Home News ‘తెలంగాణ విమోచన’పై వివేచన ఏదీ?

‘తెలంగాణ విమోచన’పై వివేచన ఏదీ?

0
SHARE

ఓనిజాము పిశాచమా!

కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని

తీగలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ!

ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి దాశరథి కలాన్ని కదలించింది. ఏ భావం దాశరథి కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది..! ఏ సంఘటన దాశరథి హృదయ స్పందన కవితా ధారలై స్పందించింది..! అదే 1948లో జరిగిన రజాకార్ల దారుణ పైశాచిక స్వైర విహారం. అది ఒక్క దాశరథినే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్ని రవ్వలు రేపిన దుశ్చర్య! మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుత్సిత కుతంత్రాలకు తల్లడిల్లిన తరుణం. వేలాదిమంది ధీరుల త్యాగాలతో తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన వైనం. దాస్య శృంఖలాల నుండి భరతమాత బంధాలు విడిపించినా తెలంగాణ మాత్రం పరతంత్రం కావడం ప్రపంచానే్న ఆశ్చర్యపరచింది!

విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా తెలంగాణ గడ్డపై హిందూ ప్రజలపై చేసిన దురాక్రమణ భగవంతుడే స్వయంగా విన్నాడేమో అన్నట్లు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది. అదే ఈ వీర తెలంగాణ దిశను మలుపు తిప్పిన రోజు. అదే మత దురహంకారుల మదం అణచి వారి గుండెల్లో మరణ మృదంగం వాయించిన రోజు… అదే దక్కను పీఠభూమి ప్రజలకు భరతమాత ఒడిలో వాలే అవకాశం దక్కిన రోజు.. అదే సెప్టెంబర్ 17, 1948.. ఆరోజే నయవంచకుడు నిజాం నవాబు ఉక్కు మనిషి చెంత మోకరిల్లిన రోజు.. అదే అదే తెలంగాణ విమోచనదినం!

క్రీ.శ 1656లో బతుకుతెరువుకోసం ఖలీజ్‌ఖాన్ అనే మతోన్మాది టర్కీలోని బోఖరా నుండి భారత్‌కు వచ్చాడు. నాటి మొగల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరి పదవి పొందాడు. అతని మనుమడే ఖమ్రుద్దీన్. ఈవ్యక్తే ‘నిజాముల్ ముల్కు’ అనే బిరుదు పొందాడు. వీళ్ల వంశం పేరు ఆసఫ్‌జాహి. ఆ తర్వాత ఔరంగజేబు పాలనలోకి వచ్చాక దక్కన్ ప్రాంతానికి సుబేదారుగా, ఔరంగజేబు మరణం తర్వాత 1724లో దక్కన్ నవాబులయ్యారు. 1724లో స్వాతంత్య్రం ప్రకటించుకొన్న ఈ నవాబు 1748లో మరణిస్తే అతని పుత్రులు, రాజబంధువులు, వారి బంధువులు – నైజాం సంస్థానం నిండా జాగీర్దార్లు, ముఖ్తేదార్లుగా ప్రకటించుకున్నారు. ఈ నవాబుల్లో చివరివాడు, ఏడవవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్.

కొందరు పేర్కొన్నట్లు ఈ నియంతృత్వ ప్రభువులు అభివృద్ధి కారకులైతే, పరమత సహనం కలవారైతే భాగీరథి నగరం మహ్మదు నగరంగా, భాగ్య (భాగ్) నగరం హైదరాబాద్‌గా, భాగీరథి మహ్మద్‌బీగా, భాగమతి హైదర్బీగా ఎందుకు మారిందో చరిత్రలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. కుతుబ్‌షాహీల పరిపాలనాంతంలో గొప్ప మేధావులైన అక్కన్న, మాదన్న మంత్రుల హత్యలు జరిగాయి. అప్పటి నుంచే ఈ రాజులు పరమత సహనం కోల్పోయారు. మరీ ముఖ్యంగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన నుంచి ఇది తీవ్రమై ఏడవ నైజాం కాలం నాటికి ఉధృతంగా కొనసాగింది.

1919లో బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన మాంటెంగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను పోలిన సంస్కరణలు నైజాం రాష్ట్రంలో రాజకీయంగా ప్రవేశించాయి. అట్టడుగు స్థాయిలోని ముస్లింలకు ఇది ఎలాంటి మేలు చేయలేదు. 1927లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముసమీన్’ అనే సంస్థ ఏర్పడింది. 1929లో అందులోని ‘బైనుల్’ అనే పదం పోయింది. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా మారి ఉన్నత ఆశయాలను వదిలిపెట్టింది. 1937లో ఈ సంస్థ మత పరివర్తన ఉద్యమం ‘తబ్లీగ్’ అనే కార్యక్రమం ప్రారంభించింది. సంస్థానంలోని హరిజనులకు భూములు, ఆర్థిక స్థిరత్వం కల్పిస్తామని ఆశ చూపి మత మార్పిడి చేసారు. మొదట బహదూర్ యార్ జంగ్‌ను అధ్యక్షునిగా వుంచి తర్వాత కొంతకాలానికి సంస్థ అధ్యక్ష పదవి ఖాసిం రజ్వీకి లభించింది. ‘రజాకార్’ అనే మాటకు ‘వాలంటీర్’ అని అర్థం. కానీ సేవా దృక్పథం ఉండాల్సిన రజాకార్లు, వారి అధ్యక్షుడు ఖాసిం రజ్వీ పరమత సహనం కోల్పోయాడు. 1935లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందువల్ల స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం ముందుకు వచ్చింది. రాజ్యానికి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన తండ్రి కాలం నుండి ప్రధానిగా వున్న మహారాజా సర్ కిషన్ ప్రసాదును తొలగించి ఓ బుట్టబొమ్మను ప్రధానిగా పెట్టుకొని ఆ తర్వాత అతణ్ణి కూడా తొలగించి తానే రాజూ మంత్రిగా మారాడు. ఒక తులం బంగారాన్ని ‘అషఫ్రీలు’ అనేవాళ్లు, అలాంటి అషఫ్రీలు ఎవరిస్తే వాళ్లకు జంగ్, నవాజ్‌జంగ్, యార్‌జంగ్ బిరుదులిస్తూ డబ్బు గడించాడు నిజాం.

బతుకమ్మ పండుగ అంటే హిందువులకు చాలా ఇష్టం. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుంటే ఈ నైజాం ప్రాంతంలో బతకుమ్మ పండుగ మొదలైంది. వాడీ స్టేషన్ దాటిన రైలును ఆపి అందులోని స్ర్తిలను దించి ట్రక్కుల్లో ఎక్కించారు. గాండ్లాపూర్ సమీపంలోని ఠాణాకు తీసుకువెళ్లి వాళ్లను వివస్తల్న్రి చేసి కట్టె (లాఠీ)లతో కొడుతూ రజాకార్లు బతుకమ్మ ఆడించారు. స్ర్తిలను ఎత్తుకెళ్లారు. పురుషుల్ని నరికేశారు. రజాకార్ల దురాగతాల్ని నెహ్రూ 1947 సెప్టెంబర్ 7న నిరసించారు. అయినా మంతనాల పేరుతో ఒక సంవత్సర కాలంపాటు తాత్సారం చేసారు. హైదరాబాద్ సమీపంలో అమీరుపేట గ్రామంలోకి మహ్మద్ అస్లం, మహ్మద్ కరీం అనే రజాకర్లు ప్రవేశించారు. ఆ గ్రామాన్ని అతలాకుతలం చేసారు. స్ర్తిల ముక్కుపుడకలను పట్టి లాగి వాళ్లు బాధపడుతుంటే ఆనందించారు. భైరవునిపల్లిలో 96 మందిని నిలబెట్టి కాల్చి చంపి బావిలో సమాధి చేయడం, పరకాల మరో జలియన్ వాలాబాగ్ కాగా, రేణిగుంట, ఉమ్రీ, ఎర్రుపాలెం, అప్పంపల్లి వంటి ప్రాంతాలు రక్తంలో తడిసాయి. సైదాబాగ్‌లో 15 మంది స్ర్తిలను మానభంగం చేసారు. ఆనాటి పంజగుట్ట గ్రామంలో భర్తల ఎదుట తల్లీ కూతుళ్లపై ఖాదర్ జిలాని, సికిందర్‌ఖాన్, అబ్దుల్ జబ్బార్ అనే నాయకుల నేతృత్వంలో క్రూరమైన అత్యాచారం జరిగింది. బల్గాం గ్రామంలో మహదేవ్ హత్య, కల్యాణిలో ధర్మప్రకాష్ హత్య, గుంజోటిలో వేదప్రకాష్ హత్య, జైల్లో పండిత శ్యాంలాల్‌కు విషమివ్వడం, దసరా ఊరేగింపులో నాలుగు హత్యలు, దేవాలయాల మీద దాడి, కవులను, నాయకులను జైల్లో నిర్భందించడం జరిగింది. బీబీనగర్, నిజామాబాద్ దుస్సంఘటల్ని ఖండిస్తూ మజ్లిస్ రజాకార్ల దురంతాలను ఎండగడుతూ, ‘ఇమ్రోజ్ పత్రిక’లో పుంఖాను పుంఖాలుగా వార్తలొచ్చాయి. నానజ్ గ్రామాన్ని రజాకార్లు కోల్పోయిన ఘటనను ఇమ్రోజ్ పత్రికలో రాసినందుకు షోయబ్ ఉల్లాఖాన్‌ను అతి కిరాతకంగా రజాకార్లు హత్య చేసారు. ఒకవైపు దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ రజాకార్ల దురాగతాల పరంపర కొనసాగింది. షోయబుల్లాఖాన్ హత్య తర్వాత నెహ్రూ మేల్కొన్నాడు. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన తీవ్రమైంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, రైతులు నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. తమ సంస్కృతి సంప్రదాయాలను భాషను, వేషాన్ని, దేశాన్ని, దేవాలయాలను విధ్వంసం చేస్తున్న నిజాం రజాకార్లపై తిరగబడ్డారు.ఆర్యసమాజ్ కార్యకర్త నారాయణరావ్ పవార్ నిజాం కోచ్‌మీద బాంబు విసరగా, అతను త్రుటిలో తప్పించుకున్నాడు.

ఇక్కడి పెద్దలు కేంద్రానికి వెళ్లి నెహ్రూను, సర్దార్‌పటేల్‌ను కలిసి తెలంగాణ పరిస్థితి వివరించారు. సర్దార్ పటేల్, మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు తరలించారు. 1948 సెప్టెంబర్ 13న సైన్యం దిగింది. మూడు రోజులు ఎదిరించిన నిజాం సైన్యం చేతులెత్తేసింది. ఎలాంటి రక్తపాతం జరక్కుండానే 1948 సెప్టెంబర్ 17న నిజాం తల వంచాడు. ‘‘నేనెవరికీ భయపడను’’ ‘‘నేనే దేవుణ్ణి’’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం- ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ముందు విమానాశ్రయంలో తల వంచి నమస్కరించి స్వాగతం పలికాడు. 1947 ఆగస్టు 15వ తేదీన రావలసిన స్వాతంత్య్రం తెలంగాణ ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న వచ్చింది..!

తెలంగాణ సంస్కృతికి ల్యాండ్ మార్క్‌గా తనను తాను చెప్పుకునే కేసిఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరిపితే బాగుండేది. పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక అధికారికంగా జరుపుతున్నపుడు మనకు ఎందుకు అభ్యంతరం? గతంలో రోశయ్యను ఇదే విమోచన దినంపై నాటి ‘తెలంగాణ ఉద్యమ నాయకుడి’గా నిలదీసాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రోశయ్యను ఎదురించైనా సరే అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చైనా సరే లేదా ప్రభుత్వం నుండి బయటకు వచ్చైనా సరే విమోచన దినం జరపాలని డిమాండ్ చేసారు.

మరి ఈరోజు సిఎం కెసిఆర్ పార్టీలుగా కార్యక్రమం చేయమని చెప్పడం విడ్డూరం! చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. ఒకప్పుడు జర్మన్లు 60 లక్షలమంది జూయిష్ ప్రజల్ని సంహరించారు. అయినా జర్మన్లు తమ చరిత్రలో ఆ విషయాన్ని కప్పిపుచ్చలేదు. జర్మన్-ఇజ్రాయెల్ జాతుల విద్యార్థులంతా ఆ చరిత్రను చదువుతూనే వున్నారు. ఇజ్రాయెల్ ఆ నరమేధం విస్మరించలేదు. జర్మన్లు మసిబూసి మారేడుకాయ చేసి చరిత్రను బోధించలేదు. ఈరోజుకూ జర్మనీ నుండి నష్టపరిహారం వసూలవుతూనే వుంది. కాబట్టి చరిత్రను గంపకింద దాస్తే దాగదు. ఈ గడ్డపై పుట్టి ఇక్కడి ప్రజలను తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ముసునూరి కాపయ, ముసునూరి ప్రోలయ, కపిలేశ్వర గజపతి, రాచకొండ ప్రభువులు, అక్కన్న, మాదన్న, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాణి శంకరమ్మ, రాంజీగోండు, కొమురం భీం, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ వంటి వాళ్లను దాచిపెట్టలేం. సూదిని బుట్టలో మూటకడితే అందులో వుండదు. ఇప్పటికైనా చరిత్రను, దానిలోని స్ఫూర్తిని ప్రజలకందించి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూద్దాం.

-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125

[email protected]

(ఆంధ్రభూమి సౌజన్యం తో)