సూర్యాస్తమయం అవుతున్నవేళ, పల్లె ప్రజలు ఇళ్ళకి తిరిగొస్తున్నపుడు చుట్టూరా ప్రశాంత వాతావరణం. వరిచేలు గాలికి రెపరెపలాడుతున్నాయి. గ్రామం ముందు బురుజు కాలం తాకిడికి తట్టుకొని ఆనాటికీ అజేయంగా నిలిచి ఉంది. గ్రామంలో ఆవులని, దూడలని తోలుకుని పశువుల కాపర్లు ఉత్సహంతో వస్తున్నారు.
బావుల దగ్గర నీళ్ళు నింపుతూ ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. రేపు ఉదయం జరుగబోయే ప్రళయం ఆ సాయంత్రం ఎవరి ఊహకూ తట్టలేదు. భైరవునిపల్లి గ్రామస్థులలో ఉన్న ఐక్యత పెట్టనికోటగా రూపొందింది. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఆ గ్రామస్థుల సాహసం, పట్టుదల ఆదర్శంగా కనపడింది. అనేక గ్రామాలలో రజాకార్ల దురంతాలు మితిమీరిపోయినా ఈ గ్రామంపైకి మాత్రం రాలేకపోయారు. నవాపేట్, నెలటోల, యశ్వంతపూర్, కోమల్లా, చింటకుంట, నీలిగొండ తదితర గ్రామాల్లో రజాకార్ల వల్ల జరిగిన మానభంగాలు, దోపిళ్ళు, దహనాలు, హత్యలు మామూలు వార్తలైపోయినాయి. అయినా భైరవునిపల్లి ప్రజలు మాత్రం వీటినుండి దూరంగా సురక్షితులమనే భావంతో నిద్రపోతున్నారు.
భైరవునిపల్లి ఆక్రమించాలని బయలుదేరిన నిజాం సైనిక బలగం ముస్త్యాల గుండా వల్లపట్ల చేరుకుంది. వల్లపట్ల నుండి సైన్యాన్ని మళ్ళించి మరోవైపు నుండి భైరవునిపల్లిని చుట్టుముట్టమని ఆదేశించారు. గ్రామాన్ని అరమైలు పరిధిలో సైన్యం చుట్టుముట్టింది. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఈ భారీ ఎత్తున ఉన్న బలం భైరవునిపల్లి మీద దాడికి సిద్ధంగా ఉంది. ఈలోగా ఊరి బయటికి కాలకృత్యం తీర్చుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఈ సైన్యాన్ని చూసి అదిరిపోయాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు. ఆ ఊరి బ్రాహ్మణుడు విశ్వనాథ్ భట్ జోషి. ఆయనను షూట్ చేయాలని అధికారులు అన్నారు. అయితే వెంటవచ్చిన హిందూ అధికారి శ్రీ యం. యన్.రెడ్డి జోషిచేత మాట్లాడించి అమాయకుడైన బ్రాహ్మణుడనే విషయం స్పష్టంచేయ ప్రయత్నించాడు. ఈలోగా అక్కడే ఇద్దరు సైనికులు ఆ గ్రామ నివాసి ఉల్యంగల వెంకట నర్సయ్య అనే వ్యక్తిని పట్టుకొన్నారు. అతను విడిపించుకొని గ్రామంలోకి పరుగు లంకించుకున్నాడు. మరుసటి క్షణమే బురుజుపై ఉన్న నగారా మ్రోగింది. చిన్న ఫిరంగి కాల్పులు ప్రారంభమయ్యాయి. అయితే చుట్టుముట్టిన సైనిక బలగం దగ్గర పెద్ద ఫిరంగి ఉంది. ఇటునుండి వరుసగా పదమూడు గుళ్ళను సైనికులు పేల్చారు. ఈ ప్రేలుడు చప్పుడు చుట్టుప్రక్కల గ్రామాలకు వినబడింది. గ్రామంలో అనేక ప్రాంతాలలో నిప్పు అంటుకుంది. కొన్ని ఇళ్ళు కూలిపోయాయి.
(విజయక్రాంతి సౌజన్యం తో)