- చక్మాలు.. స్వదేశమంటూ లేని నిర్భాగ్యులు
- 50 ఏళ్ల అనంతరం సమస్యకు పరిష్కారం
- ఎట్టకేలకు భారత పౌరసత్వం
స్వదేశమంటూ లేని దాదాపు లక్షమంది చక్మా, హజోంగ్ తెగల శరణార్థులకు ఎట్టకేలకు మంచి రోజులు రానున్నాయి. భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో 50 ఏళ్ల సమస్యకు తెరపడనుంది.
దేశ పౌరసత్వం లభించనున్నా, ప్రస్తుతం నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లో వారికి ఎలాంటి భూ యాజమాన్య హక్కులూ ఉండవు. ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరగాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తొలుత నిర్వాసితులు, అనంతరం శరణార్ధులుగా మారిన వీరు తమకంటూ ఓ గుర్తింపు కోసం ఇన్నేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
ఎవరీ చక్మాలు, హజోంగ్లు?: చక్మాలు, హజోంగ్లు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాలకు చెందిన వారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల్లో కూడా వీరి ఉనికి కనిపిస్తోంది. చక్మాలు బౌద్ధులు కాగా, హజోంగ్లు హిందువులు. 1964-65లో తూర్పు పాకిస్థాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌కు వలస వచ్చారు.
స్వదేశం వెళ్లేందుకు విముఖం: బంగ్లాదేశ్‌లో ఉండడం చక్మాలకు మొదటి నుంచీ ఇష్టం లేదు. దేశ విభజన సమయంలోనే వారు పాకిస్థాన్‌లో చేరడానికి నిరాకరించారు. తరువాత జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలోనూ పాల్గొనలేదు. కానీ మతపరంగా అణచివేత ఉంటుందన్న భయంతోవారెవరూ తిరిగివెళ్లడానికి సుముఖత చూపలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..: 1964-69 మధ్య బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన చక్మా, హజోంగ్‌లకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగా పౌరసత్వ చట్టం-1955ను సవరించేందుకు బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలా చేస్తే అక్రమ చొరబాటుదార్లకు మతం ఆధారంగా పౌరసత్వం కల్పించినట్టవుతుందని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని వాదిస్తున్నాయి. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపాల్సి ఉంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భాజపా ప్రభుత్వమే ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
(ఈనాడు సౌజన్యం తో )