రహంతో ధర్మాసనం ముందే ఈ పత్రాలను, చిత్రపటాన్ని చింపివేసి సంచలనం సృష్టించారు. ఆఖరు రోజు మీరిలాంటి పత్రాలను సాక్ష్యంగా తీసుకోకూడదు.. `ఇది మంచి విధానం కాదు అందుకే ఈ పత్రాలను చింపివేస్తున్నా.. దీనికి మీరు అనుమతించాలి’ అంటూ  రాజీవ్ ధావన్ ఆగ్రహంతో అఖిల భారత హిందూ మహాసభ న్యాయమూర్తి దాఖలు చేసిన పత్రాలను పరపరా చింపివేయటంతో కోర్టులో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయిపోయారు. ఈ పరిణామంపై రంజన్ గొగోయ్ స్పందిస్తూ `మీరిలా వ్యవహరిస్తే మేము కోర్టు నుంచి వాకౌట్ చేయవలసి వస్తుంది’ అని హెచ్చరించారు. `కోర్టులో పత్రాలను చింపివేసేందుకు మేము అనుమతించామా, మీ ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’ అని వ్యాఖ్యానించారు.

Source: Andhra Bhoomi