Home News భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1

0
SHARE

కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్‌ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌, జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన ఈ ‘చరిత్ర శాపగ్రస్థుల’ను ఆదుకోవాలనే గట్టిగా కోరుకున్నారు. ఆ పనిని ఇప్పుడు వేగవంతం చేయవలసి వచ్చింది. అందుకే బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల నాడు పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చింది. పాకిస్తాన్‌లో పెరిగిన మత ఛాందసవాదం, ఉగ్రవాదం ఫలితంగా పరిస్థితులు మారాయి. మైనారిటీలు భారత్‌వైపు చూశారు. కానీ ఇక్కడి పరిస్థితులు మారాయి. పాక్‌లో మతోన్మాదం, ఛాందసవాదం పెచ్చరిల్లాయి. ఇక్కడ బుజ్జగింపు, సెక్యులరిజం పెచ్చరిల్లాయి. ఫలితం ఒక్కటే హిందువులంటే ద్వేషం. బాధితులైన హిందువులను, మతోన్మాదంతో రెచ్చిపోతున్న ముస్లిం ఉగ్రవాదులను ఒకే విధంగా చూడాలన్న రీతి. ఫలితమే ఇవాళ సీఏఏకు ఎదురైన వ్యతిరేకత. గాంధీ, నెహ్రూ ఏమన్నా అనవచ్చు. కానీ ముస్లింలను దేశంలోకి అనుమతించాలంటోంది కుక్కమూతి పిందె కాంగ్రెస్‌. దీనికి కమ్యూనిస్టులు, బీజేపీ వ్యతిరేకత పేరుతో భారత్‌ను వ్యతిరేకించే శక్తులు, హిందూత్వను పెకలించే పనిలో ఉన్న విధ్వంసక గణాలు వంత పాడుతున్నాయి. సీఏఏతో బాగా లాభపడేది పాకిస్తాన్‌లో మిగిలిపోయిన దళితులే. సీఏఏ అమలుపై స్టే విధించవలసిందిగా విపక్షాలు కోరినా భారత సుప్రీంకోర్టు సుస్పష్టంగా తిరస్కరించింది. అయినా కొన్ని పక్షాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరొకసారి చరిత్రలో తమ హీన స్థానాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.


విభజన విషాదానికి, తప్పిదానికి విరుగుడు

డిసెంబర్‌ 11, 2019న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్‌ ఆమోదం పొందింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం కేంద్రం రూపొందించలేదు. నాలుగేళ్ల తరువాత ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజా చట్టం 1955నాటి పౌరసత్వ చట్టానికి సవరణ. 2014కు ముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం. 2014 కంటే ముందు భారత్‌కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనుల, బౌద్దులు, పార్సీలు (ఆరు మతాలు) మన దేశ పౌరసత్వానికి అర్హులు. అంటే దేశ విభజనలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని సవరించే ప్రయత్నమే. దశాబ్దాలుగా లేని మత స్వేచ్ఛను తిరిగి ప్రసాదించడమే.

నెహ్రూ, గాంధీ, పటేల్‌, ముఖర్జీ ఏమన్నారంటే..

 ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. దేశం ముక్కలైంది. విభజనతో తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్‌ పరాయి దేశమైంది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలు. వారందరికి రక్షణ కల్పించడమేకాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం మన బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ గట్టిగానే చెప్పారు.

‘రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదరసోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేక పోతున్నారు. వాళ్లు ఎప్పటికీ మనవాళ్లే. వారి బాగోగులు ఎప్పటికీ మనవే..’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ ఆగస్ట్‌ 15, 1947న ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పారు. ఆ తర్వాత నవంబర్‌ 15,1950న పార్ల మెంట్‌లో ప్రసంగిస్తూ ‘విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందే. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించవలసిందే..’ అన్నారు.

‘పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులకు, సిక్కులకు అక్కడ సుఖంగా, శాంతియుతంగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్‌కు రావచ్చును. అలాంటివారిని భారత్‌ ఆహ్వానించాలి..’ అని మహాత్మా గాంధీ సెప్టెంబర్‌ 26, 1947న తన ఉపన్యాసంలో స్పష్టం చేశారు.

‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన మన తోటివాళ్లు కేవలం భౌగోళిక మైన సరిహద్దులు మారినందువల్ల హఠాత్తుగా విదేశీయులు అయిపోరు. ఈ విషయాన్ని మనం మరచిపోరాదు’ అని తూర్పు బెంగాల్‌ శరణార్ధులను ఉద్దేశించి తొలి హోమ్‌ మంత్రి పటేల్‌ అన్నారు.

నవంబర్‌ 25, 1947న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదించిన తీర్మానంలో ‘తమ మాన ప్రాణాలు, గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికి భద్రత కల్పించడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది. వీరేకాదు ఇకముందు వచ్చేవారికి కూడా ఆశ్రయం కల్పించాలి.’ అని స్పష్టంగా ఉంది.

‘తూర్పు బెంగాల్‌లోని హిందూ జనాభా రక్షణను భారత్‌ విస్మరించరాదు. మానవత్వం, స్వలాభం మాత్రమే కాకుండా స్వాతంత్య్రానికి, మేధోవికాసానికి తరతరాలుగా వారి త్యాగాలు, పడిన బాధలను దృష్టిలో ఉంచుకోవడం సముచితం’ అని జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డా. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ అన్నారు. అంటే అక్కడ మైనారిటీలుగా బాధపడుతున్న హిందువులను, ఇతరులను కాపాడుకోవడం మన బాధ్యత అన్నది చారిత్రక సత్యం. ఈ పెద్దలెవరూ ముస్లింల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

నెహ్రూ – లియకత్‌ ఒప్పందం

తమ దేశాల్లోని మైనారిటీలకు రక్షణ కల్పించా లని భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. ప్రధమ ప్రధానులు జవహర్‌ లాల్‌ నెహ్రూ, లియాకత్‌ అలీ 1950 ఏప్రిల్‌లో ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. దాని ప్రకారం:

  1. శరణార్ధులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు
  2. ఎత్తుకుపోయిన స్త్రీలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి
  3. బలవంతపు మతమార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు
  4. మైనారిటీల హక్కులను కాపాడాలి

ఒప్పందాన్ని పాకిస్తాన్‌ గౌరవించలేదు. పాక్‌లోని దళితులను వెళ్లకుండా అడ్డుకుంది. అదే ఇవాళ్టి సత్యం కూడా.

మైనారిటీలపై మారణకాండ

ఇస్లామిక్‌ ఛాందసవాదం పెరగడం వల్ల, పాక్‌, బంగ్లాలు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటించు కోవడంతో అక్కడి మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. మత మార్పిడులు, బాలికల అపహరణ, ప్రార్ధనా మందిరాల విధ్వంసం, దైవదూషణ పేరుతో చంపివేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్‌కు తరలివచ్చారు. ఆ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే. శరణార్ధులకు ఆశ్రయం కల్పించడం భారత్‌ కనీస బాధ్యత అయింది. ఈ విషయాన్ని ఇటీవలి తరం కాంగ్రెస్‌ నేతలు అంగీకరించారు కూడా. డిసెంబర్‌18, 2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్షనేత మన్మోహన్‌ సింగ్‌ ఈ శరణార్ధులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కోరారు.

ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి విభజనకు కారణమైన కమ్యూనిస్టులు ఆ దేశాలలో ముస్లిమే తరుల అణచివేతను చూసి చలించిపోయారు. మే 22, 2012న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఒక లేఖ రాస్తూ సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌, మతపరమైన అణచివేతకు గురై బంగ్లాదేశ్‌ నుంచి తరలివచ్చిన లక్షలాది శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని, పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్‌ కులాలకు చెందిన నామశూద్రులు, పొంద్రఖత్రియ, మారిa మొదలైన వారికి రక్షణ కల్పించాలని కోరారు.

పాక్‌, బంగ్లాల నుంచే ఎందుకు?

పౌరసత్వ సవరణ చట్టంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లను మాత్రమే ప్రస్తావించ డానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఈ దేశాలు నాటి అఖండ భారత్‌ భాగాలు. విదేశీ దండయాత్రలు, రాజకీయ, మత కారణాల వల్ల క్రమంగా మన దేశం నుంచి విడి పోయాయి. కానీ ఈ దేశాల సాంస్కృతిక మూలాలు ప్రధాన భూభాగమైన భారత్‌ తోనే ముడి పడి ఉన్నాయి. ఈ కారణంగా ఆ దేశాలల్లో సనాతన ధర్మాన్ని నమ్ముకొని అణచివేతలకు గురవుతూ మైనారిటీలుగా మిగిలిపోయినవారు భారత దేశం వైపు ఆశగా చూస్తున్నారు. వీరి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది.

హిందువులకు ప్రత్యేక దేశం లేదు

ప్రపంచంలో క్రైసవం, ఇస్లాంల తర్వాత మూడో అతిపెద్ద మతం హిందూత్వం. క్రిస్టియన్లకు, ముస్లింలకు ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. కొన్ని దేశాలు మతం ప్రాతిపదికనే ఏర్పడ్డాయి. హిందువు లకు ప్రత్యేకంగా ఒక్క దేశం కూడా లేదు. ఒకప్పుడు నేపాల్‌ హిందూ దేశంగా ఉన్నా కమ్యూనిస్టు నేత ప్రచండ అధికారంలోకి వచ్చాక ఆ హోదా తొలగిం చారు. హిందువుల మత విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు మూలం మన దేశమే. ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్న వారే అయినా హిందువు అంటే వారి మూలాలు భారత్‌లోనే ఉంటాయి.

పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యం

పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఇస్లాం అధికారిక మతం. ఆ దేశాల మైనారిటీలు హిందు వులు, సిక్కులు, బౌద్ధ, జైన్‌, పార్సీ, క్రైస్తవులు క్రమంగా మత స్వేచ్ఛకు దూరమయ్యారు. హింస, అత్యాచారా లతో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్‌కు వచ్చేశారు. చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాలవ్యవధి ఎప్పుడో పూర్తైపోయింది. ఇలాంటివారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయవలసి వచ్చింది. దీని ప్రకారం డిసెంబర్‌ 31, 2014కి ముందు ఆ మూడు దేశాల నుంచి మైనారిటీలు భారత్‌లో ప్రవేశించి ఉంటే అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు.

సవరణ ఎందుకు?

విదేశీయులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఉండగా ఈ మూడు దేశాల శరణార్ధుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు? డిసెంబర్‌ 31, 2014 ముందు ఇక్కడకు వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రత్యేక సవరణ అవసరమైంది. వారిలో చాలామంది ఎంతోకాలం క్రితమే ఇక్కడికి వచ్చారు. కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. ఆ మూడు దేశాల మైనారిటీ వర్గాల వారు కనీసం ఐదు సంవత్సరాలు (ఇంతకు ముందు 11 సంవత్సరాలు) భారత్‌లో ఉంటున్నట్లు చూపితే వారికి పౌరసత్వం లభిస్తుంది.

అడ్డుకునే లక్ష్యంతో దుష్ప్రచారం

2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో భారీగా హింసాత్మక నిరసనలు చెలరేగడం తెలిసిందే. ఈ చట్టం ద్వారా దేశంలోని ముస్లింల హక్కులను భంగం కలుగుతుందంటూ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాయి విపక్షాలు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా చొరబడిన రొహింగ్యాల వంటివారిని వారి దేశాలకు తిప్పి పంపాలన్న యోచన ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఉన్న మాట వాస్తవం. సీఏఏను బూచిగా చూపి సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా లబ్ధి పొందడమే వారి లక్ష్యం. దేశంలోని ముస్లింలందరూ బాధితులవు తారని కొని దేశ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయంగా ప్రచారం చేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చడమే వారి ప్రధాన ఎజెండా.

ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో 69 రోజులపాటు కొనసాగిన నిరసనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సి), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మూడూ కూడా ముస్లిం వ్యతిరేకమని.. వీటిని రద్దు చేయాలని వారి వాదన. ఈ ఆందోళనకారుల వెనుక అంతర్జాతీయ విద్రోహశక్తులు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. పనీ పాట చేయకుండా ఎవరూ మూడునెలలు ఆందోళనల్లో కూర్చోరు. భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే తన ఎజెండా అని ప్రధాని మోదీ మీద బహిరంగంగానే విషం కక్కిన జార్జి సోరోస్‌ లాంటి వారి నుంచి నిధులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో 100మందికి పైగా మరణించారు.

రెండో భాగం – భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 2

మూడో భాగం – భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 3

జాగృతి సౌజ‌న్యంతో…