జమ్మూకాశ్మీర్ లో అధికారభాషలుగా ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా కశ్మీరీ, డోగ్రీ, హిందీలకు స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. “జమ్మూ కాశ్మీర్ అధికార భాషల బిల్లు -2020” వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. ప్రజల డిమాండ్ నెరవేర్చే దిశగా ఈ బిల్లును ఆమోదించినట్టు అయన తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు జమ్మూకాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఒక ముందడుగు గా పరిగణించవచ్చు.
2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కాశ్మీర్ లో 19,952 మంది మాత్రమే అంటే అక్కడి జనాభాలో 0. 16 శాతం మంది ఉర్దూ మాట్లాడుతుండగా, 54.6 శాతం కాశ్మీరీ మాట్లాడుతారు. భద్రవాహి గోజ్రి, పహదీ లతో సహా 21.41 శాతం మంది హిందీ మాట్లాడుతారు. 20.6 శాతం మంది డోగ్రీ మాట్లాడుతుండగా, 1.7 90% మంది పంజాబీ మాట్లాడుతారు. అతితక్కువమంది మాట్లాడే ఉర్దూను, విదేశీభాష అయినా ఆంగ్లాన్ని రాష్ట్ర అధికారిక భాషలుగా చేసిన పాలకులు ఎక్కువమంది మాట్లాడే కశ్మీరీ , డోగ్రీ, పంజాబీ, హిందీ భాషలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.
రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును స్వాగతిస్తూ దోగ్రీ, హిందీ, కశ్మీరీ భాషలను జమ్ము కాశ్మీర్ అధికార భాషలుగా చేర్చాలన్న ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘ డిమాండును నెరవేర్చడమే కాకుండా, 2019- ఆగస్ట్-5 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అక్కడి ప్రజల్లో సమానత్వ స్ఫూర్తి నింపుతుందన్నారు. దీంతో ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ బిల్లు ఆమోదం ద్వారా అక్కడి ప్రజల్లోని వివక్ష, మనోవేదన లను అంతం చేస్తుందన్నారు. ఈ నిర్ణయం పరిపాలన సౌలభ్యం మాత్రమే కాకుండా కొత్తగా ఏర్పడ్డ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందన్నారు