Home News కాశ్మీర్: ఎన్కౌంటర్ లో పుల్వామా సూత్రధారితో పాటు మరో జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది హతం

కాశ్మీర్: ఎన్కౌంటర్ లో పుల్వామా సూత్రధారితో పాటు మరో జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది హతం

0
SHARE

పుల్వామా జిల్లాలో భారత భద్రతా దళాలు ఇద్దరు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని మొన్న జరిగిన పుల్వామా ఉగ్రదాడి సూత్రదారి అబ్దుల్ రషీద్ గాజీ అలియాస్ కమ్రాన్ గా గుర్తించారు.

ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా భద్రతా దళాలు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

అంతకు ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు రాష్ట్రీయ్ రైఫిల్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన సైనికుల్లో ఒక మేజర్ ర్యాంక్ అధికారి, లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు.

ఫస్ట్ పోస్ట్ కధనం ప్రకారం.. గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో రాష్ట్రీయ్ రైఫిల్స్ దళాలు, సీఆర్పీఎఫ్ మరియు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సోమవారం తెల్లవారుజామున ఇంటింటి తనిఖీలు (కార్డన్ & సెర్చ్) నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారడం ద్వారా తప్పించుకోవాలని చూసారు. వీరికి మద్దతుగా స్థానిక యువత భద్రతాదళాలపై రాళ్లు రువ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఎంకౌంటర్ సమయంలో ప్రజలు బయటకు రావద్దంటూ పదేపదే అధికారులు చేసిన విజ్ఞప్తిని కొందరు యువత పట్టించుకోలేదు. దీని కారణంగా మరో ఇద్దరు ‘స్థానికులు’ కూడా మరణించినట్టు సమాచారం.