Home News వెలగనున్న తెలుగు

వెలగనున్న తెలుగు

0
SHARE

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర విద్యాసంస్థలలో ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు తెలుగు భాషను బోధించి తీరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రక శుభ పరిణామం! తెలుగువారి జీవన వ్యవహారంలో తగ్గిపోతున్న మాతృభాషా ప్రభావం మళ్లీ పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేయగలదు. దేశానికి విదేశీయుల దురాక్రమణ నుంచి భౌతికంగా విముక్తి కలిగి ఏడు దశాబ్దుల గడచినప్పటికీ భావదాస్య విముక్తి కలగకపోవడం భారతీయ భాషల దుస్థితికి కారణం!

కర్నాటక తమిళనాడు మహారాష్ట్ర వంటి దక్షిణ భారత ప్రాంతాలలోను, ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలలోను మాతృభాషల మాధ్యమంగా విద్యాబోధన కొనసాగుతోంది. ఆంగ్లభాషా మాధ్యమ బోధన సమాంతరంగా కొనసాగుతున్నప్పటికీ మాతృభాషలను నిర్బంధంగా బోధించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో ఇన్ని దశాబ్దులు గడచినప్పటికీ విద్యార్థులు తెలుగు నేర్చుకొనడం నిర్బంధం కాకపోవడం సిగ్గుచేటైన వ్యవహారం. నిత్యజీవన వ్యవహారం తెలుగుభాష ఆంగ్ల పదాలతో భయంకరంగా సంకరమైపోయి ఉండటం భాషామతల్లికి విస్మయం కలిగిస్తున్న విచిత్ర వాస్తవం! క్రీస్తుశకం 1970 వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్ట్భద్ర స్థాయి వరకు తెలుగు మాధ్యమంగా బోధించే ప్రక్రియ మొదలైనప్పటికీ ప్రభుత్వేతర పాఠశాలలలో ‘అల్పసంఖ్యాకుల’ పాఠశాలలలో తెలుగు బోధన మూలపడింది. తెలుగు భాషాబోధన తెలుగు మాధ్యమ బోధన ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైపోయింది! తెలుగునకు బదులు ‘అదనపు ఆంగ్లభాష’ – స్పెషల్ ఇంగ్లీష్ -ను లేదా ఇతర భాషలను చదివిన ప్రభుత్వేతర పాఠశాలల విద్యార్థులు తెలుగు అక్షరాలకు దూరమయ్యారు! ఇది ‘ప్రపంచీకరణ’కు పూర్వంనాటి మాట. ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత గత పాతికేళ్లుగా మాతృభాషపట్ల మమకారం, మాతృ సంస్కృతిపట్ల మక్కువ, మాతృ దేశభక్తివంటి భావజాలం ధ్యాసలేని విద్యావంతులు తయారవుతున్నారు. ఆంగ్లం నేర్చుకుంటే చాలు అంతర్జాతీయ స్థాయి ఉపాథిని పొందవచ్చునన్న భ్రాంతికి గురవుతున్న ‘ఇంజనీర్’లు, ‘డాక్టర్’లు, ‘బిజినెస్ ఎగ్జిక్యూటివ్’లు, ఇతరేతర విద్యాధికులు విస్తరించిపోవడం ప్రపంచీకరణ ప్రభావం. ఈ ప్రభావ వైపరీత్యానికి గురి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోసైతం ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టింది. తెలుగు నెత్తిన బండ పడింది!

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేయడం గాయపడిన తెలుగునకు పాక్షిక ఉపశమనం. తెలుగు మాధ్యమ విద్యాబోధనలో కనీసం ఎనిమిదవ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలో తప్పనిసరి చేసినపుడు మాత్రమే తెలుగు వ్యవహారం పరిపుష్టం కాగలదు!

శైశవస్థాయి – ఎల్‌కెజి, యుకెజి – నుండి చిన్నారులకు తెలుగులోను, భారతీయ భాషలలోను విద్యను మప్పే వ్యవస్థ ఒకప్పుడు దేశమంతటా విలసిల్లింది! అందువల్ల విద్యావంతులైన భారతీయులు భారతీయులుగా జీవించగలిగారు. ఏ భారతీయ భాషలో విద్యనభ్యసించినప్పటికీ దేశంలో అన్ని ప్రాంతాలలోను సమాన భావజాలం విద్యావంతులను ప్రభావితం చేసింది. ఇందుకు కారణం అనేకానేక వైవిధ్యాలు – మత, భాషా, ప్రాంత, సంప్రదాయ, ఆచార ఆహార, ఆహార్య వైవధ్యాలు అద్వితీయ సంస్కృతిలో నిహితం కావడం. తెలుగుభాష ద్వారా, తమిళ భాష ద్వారా, మరాఠీ ద్వారా, పంజాబీ ద్వారా, హిందీ ద్వారా, అస్సామీ ద్వారా – ఇలా వివిధ భాషల ద్వారా ఒకే భారతీయ సంస్కృతి ప్రస్ఫుటించింది. ఇలా వైవిధ్య భాషలన్నీ ఒకే సంస్కృతిని పరిరక్షించి పెంపొందించడం భారతదేశంలో అనాదిగా ‘స్వరూప వైవిధ్యాల’ మధ్య నెలకొన్న స్వభావ ఏకత్వం.

ప్రతి ప్రాంతీయ భాష ద్వారా, ప్రాంతీయ భాషాసాహిత్యం ద్వారా సమగ్ర భారత ప్రాదేశిక స్వరూపం, సమగ్ర భారతీయ సంస్కృతి స్వభావం ప్రస్ఫుటించాయి! ఈ వివిధ భాషల మధ్య అంతస్సూత్రమైన సంస్కృత భాష వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాష అయినది. ఉన్నత విద్యాబోధనకు మాధ్యమమైంది. వేలాది ఏళ్లపాటు భారతీయులు భారతీయులుగా జీవించడానికి ఇదీ సాంస్కృతిక ప్రాతిపదిక…

బ్రిటన్ దురాక్రమణదారులు ఈ స్వజాతీయ ప్రాతిపదికను భగ్నం చేసిపోయారు! అనుసంధాన భాషగా, పాలనాభాషగా, ఉన్నత విద్యాబోధనకు మాధ్యమంగా ఉండిన సంస్కృతభాషను తొలగించారు. ఆ స్థానంలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. ఫలితంగా ఉన్నత విద్యావంతులు క్రమంగా భారతీయ భావజాలానికి దూరమైపోయారు. పాశ్చాత్య భావదాస్యబద్ధులైపోయారు. క్రీస్తుశకం 1947 వరకు నడచిన వైపరీత్యం ఇది. కానీ ఆ సమయంలో సైతం ఎనిమిదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలోను, ఇతర భారతీయ భాషా మాధ్యమంలోను విద్యాబోధన జరిగింది! ఫలితంగా అక్షరాస్యులుకానివారు, ‘అక్షర’ విద్యలను ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే అభ్యసించినవారు భారతీయతకు దూరం కాలేదు.

వాణిజ్య ప్రపంచీకరణ వచ్చి మన నెత్తిమీద కూర్చున్న తరువాత విద్యావంతులు ఉన్నతోన్నత పదవులలోనివారు మాత్రమేకాదు నిరక్షరాస్యులు సైతం తమ ‘తెలుగు’ను విపరీతమైన ఆంగ్ల పదాలతో సంకరం చేసి పారేశారు! ఆంగ్ల పదాలతో ‘కల్తీ’ కాని కమ్మటి తెలుగు వినబడటం గత చరిత్ర. ప్రస్తుతం తెలుగుభాషలో క్రియాపదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నామవాచకాలు, సర్వనామాలు సర్వం ఆంగ్లమయమైపోయాయి!! ఇలా తెలుగు సంకరమై పోతోందన్న ధ్యాస కూడా మనకు మిగిలిలేదు… భారతీయులు భారతీయతను మరచి అమెరికాను, ఐరోపాను అనుకరిస్తుండడానికి కారణం ప్రపంచీకరణ! ‘యూనివర్శిటి’లలో మొదలైన ఇంగ్లీషు ‘స్కూళ్ల’ గుండా ‘కానె్వంట్ల’ గుండా ఊరేగుతూ వంట ఇళ్లలోకి చొరబడింది. ‘వంట ఇల్లు’ అంటే అర్థం కాదు. ‘కిచెన్’ అన్నది తెలుగుపదం…

ఈ విపరీత నేపథ్యంలో కనుమరుగైపోతున్న తెలుగును మళ్లీ పాఠశాలలో కొలువుతీర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. దుకాణాల మీద నామ ఫలకాలపై తెలుగు అక్షరాలు కనిపించనున్నాయికూడ! కానీ నిత్య జీవన వ్యవహారంలో తెలుగు నిజంగా పల్లవించాలంటే పరిమళించాలంటే ఇది చాలదు. శైశవ స్థాయి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ అన్ని ప్రభుత్వేతర ప్రభుత్వ పాఠశాలలలో అన్ని ‘విషయాలు’ తెలుగులో బోధించాలన్న నిబంధన విధించాలి. ‘ఇంగ్లీషు రెయిమ్స్’ వల్లెవేస్తున్న శిశువుల నోట తెలుగు పదాలు పద్యాలు ధ్వనించాలి.. భాష మాధ్యమం.. భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం! ‘మాతృభాషల లక్ష్యం మాతృ జాతీయ సంస్కృతి రక్షణ’ అన్నది ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానం.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)