– కె.శ్యాంప్రసాద్
సెప్టెంబర్ 19 – బోయి భీమన్న జయంతి
‘గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకు
చేతికి కర్రిచ్చు రైతులార!
నడవ నేర్చినతోనె బుడతను గొంపోయి
పాలేరు దనముంచు మాలలార!
పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించి
మనుగడలే మాపు జనకులార!
వంటయిల్లే ప్రపంచమ్ముగా చేసి
తనయల మెడకోయు తల్లులార!
జాతి శక్తివిహీనమై చచ్చుచుండ
కనులను మూసికొంటిరే గాఢనిద్ర
శక్తికంతకు మూలము చదువుకాన
చదువ బంపుడు మీ తనూజాళినింక’
మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. పైన చెప్పుకున్న పద్యం ఆయనదే. తెలుగు సాహిత్యంలో భీమన్న పేరును అజరామరం చేసిన ‘పాలేరు’ నాటకంలోని పద్యమిది. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పాలేర్లు, రైతుకూలీలు తమబిడ్డలను చదివించాలని, తద్వారా వారి అభివృద్ధికి బాటవేయాలని ‘పాలేరు’ నాటకంలో ఉద్బోధించారు. కవికి సహజంగా ఉండవలసిన దృష్టి కూడా ఇదే కదా! పన్నెండేళ్ల వయస్సులోనే భీమన్న మృదుమధురమైన పద్యకవిత రాశారు. ఎన్నో గ్రంథాలను రచించి ప్రచురించారు. కాశీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకొన్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకొన్నారు. 95 సంవత్సరాలు జీవించటంకాదు విశేషం, చివరిరోజుల వరకు కవిత్వం చెప్పుతూనే ఉన్నారు. గ్రంథాలు వెలువరిస్తూనే ఉన్నారు. ఆయన వ్రాసిన చివరి గ్రంథం ‘శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు’ ఆయన మరణానంతరం వెలువడింది.
కమ్యూనిల్ అవార్డు వివాదం, రౌండ్ టేబుల్ సమావేశాలలో దళితవాణి వినిపించిన నేపథ్యంలో బోయి భీమన్న నాటకం పాలేరు (1938) రాశారు. ఈ రెండు చారిత్రక అంశాలలోను ప్రతిబింబించేది డాక్టర్ అంబేడ్కర్ తాత్వికతే. భీమన్న మీద కూడా ఆ ప్రభావం పడిందని అనిపిస్తుంది. ‘దళితజనులకంబేడ్కరు… ధర్మమె మతమన్నాడు… బౌద్ధ ధర్మమొకటేరా భారతీయ మన్నాడు’ అంటూ అంబేడ్కర్ తాత్వికతనే భీమన్న ఆకళింపు చేసుకున్నారు. పాలేరు నాటకంలో దీనినే ఆవిష్కరించారు. వెంకన్న అనే పాలేరు యువకుడు, అగ్రకులంగా గౌరవ మర్యాదలు పొందుతున్న వనబాల అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవ డానికి ఎంత సంఘర్షణ పడ్డారో ఇందులో చెప్పారు భీమన్న. తరువాత ఉపకారి (ఉపాధ్యాయుడు) సలహా మేరకు వెంకన్న చదువుకుని, వెంకటేశ్వరరావుగా మారి, డిప్యూటి కలెక్టర్ హోదాలో స్వస్థలానికి వచ్చి భూస్వాముల ఆగడాలను ఎదుర్కొంటాడు.
సాహిత్యంలో ఆయన సిద్ధాంతం రసాద్వైతం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం భారతజాతిలో ఏకత్వం. పంచములుగా, ఎస్‌సిలుగా, హరిజనులుగా సమాజం పిలుస్తున్న వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి, సమకాలీన సమాజంతో గౌరవానికి అర్హులయ్యే టట్లుగా చేయటం. పాలేరు, కూలిరాజు వంటి నాటకాల లోనూ, ‘జన్మాంతర వైరం,’ ‘అంబేడ్కర్ సుప్రభాతం,’ ‘అంబేడ్కరిజం,’ ‘పంచమ స్వరం’ మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తుంది.
1911 సెప్టెంబరు 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించిన భీమన్న కాకినాడలో కళాశాలవిద్య పూర్తిచేశారు.
1937 నుండి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్న గారి పత్రిక ‘జయభేరి’లో సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. 1955 నుండి రాష్ట్రప్రభుత్వంలో అనువాదకునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేట్ అయ్యారు. కేంద్రసాహిత్య అకాడమీ నుండి పురస్కారం అందుకొన్నారు. జాషువా ఫౌండేషన్ వారు ఇచ్చే జాషువా పురస్కారాన్ని అందుకొన్న ఏకైక ఆంధ్రుడు భీమన్న.
”ప్రతిరోజూ సుప్రభాతం పాడితేనేకాని
దేవుడికే మెలకువరాని ఈ దేశంలో
ఎంతటి ప్రసిద్ధ సత్యం కానీ – ఎవరో
అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండాలి మనిషికి”
అంటారు ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథంలో.
మతం మార్పిడి వంటి సమస్యలపై ఆయన చాలా దృఢంగా, బలంగా స్పందించారు. 1980లో వెలువడిన ‘జన్మాంతర వైరం’ గ్రంథంలో వారు చర్చించిన ఈ విషయాలు గమనించదగ్గవి.
”నేను హిందువుగా పుట్టాను, మతం మార్చ వలసిన అవసరంలేదు. పెనంలో నుండి పొయ్యిలోకి దూకటం దేనికి?
ఈ హిందుమత మూలపురుషులు, ఈ భారత సంస్కృతీ మూలఋషులు నావాళ్లు. నా హరిజనులు అని నేను విశ్వసిస్తున్నప్పుడు, నా వారసత్వపు హక్కుల్ని ఏదోవిధంగా తిరిగి సంపాదిస్తానే గాని, పారిపోవడమనేది ఎందు కుంటుంది? మెజారిటీ జనం వాణ్ణి మైనారిటీగా ఎందుకు మారతాను?
కాగా, నేను హిందువుని. ఈ జాతీ, ఈ దేశమూ నావి. పోనీ నేనొక్కణ్ణీ మరోమతంలోకి పారిపోతానను కోండి. నాతో కొంతమందిని తీసుకుపోతానను కోండి. ఎంతమందిని తీసుకుపోగలను? లక్షా, రెండులక్షలూ? వాళ్లయినా, నామీద గౌరవంతో వస్తారు. అవతలి మతంలో విశ్వాసంతో కాదు గదా?
ఔరంగజేబులాంటి ముస్లిం నిరంకుశ చక్రవర్తులు, బ్రిటిషర్లలాంటి సర్వశక్తిమంతులైన క్రైస్తవ పాలకులు – తమ అధీనంలోని చతురోపాయాలనూ ప్రయోగించి కూడా ఎంతమంది మావారిని (మాలలను, మాదిగలను) తమతమ మతాలలోకి ఆకర్షించగలిగారు?
గొంతెమ్మ, బతుకమ్మ, మైసమ్మ పండుగలకు, బోనాలకు, గ్రామదేవతలకు, పసుపు, కుంకుమతో దైవత్వం కల్పించబడ్డ రాళ్ళకూ, చెట్లకూ, గదులలోని గోడలకూ ఆత్మార్పణ చేసుకునే ఈ నా కులం పదిహేను కోట్లమంది మాదిగలను నాతో తీసుకుపోగలనా?
నా స్వార్థంకోసం, నా ప్రతిష్ఠకోసం నేను పారిపోకూడదు. గుడిసెలలో, దరిద్రంలో, కూలీలుగా బ్రతుకుతూ కూడా బోనాల పండుగలు చేసుకుంటూ, భోగులుగా జీవిస్తున్న ఈ నా పదిహేను కోట్ల మందినీ వదిలేసి నేను పారిపోకూడదు. నేను పారిపోతే నాకూడా వీళ్లు రారు, రాలేరు. పూర్వకాలంలో వచ్చారు కనుకనా? పారిపోక మరేంచెయ్యాలి?
నేనే నుక సిసలైన మనిషినైతే, నేనే కనుక నిజాయితీ కల మాల మాదిగవాణ్ణయితే, నేనే కనుక ధర్మవ్యాధ, మాతంగ, వాల్మీకి, వ్యాస మహాపురుషుల వారసుణ్ణయితే, నేనే కనుక నా కులాన్ని దాస్యం నుంచి విమోచన కలిగించడం అనే ధర్మానికి కట్టుబడిన వాణ్ణయితే, నేను కనుక ఆర్ష భారతజాతి సమగ్ర సంఘటిత శ్రేయస్సును కోరినవాణ్ణయితే – నేను నా సమస్త పదవీ విద్యాప్రతిష్ఠా గర్వాల నన్నింటినీ పీకిపారేసి, ఈ నా గ్రామీణ హరిజన గుడిసెవాసులతో ఉండిపోవాలి.
వాళ్లతోనే ఉంటూ వాళ్ల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ, ఒక్కొక్క అడుగే వాళ్లను ముందుకు నడిపించాలి. తరతరాల దాస్యంతో, దారిద్య్రంతో సగం చచ్చిపోయి ఉన్న వాళ్లను మాన సికంగా ఓదార్చాలి. బ్రెయిన్‌వాష్ చేయబడినవారి మెదళ్లకు తిరిగి స్వాస్థ్యం కలిగించాలి. పూర్వౌన్న త్యాన్ని చూపి వాళ్లను పునశ్చేతనుల్ని చేయాలి. ఇప్పుడిదంతా నాకు భౌతికంగా సాధ్యం కాకపోవచ్చు. కర్తవ్యబోధ చేస్తే ఏ ఒక్క యువకుడైనా కంకణధారి కావచ్చు.. ఏ కులానికాకులం కులసంఘాలు పెట్టుకుంటూ. వైరివర్గాలుగా విడిపోతూ సెగ్రిగేట్ ఐపోతున్న ఈనాటి రాజకీయ పదవీ రాక్షసయుగంలో కులాంతరీకరణను బోధిస్తున్నాను ఎందుకు? హరిజన యువకులేకాదు, ఏ కులం యువకులైనా సరే వివేకంతో, యథార్థాన్ని గుర్తించి భారత సమాజ పునర్నిర్మాణంకోసం ముందుకు వస్తారన్న ఆశతో..
ఈ మధ్య హిందూ మతాధిపతులు కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది చాలా హర్షించదగిన హృదయపరివర్తన. ఆదిలో ప్రపంచ మానవులందరూ హిందువులేనని, రకరకాల కారణాల వల్ల ఇతర మతాలు ఏర్పడుతూ వచ్చాయని కంచి కామకోటి పీఠాధిపతి అన్నట్లు పత్రికలలో చదివాం. ‘అలా ఇతర మతాలలోకి పోయినవారు తిరిగివస్తే, వారికి హిందూమతం హృదయపూర్వ కంగా స్వాగతం ఇస్తుంది’ అని కూడా వారన్నారు. ఇది మరీ హర్షదాయకం. అయితే ‘ఏ దుష్టహేతువులు ఆనాడు (ఈనాటికి కూడా) హిందువులను ఇతర మతాలలోకి తరిమివేశాయో (తరిమివేస్తున్నాయో) ఆ దుష్టహేతువులు ఈనాడు తొలగిపోయాయా?’ అనేది నా మరో ప్రశ్న.
”కృణ్వంతో విశ్వమార్యం” (ప్రపంచంలోని మానవులందర్ని ఆర్యులుగా మార్చండి) అని ఉద్బోధించిన ఋగ్వేదం నాటి సర్వజన సమతా సామాజిక వ్యవస్థ ఈనాటి హిందూ సమాజంలో ఉన్నదా? హైందవేతరుడెవడైనా హిందూమతంలోకి (తిరిగి) రావాలంటే ఎలా రాగలుగుతాడు? ఏ కులంలోకి రాగలుగుతాడు?
హిందూమత పునరుజ్జీవనం కోసం తన కులనిర్మూలనా గ్రంథంద్వారా డా|| అంబేడ్కర్ ఒక చక్కని సూచన చేశాడు. ”ఒక సర్వహిందూ పరిషత్తు సమావేశమై మొత్తం హిందూమతానికి ఒక సిద్ధాంత సంహితను రూపొందించాలి” అన్నాడాయన. తక్కిన మతాలకు ఉన్నట్లే హిందూమతానికి కూడా ఒక ఏకైక సంహిత ఉండాలి. పోనీ ఆర్షమతం ఒక స్వేచ్ఛా సంహిత అనుకొన్నప్పటికీ, దాని విశ్వజనీనత నిలబడాలంటే, విశ్వజనం దానిని విశ్వసించాలంటే కనీసం కులవ్యవస్థ అయినా నిర్మూలించబడాలి.”
(1980లో వెలువడిన ‘జన్మాంతర వైరం’లో డా||బోయి భీమన్న)
జన్మాంతర వైరం కావ్యం చివరిలో గుడిగంటలు ద్వారా ఆయన ధ్వనింపజేసిన సందేశమిలా ఉంది.
”లే దస్పృశ్యత, లేదు లేమి, కులముల్ లేవు, ఆర్షలోకమ్ము తత్
భేదక్లేశము లెల్లతీరి, ధ్వజమెత్తెన్ లోక శ్రేయస్సుకై
వేదోక్తమ్మిది సర్వజాతి సమతావిష్కార తత్త్వమ్ము బ్రా
హ్మీదేవత్వము నొంది సాగుడొకటై, మేధావులై ఎల్లరున్”
అనుచు వినిపించె మ్రోల శివాలయమున
ఠంగు మనుచున్న రుద్ధ ఘంటా స్వరాలు
సర్వమానవ సమ సమాజవ్యవస్థ
నవని కిడ బైలుదేరు డన్నట్టి పిలుపు.
డా|| బోయి భీమన్న సాహితీ వారసత్వం తెలుగు కలాలలో సుస్పష్టంగా కొనసాగింది. సంస్కరణ, జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత కవితా శిల్పి డా|| భీమన్న. పాలేరు నుంచి పద్మభూషణ్ వరకు ఆ కవి ప్రస్థానం ఒక అద్భుతం.
(రచయిత సామాజిక సమరసత అఖిల భారత కన్వీనర్)
జాగృతి సౌజన్యంతో…