విత్తన కంపెనీలకు విత్తనాలు సరఫరా చేయడానికి వీలులేదంటూ మోన్సాంటో పై డిల్లీ హైకోర్ట్ నిషేధం విధించింది. దీనితో విత్తన విక్రయ రంగంపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న విదేశీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత పేటెంట్ చట్టంలో పేర్కొన్నవిధంగా విత్తనాలు, జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలో ప్రభావితం చేయడానికి, పేటెంట్ చేయడానికి వీలులేదని హైకోర్ట్ స్పష్టం చేసింది. దీనితో జన్యు మార్పిడి పంటలను వ్యతిరేకిస్తున్నవారి వాదనకు బలం చేకూరినట్లైంది. అలాగే మొక్కల్లో జన్యు పరమైన పదార్ధాన్ని పేటెంట్ (యాజమాన్య హక్కులు) చేయడానికి వీలులేదనే మొక్కల వివిధత్వం, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం, 2001 నిబంధనను కూడా హైకోర్ట్ సమర్ధించింది. దీనితో మన దేశంలో పెరిగే మొక్కలు, వాటిలోని జీవపదార్ధాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న మోన్సాంటో వంటి విదేశీ కంపెనీల ప్రయత్నాలకు చుక్కెదురైంది.
ఏప్రిల్, 11న తీర్పు వెలువరించిన జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ యోగేశ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం బీటీ పత్తిలో ‘బొల్గార్డ్’, ‘బొల్గార్డ్ 2’ రకం విత్తనాలపై మోన్సాంటో టెక్నాలజీస్ కంపెనీకి ఎలాంటి పేటెంట్ హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తిపై పూర్తి ఆధిపత్యం సంపాదించాలనుకున్న విదేశీ కంపెనీల ప్రయత్నాలకు గండిపడుతుంది. అలాగే బీటీ పత్తి విత్తనాలను ఉత్పత్తిచేసే స్వదేశీ కంపెనీలకు రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా అసలు జన్యు మార్పిడి విత్తనాల మార్కెట్ తగ్గి పర్యావరణ పరిరక్షణ వ్యవసాయ పద్దతులకు ప్రోత్సాహం లభిస్తుంది.
బీటీ విత్తనాల ద్వారా జన్యు మార్పిడి పంటల రంగంలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు విదేశీ కంపెనీలు భారత్ లో చాలా ప్రయత్నం చేశాయి. పత్తి విత్తనలే కాకుండా బీటీ వంకాయ, బీటీ ఆవ పంటలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని చూశాయి. అనేక ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకంగా ఈ పంటలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు కూడా. ఈ పరీక్షలను స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
డిల్లీ హైకోర్ట్ తాజా తీర్పు రైతుల హక్కుల పరిరక్షణ, భారత ఆహార భద్రత మరింత బలపరిచిందని జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్విని మహాజన్, భారతీయ కృషక్ సమాజ్ అధ్యక్షులు కృషణ్ వీర్ చౌదరి అన్నారు. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకుని మోన్సాంటో కంపెనీ 2002 నుంచి 80లక్షల రైతుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేసిన 7వేల కోట్ల రూపాయల రాయల్టీని తిరిగి వసూలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా పత్తి విత్తనాల ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం 2015లో వీటి విక్రయాన్ని అత్యవసర వస్తువుల చట్టం, 1955 కిందికి తెచ్చింది.
బీటీ పత్తి విత్తనాలను నేరుగా రైతులకు విక్రయించడానికి వీలులేదన్న నూజివీడు కంపెనీ వాదనను కూడా కోర్టు సమర్ధించింది. అలాగే రైతులు తాము ఉపయోగిస్తున్న విత్తనాలను దాచి, తిరిగి వాడుకుని, ఇతరులకు ఇచ్చే హక్కును పూర్తిగా కలిగి ఉంటారన్న చట్ట నిబంధనను కూడా కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. కనుక విత్తన సరఫరాను ప్రభావితం చేయడం ద్వారా మోన్సాంటో వంటి కంపెనీలు రైతుల ప్రయోజ నాలను దెబ్బతీయడానికి వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. భారత దేశంలో అమ్మకాలు జరపాలంటే ఇక్కడి చట్టలకు లోబడి పని చేయవలసిందేనని పేర్కొంది.
ఈ తీర్పు విచ్చవిడిగా విదేశీ విత్తనాలను అమ్ముతున్న, కంపెనీలకు, ఎలాంటి ముందస్తు పరీక్షలు జరపకుండా జన్యు మార్పిడి పంటలను అనుమతిస్తున్న వ్యవసాయ సంస్థలకు గట్టి గుణపాఠమే అవుతుంది.
(లోకహితం సౌజన్యం తో )