– దిబాకర్ దత్తా
పాతాళానికి పడిపోతున్న స్థిరాస్తుల విలువలు, నానాటికి పెరిగిపోతున్న ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నడుమ ఆర్థిక మందగమనపు సెగ చైనా దేశానికి తాకడం మొదలైంది.
చైనాలో ఎవరూ స్వాధీనం చేసుకోని అపార్ట్‌మెంట్లు 5 కోట్లకు మించి ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. అసంపూర్తిగా ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు, ఆస్తులు తనఖా పెట్టినవాళ్ళు ప్రాజెక్టులు అభివృద్ధి చేసేవారికి(డెవలపర్లు) తిరిగి చెల్లింపులు చేయలేని అశక్తత చైనా సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తోంది. నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలు నిరాశాజనకంగా, నిస్తేజంగాఉన్నాయి. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం, నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికావ్యయం ఈ సంవత్సరం జూన్‌లో 5.45 బిలియన్ డాలర్ల వరకూ పెరిగింది.
కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న చైనా తీవ్రమైన ఆర్థికమందగమనంలో ఉన్నది. బాగా తగ్గిపోతున్న స్థిరాస్తుల ధరలు, కోవిడ్-19 లాక్డౌన్ ల కారణంగా చైనా, అధికనిరుద్యోగం, కనిష్ఠవృద్ధిలతో సతమతమవుతున్నది.
ఈ సంవత్సరం జూలైలో అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (IMF), చైనా ఆర్థికపరిస్థితి గురించి,‘ఇది ముందు అంచనావేసిన మందగమనం కంటే అధ్వాన్నంగా ఉన్నది’ అని అభివర్ణించటంతో, విషయం స్పష్టమయింది. “విశ్వవ్యాప్తంగా వృద్ధిరేటు పెరుగుతూ ఉన్నా, చైనాలో మాత్రం, మరిన్ని లాక్ డౌన్లు, నానాటికీ తీవ్రమవుతున్న స్థిరాస్థి రంగ(రియల్ ఎస్టేట్) సంక్షోభం, ఇత్యాది కారణాల వలన 1.1% పాయింట్లు తగ్గించబడింది,” అని కూడా IMF వివరించింది.
అంతర్జాతీయ ఆర్థికసంస్థ, 2022 సంవత్సరానికి చైనా వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధిరేటును కేవలం 3.3%గా అంచనా వేసింది. ఇలా నివేదించబడిన ప్రకారం, చైనా ఆర్థిక ఉత్పత్తి గత 40 ఏళ్లలో (2020 తప్ప),మెల్లగా క్షీణిస్తూవస్తున్నది.
ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త రేమాండ్ యూయింగ్ చెప్పిన ప్రకారం, చైనాలోని అన్ని నగరాలలో, పట్టణాలలో నిరుద్యోగం ఇప్పటివరకూ తాకని గరిష్ఠం 20%కు చేరింది. తగ్గుతూపోతున్న వినియోగం, అత్యవసరాల ప్రాధాన్యతలతో, స్థిరాస్తుల విపణి తీవ్రంగా దెబ్బతింటున్నది.
ఈ పరిస్థితి కరవు, అధికఉష్ణోగ్రత,ఇంధనకొరత ,మరియు దేశంలో అనుసరించిన శూన్యకోవిడ్ విధానాల వలన మరింత ఉద్ధృతమయింది. ఆగస్ట్ 20న, పెట్టుబడి(investment) బ్యాంకులైన నోమురా, గోల్డ్ మాన్ సాచ్ లు, చైనా GDP అంచనా రేటును, 3.3% నుండి, వరుసగా 2.8% మరియు 3% గా, మరింత తగ్గించివేశాయి.
చైనాలో కుప్పకూలుతున్నస్థిరాస్తి రంగం:
చైనాలో సిమెంట్, ఉక్కు ఉత్పత్తులు ఒకేసారి క్షీణించటం, స్థిరాస్తుల పతనానికి సంకేతమయ్యింది. ఈ విషయంపై వాతావరణ విజ్ఞానశాస్త్ర నిపుణుడైన లారీ మెలివ్రిటా, “ది గార్డియన్” పత్రికతో మాట్లాడుతూ, “ఉక్కు విలువ కోలుకుంటూనే, ప్రస్తుతం మళ్ళీ పతనమవుతున్నది. ఇది స్థిరాస్థి రంగంలో తీవ్రమైన ఇబ్బందులను ప్రతిఫలిస్తున్నది” అని అన్నారు.
వార్తా నివేదికల ప్రకారం, చైనాలో 5 కోట్లకు పైగా అపార్ట్‌మెంట్లు ప్రస్తుతం ఎవరూ స్వాధీనం చేసుకోకుండా ఖాళీగా ఉన్నాయి. హౌసింగ్ ప్రాజెక్టులు, ఆస్తులు తనఖా పెట్టినవాళ్ళు ప్రాజెక్టులు అభివృద్ధి చేసేవారికి(డెవలపర్లు) తిరిగి చెల్లింపులు చేయలేని అశక్తత చైనా సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తోంది.
స్టాండర్డ్ & పూర్ (S&P) గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం, చైనాలోని డెవలపర్స్‌లో 40%మంది తీవ్రమైన ఆర్థికఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇందుకు తాజా నిదర్శనం ఎవర్ గ్రాండ్ కంపెనీ. 300 బిలియన్ డాలర్ల మేరకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో సదరు కంపెనీ విఫలమైంది.
వివిధ దేశాల్లో ఎవరూ స్వాధీనం చేసుకోని, ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్ల శాతం:
మొత్తం కుటుంబాల్లో 70 శాతం కుటుంబాలకు సంపదగా రియల్ ఎస్టేట్ నిలిచిన దేశానికి ఇది ఒక ఆందోళన కలిగించే అంశం. చైనాలో గడచిన 30 సంవత్సరాల్లో అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన స్థిరాస్తి ధరలకు పరాకాష్టగా ప్రస్తుతం స్థిరాస్తి రంగంలో మాంద్యం నెలకొందని పెకింగ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, మైఖేల్ పెటిస్ ప్రముఖంగా ప్రస్తావించారు.
“ప్రాపర్టీ డెవలపర్లు, భారీపరపతి మరియు మితిమీరిన భవన నిర్మాణాలకు సమర్థించేందుకు,నిరంతరం పెరుగుతూపోతున్న గృహాల ధరలు, రోజురోజుకీ పెరిగిపోతున్న గృహాల అమ్మకాలపై అధికంగా ఆధారపడ్డారు. కానీ, గత సంవత్సరం ద్రవ్య చలామణి తాలూకు బుడగ తగ్గిపోవడం ప్రారంభం కాగానే, అప్పుడు మితిమీరిన భారీపరపతి కలిగిన ప్రాపర్టీ డెవలపర్లు ఆస్తులను వెంటనే నగదు రూపంలో మార్చుకొనే ప్రక్రియలోకి విపరీతమైన రుణ పరిమితి సమస్యల్లో చిక్కుకున్నారు. భవన నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయటం వారికి అసాధ్యంగా మారింది“ అని ఆయన తెలియజేశారు.
“రియల్ ఎస్టేట్ డెవలపర్లు 2013-2020 మధ్యకాలంలో నిర్మించి ఇస్తామని వినియోగదారులతో చేసుకున్న ఒప్పందాలలో 40 శాతం కూడా నెరవేర్చలేదు. ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయలేదు. ఇంతవరకూ స్వంతదార్లకు స్వాధీనపరచలేదు.” అని కూడా పెటీస్ వేలెత్తి చూపారు. ఇంకా తీక్షణమైన ఆర్థిక సంకోచం ఏర్పడుతుందనే వాదనను ఈ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ త్రోసిపుచ్చుతూ, చైనా అభివృద్ధి దీర్ఘకాలం, కనిష్ఠస్థాయిలోనే ఉంటుందని జోస్యం చెప్పారు.
వృద్ధిరేటు, వ్యయాలను పెంపొందించేందుకు, చైనాప్రభుత్వం వడ్డీరేట్లను తక్కువ చేయాలనీ, మరిన్ని ఎక్కువ బాండ్లనువిక్రయించాలనీ, నిర్ణయించింది. కానీ, ఇటువంటి అధికారిక ఆదేశం, ఉత్తమ ఫలితాలను ఇవ్వలేదనీ, నివాసగృహాలు కావాలనుకున్నవారు, తాము ఋణభారాన్ని మరింత అధికం చేసుకోకుండా నివారిస్తారనీ పెటీస్ అభిప్రాయం.
రుణ సంబంధ గణాంకాలను ఎక్కువ చేసి చూపిస్తున్న బ్యాంకులు:
చైనా ప్రభుత్వం తమ బ్యాంకులను, ప్రజలకు అధికంగా ఋణాలు ఇచ్చి,ఆ నిధులు దేశ ఆర్థికరంగానికి మళ్లించాలని, ఒత్తిడి తెస్తున్నది. ప్రభుత్వపు ఈ నిర్బంధపూరితమైన చర్య, కృత్రిమంగా రుణ సంబంధ గణాంకాలను ఎక్కువ చేసి చూపించేలా చైనా బ్యాంకులను పురిగొల్పుతుందని ,‘బ్లూంబెర్గ్’ వార్తానివేదిక తెలియజేస్తున్నది.
పెద్దకంపెనీలకి ఋణాలు మంజూరు చేసేటప్పుడు, బ్యాంకులు అనుసరిస్తున్నవిధానం ఏమిటంటే,తిరిగి అవే నిధులను బ్యాంకులలో అదే వడ్డీరేటుకు జమ చేయించటం. ప్రభుత్వరంగ బ్యాంకులు అనుసరించే ఇంకొకఉపాయం,తమలో తాము స్వల్పకాలికఋణాలు ఇచ్చి పుచ్చుకుంటూ,బ్యాంకు నమోదుపుస్తకాలలో (records), నూతన రుణాల క్రింద చూపించటం. దీనివలన ఏమవుతుందీ అంటే, కేవలం బ్యాంకుల నమోదు పుస్తకాలలో మాత్రం నూతన రుణాలు మంజూరు చేసినట్లు, ఇచ్చినట్లు ఉంటుంది, రుణాలిచ్చిన నిధుల పరిమాణం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది, వాళ్ళు తిరిగి అవే నిధులను బ్యాంకులలో జమ చేయటం (deposits) వలన, డిపాజిట్లు అధికమయినట్లు చూపించటం, తద్వారా ఆర్థికరంగం అభివృద్ధి జరుగుతున్నట్లు భ్రమ కలిగించటం,ఇవన్నీ కేవలం బ్యాంకుపుస్తకాలలో చూపించే అంకెల గారడీ మాత్రమే, కానీ వాస్తవం ఎంతమాత్రమూ కాదు.
ఆరు వేరు వేరు బ్యాంకులలో పనిచేస్తున్న అధికారులు,ఈ తతంగమంతా,‘బ్ల్లూమ్ బెర్గ్’ కు అజ్ఞాతంగా (తమ పేర్లు తెలియనీయకుండా), ధృవీకరించారు. 2007 నుంచి ఇప్పటివరకూ ఉన్న కాలానికి, వినియోగదారుల డిమాండ్, అతికనిష్ఠానికి పతనమవగా, అనిశ్చితి చాలా అగ్రభాగాన ఉన్నది, చైనాబ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చినా, అది పరపతివిధానం మెరుగుపడేందుకు సహకరించలేదు, రుణాల పెరుగుదల కూడా ఏ మాత్రం ఉత్తేజపరచలేదు.
ఈ సంగతి, బాగా నిలదొక్కుకొని, స్థిరపడ్డ ‘జెజ్యాంగ్’ అనే ఎలక్ట్రానిక్స్ సరఫరాదార్ల విషయంలో స్పష్టమైంది. ‘బ్ల్లూమ్ బెర్గ్’సమాచారం ప్రకారం, ఈ కంపెనీకి అతితక్కువ వడ్డీరేటులో రుణాలు ఇచ్చేందుకు చాలా బ్యాంకులు వెంటబడినా, ఆ సంస్థ మాత్రం క్రొత్తగా రుణాలు పొందేందుకు నిరాకరించింది.
“మేము ఇంకా కొత్త అప్పులు చేయాలనుకోవటంలేదు, ఎందుకంటే ఇప్పుడు మావద్ద ఉన్న నగదునిల్వలు, మా వ్యాపారనిర్వహణకు, సుమారైన పెరుగుదలకు, పూర్తిగా సరిపోతాయి. కోవిడ్ వేగంగా వ్యాపించటం వలన, స్థిరాస్తుల విలువలు తగ్గుముఖం పట్టటం వలన, మా వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం పడింది.” అని ఆ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) ప్రకటించారు.
అనువాదం: సత్యనారాయణ మూర్తి
Source : OPINDIA
ఇంకా ఉంది…