Home News రామజన్మభూమి కేసు వాయిదా కోరుతున్న అయోధ్య, ‘లౌకికవాదులు’

రామజన్మభూమి కేసు వాయిదా కోరుతున్న అయోధ్య, ‘లౌకికవాదులు’

0
SHARE

సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంగానీ, ప్రభావిత వ్యక్తులు లేదా వర్గాలు గానీ న్యాయవ్యవస్థ మధ్యవర్తిత్వం కోసం వేచివుండలేదు. న్యాయస్థానాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. రామజన్మభూమి కేసులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమే నిర్ణయం తీసుకోవాలి.

ఎన్నికల వైచిత్ర్యాలు ఎన్నో రీతులలో ఉంటాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ గాంధీ, గుజరాత్‌ శాసనసభా ఎన్నికల ప్రచారంలో హిందూ మతాచారాలను నిష్ఠగా పాటించే బ్రాహ్మిణ్‌గా కన్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇక ఆయన పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అయితే రామజన్మభూమి –బాబ్రీ మస్జీదు కేసు త్వరితగతి విచారణకు వ్యతిరేకంగా వాదించారు. తమ పార్టీ ముస్లిమ్‌ ఓటు బ్యాంక్‌ను పటిష్ఠం చేసుకోవడమే ఆ వాదన వెనుక ఉన్న లక్ష్యమని మరి చెప్పాలా? దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు తరఫున వాదిస్తూ అయోధ్య కేసు విచారణను 2019 జూలైకి వాయిదా వేయాలని కపిల్‌ సిబల్‌ కోరారు. ఇది సహేతుకమేనా? కాదు. ఎందుకని? అయోధ్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ గత ఏడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నందున కపిల్‌ సిబల్‌ అభ్యర్థన అసంబద్ధమైనది.

నిజానికి అయోధ్య వివాదంపై వ్యాజ్యం వంద సంత్సరాలకు పైగా నడుస్తోంది. వచ్చే జనవరి 29 నాటికి ఆ దావాకు 133 సంవత్సరాలు పూర్తవుతాయి. అయినప్పటికీ అయోధ్య కేసు విచారణకు తొందరెందుకని కపిల్‌ సిబల్ ప్రశ్నించారు. పైగా 2019 జూలైకి ఆ విచారణను వాయిదా వేయాలట!

ఇదీ, ఆచరణలో ‘లౌకికవాదం’! ప్రజలను భావోద్వేగాలకు గురిచేస్తూ మతతత్వ ఉద్రిక్తతలు సమసిపోకుండా ఎడతెగకుండా కొనసాగించడమే ఈ ‘లౌకికవాదుల’ అసలు లక్ష్యం. ఒకసారి చరిత్రలోకి వెళదాం. రామ్‌ చబూత్ర స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతిని కోరుతూ రామజన్మస్థాన్‌ మహంత్‌ రఘవర్‌దాస్‌ 1885 జనవరి 29న ఫైజాబాద్‌ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. మహంత్‌ అభ్యర్థనను బాబ్రీ మస్జీదు ముతావలి (రక్షకుడు) మొహమ్మద్ అస్ఘర్‌ వ్యతిరేకించారు. మహంత్‌ పిటిషన్‌ను ఫైజాబాద్‌ సబ్‌ జడ్జి 1885 డిసెంబర్‌ 24న కొట్టివేశారు. 1949 డిసెంబర్‌ 23న ‘వివాదాస్పద కట్టడం’లో హిందూ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు; వాటికి పూజలు చేయడమూ ప్రారంభమయింది. ఇదిలా వుండగా ‘వివాదాస్పద కట్టడం’లోని హిందూ దేవతా విగ్రహాలను తొలగించడాన్ని నిరోధిస్తూ ఫైజాబాద్‌ సివిల్‌ జడ్జి 1950 జనవరి 1న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఆ విగ్రహాలకు పూజలు యథావిధిగా కొనసాగడానికి అనుమతించారు.

1992 డిసెంబర్‌ 6న దేశం నలు మూలల నుంచి వచ్చిన కరసేవకుల ఆగ్రహావేశాలతో బాబ్రీ మస్జీదును కూల్చివేశారు. మసీదు కూలిపోయిన స్థలంలో ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక కట్టడంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ ప్రతిమలకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.

ముస్లింల వశమైన రామజన్మభూమిని స్వాధీనం చేసుకోవడానికి హిందువులు ముఖ్యంగా పద్దెనిమిదో శతాబ్దం నుంచి పలుమార్లు ప్రయత్నించారనేందుకు గట్టి చారిత్రక సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1767లో ఆస్ట్రియన్‌ జెస్యూట్‌ పర్యాటకుడు జోసెఫ్‌ టియెఫెంథాలెర్‌ అయోధ్యలో పర్యటించారు. మొఘల్‌ రాజు అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ హిందువులు, బాబ్రీ కట్టడంలో పూజలు నిర్వహిస్తూనే వున్నారని, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారని ఆయన రాశారు. వాస్తవం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ వివాదం ఇంతకాలం, అందునా బ్రిటిష్‌ వలసపాలకులు నిష్క్రమించిన తరువాత కూడా అపరిష్కృతంగా ఎందుకు ఉన్నది? ‘లౌకికవాదులే’ కారకులని చెప్పక తప్పదు. స్వతంత్ర భారతదేశంలో అత్యధికకాలం అధికారంలో ఉన్న ఈ ‘లౌకికవాదులు’ తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికే అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచుతున్నారు. రామాలయ వ్యతిరేక, అనుకూల వర్గాలు రెండూ సమస్యను సాకల్యంగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి. ఇరవైఐదు సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదును మూకలు కూల్చివేశాయి. అయితే ఆ మూకలు అమోధ్యలో గానీ, పొరుగునే ఉన్న ఫైజాబాద్‌లో గానీ మరే మసీదును కూల్చి వేయలేదు. బాబ్రీ మసీదును కూల్చి వేయకుండా ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం సాధ్యం కాదు గనుకనే బాబ్రీ కట్టడాన్ని నేలకూల్చడం జరిగింది.

కోపోద్రిక్తులైన కరసేవకులు కూల్చివేసింది ఒక మస్జీదును కాదు. దయాదాక్షిణ్యాలులేని ఒక విదేశీ దురాక్రమణదారుని చేతుల్లో హిందువులు పొందిన అవమానానికి ఒక ప్రతీకగా ఉన్న కట్టడమది. స్థానికులు భక్తి ప్రపత్తులతో పూజలు జరిపే ఒక ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో మస్జీదును నిర్మించడం దురహంకార దురాక్రమణదారుని రాజకీయ ఔద్ధత్య ప్రకటన కాదూ?

ఈ చారిత్రక అన్యాయానికి ప్రతిక్రియ ఎలా ఉండాలి? అది న్యాయసంబంధమైనదిగా కాక రాజకీయంగానే ఉండాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో సర్దార్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణంలా ఉండాలి. మత విశ్వాసాలకు సంబంధించిన, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు న్యాయస్థానాలు సమర్థ, సముచిత పరిష్కారాలను చూపలేవు. చారిత్రకంగా అన్యాయాలు, అణచివేతలకు గురైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికై రిజర్వేషన్ల సదుపాయం కల్పించడం ఒక రాజకీయ నిర్ణయం. స్వాతంత్ర్యానికి పూర్వం భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వం ముస్లింలీగ్‌ బెదిరింపులు, ఒత్తిళ్ళకు లొంగిపోయి దేశ విభజనకు అంగీకరించింది. తాము భద్రంగా ఉన్నామని భావించేందుకు ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం అవసరమయితే ఏ న్యాయస్థానమయినా అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేయగలదా?

ప్రవక్త మహమ్మద్‌పై ఒక వివాదాస్పద వ్యంగ్య చిత్రాన్ని పునర్ముద్రించినందుకు 2015 జనవరిలో అవధ్‌నామా ఎడిటర్‌ షిరీన్‌ దాల్విని అరెస్ట్‌ చేశారు. దేశంలో ఏ ఒక్కరూ చదవక ముందే ప్రముఖ రచయితలు సల్మాన్‌ రష్దీ, తస్లీమా నస్రీన్‌ నవలలను నిషేధించారు. దేశ జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న హిందువులకు ఆ నవలలను చదివే హక్కును నిరాకరించారు. ముస్లింల మనోభావాలను గౌరవించే పాలకులు హిందువుల మనోభావాలను పట్టించుకొంటున్నారా?

సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు, వివాదాస్పద నవలలపై నిషేధం విషయంలో కార్యనిర్వహక వర్గం అంటే ప్రభుత్వంగానీ, ప్రభావిత వ్యక్తులు లేదా వర్గాలు గానీ న్యాయవ్యవస్థ మధ్యవర్తిత్వం కోసం వేచివుండలేదు. న్యాయస్థానాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. రామజన్మభూమి కేసులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమే నిర్ణయం తీసుకోవాలి. అయితే కపిల్‌ సిబల్‌ లాంటి వారు మన వ్యవస్థలో బలీయ, ప్రభావశీల వ్యక్తులుగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వాలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంత తేలికేమీ కాదు.

బల్బీర్‌ పుంజ్‌

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)