చైనా తయారు చేస్తున్న సోషల్ మీడియా యాప్లతో పాటు అక్కడ తయారయ్యే టెలికాం పరికరాల వాడకంపై నిషేధం విధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అఖిల భారత సహ కన్వీనర్ అశ్వని మహాజన్ ప్రధానికి లేఖ రాసారు.
పుల్వామా ఉగ్రవాద దాడి అత్యంత దిగ్బ్రాంతికరమని, ఈ దశలో మనపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ కు మద్దతుగా నిలుస్తున్న చైనా ఆర్ధికవృద్ధికి సహకరించకుండా ప్రతి పౌరుడు నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో వున్న ‘అత్యంత సన్నిహిత దేశం’ హోదాని రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పాకిస్థాన్ తయారీ వస్తువుల దిగుమతిపై అధిక సుంకం విధించినట్టే చైనా తయారీ వస్తువులపై కూడా ఇదే విధమైన చర్య చేపట్టాలని కోరారు.
సమాచారం అనేది అత్యంత విలువైనదని, భారతీయుల సమాచారం చైనా చేతికి చిక్కకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధానిని కోరింది. భారత యువత చైనాకు చెందిన సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ యాప్ లను విరివిగా వినియోగిస్తున్నారని, గత రెండేళ్లలోఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు.
సాంకేతికపరమైన ప్రమాదం పొంచివున్న కారణంగా 2017 డిసెంబర్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ చైనాకు చెందిన 42 సాఫ్ట్ వేర్ అప్లికేషన్లను తమ ఫోన్ల నుండి తొలగించాల్సిందిగా సైనికులకు ఆదేశాలిచ్చింది. డోక్లామ్ సరిహద్దు వివాదం సమయంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజరు మీద కూడా విచారణ నిర్వహించింది. భారతీయుల కదలికలకు సంబంధించిన సమాచారం యూసీ బ్రౌజర్ ద్వారా చైనా సర్వర్లలో నిక్షిప్తం అవుతున్న విషయాన్నీ ఈ విచారణ ద్వారా ప్రభుత్వం గుర్తించింది.
అదే విధంగా చైనాకే చెందిన ‘టిక్ టాక్’, ‘హలో’ వంటి మెసెంజర్ యాప్ లు వినియోగదారులకు అవాంఛిత సందేశాలు పంపిస్తున్న కారణంగా ఇండోనేషియా వంటి అనేక దేశాలు వాటిపై నిషేధం విధించాయి. చిన్న పిల్లలకు సంబంధించిన వివరాలు ఈ యాప్ ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని స్వదేశీ జాగరణ్ మంచ్ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలోని చైనా టెలికాం కంపెనీల కార్యకలాపాలతో పాటుగా చైనా టెలికం పరికరాల వినియోగం మీద కూడా నిషేధం విధించాలని కోరింది. అనేక దేశాలు ఇప్పటికే ఈ చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
భారతదేశంలో 5జి ఇంటర్నెట్ సేవలకు సంబందించిన వ్యాపారంలో చైనా ప్రవేశానికి అడ్డుకట్ట వేయాలని స్వదేశీ జాగరణ మంచ్ ప్రధానిని కోరింది. చైనాకు చెందిన 5జి నెట్ వర్క్ పరికరాల వినియోగం ద్వారా కలిగే సాంకేతిక ముప్పును ప్రధానికి తమ లేఖలో వివరించింది. దేశ భద్రత దృష్ట్యా చైనా కంపెనీల ప్రవేశాన్ని అరికట్టాలని కోరారు.