నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను
(అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం)
—————
సెంట్రల్ జైలు, లాహోరు
మార్చి 3, 1931.
ప్రియమైన కులకార్,
ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను.
ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా వుండు. ఇహనేం రాయనూ!
వాడి కొకటే ధ్యాస,
కౄరత్వంలో కొత్త పద్దతులెలా కనిపెట్టాలని
ఆత్యాచారాల నెలా అంతమొందించాలని
నరకం అంటే కోపమెందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా ఆన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం!
నేను కొద్ది క్షణాల అతిధిని
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చుట్టూ గాలిలో చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి
క్షణిక మయినది
ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు, తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై
ధైర్యంగా వుండు….నమస్తే!
నీ సోదరుడు,
భగత్ సింగ్.