Home News కేరళ లోని కమ్యూనిస్టుల హత్య రాజకీయాలను ఎండగట్టిన బిజెపి ‘జన రక్ష యాత్ర’

కేరళ లోని కమ్యూనిస్టుల హత్య రాజకీయాలను ఎండగట్టిన బిజెపి ‘జన రక్ష యాత్ర’

0
SHARE

కేరళలో బిజెపి చేస్తున్న జనరక్ష యాత్ర గురించి మలయాళం మీడియా దాదాపుగా మౌనం వహిస్తున్నా, సిపియం నాయకత్వం మాత్రం కల్లోలానికి గురవుతున్నది.

‘పినరాయి’ కేరళలోని కన్నూర్‌ జిల్లాలో నెలకొన్న చిన్న గ్రామం. మార్క్సిస్టులకు ప్రాధాన్యం గలది. ఇక్కడకు సమీపంలోని వరపురం నుండే 1939లో కమ్యూనిస్ట్‌ల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుండి కేరళలోని కమ్యూనిస్టు రాజకీయాలకు పినరాయి, ఆ పరిసర ప్రాంతాలు కంచుకోటగా ఉంటూ వస్తున్నాయి. ఈ గ్రామాలలో ఎర్ర జెండాలు మాత్రమే ఎగురుతూ ఉండాలి. అసమ్మతి అన్నది వినపడడానికి వీల్లేదు. కమ్యూనిస్టులను వ్యతిరేకించే స్వరాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వస్తున్నారు.

కేరళలో ఒక పేద తండ్రి ఉత్తమన్‌, నిస్సహాయుడైన అతని కుమారుడు రెమిత్‌ల హత్యలకు, అక్కడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ప్రస్తుతం బిజెపి చేపట్టిన 14 రోజుల ‘జనరక్షా యాత్ర’ కేరళలోని కమ్యూనిస్టుల హత్యా రాజకీయాలను వెల్లడి చేస్తూ, పినరాయి గ్రామం గుండా పోవడం కేరళ రాజకీయాలలో పెను మార్పులు తీసుకువస్తున్నది. ఆత్మరక్షణలో పడిన సిపియం నాయకత్వం ఈ యాత్రను ‘కేరళ వ్యతిరేక యాత్ర’, ‘మతోన్మాదం రెచ్చగొట్టే చర్య’ అంటూ చిందులు వేసింది.

కన్నూరు జిల్లాలోని సిపియం గ్రామాలలో ఇతర పార్టీలేవీ కార్యకలాపాలు సాగించకుండా కట్టడి చేయడాన్ని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఈ సందర్భంగా ప్రశ్నించారు. పౌరులకు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వాతంత్య్రం, తమకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరే హక్కు ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఇతర జాతీయవాద సంస్థలకు చెందిన 120 మందికి పైగా కార్యకర్తలు హత్యలకు గురి కాగా, వారిలో 84 మంది ముఖ్యమంత్రి పినారయి విజయన్‌ సొంతజిల్లా అయిన కన్నూర్‌లోనే జరిగాయని గుర్తు చేశారు.

కేరళలో అనేకమంది బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌.లకు చెందిన అమాయకుల హత్యలకు ముఖ్యమంత్రి విజయన్‌ మాత్రమే బాధ్యత వహించాలని అమిత్‌ షా స్పష్టం చేశారు.

మార్కిస్టుల హత్యాకాండను ధిక్కరిస్తూ పోరాటం చేస్తున్న కేరళలోని ఆర్‌.ఎస్‌.ఎస్‌., బిజెపి కార్యకర్తలు ఒంటరివారు కాదని, వారికి మొత్తం దేశ ప్రజల మద్దతు ఉన్నట్లు స్పష్టం చేయడం కోసమే ఈ యాత్ర చేపట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఒకనాడు సామాజిక సంస్కర్తలకు నిలయమైన కేరళ ఇప్పుడు రక్తంతో అధికారం కాపాడుకొనే మార్క్సిస్టులు పాలనలో కొనసాగడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

కన్నూర్‌ జిల్లాలోని పయ్యన్నూర్‌ నుండి అక్టోబర్‌ 3న బిజెపి కేరళ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌ నాయకత్వంలో ప్రారంభమైన ‘జన రక్షా యాత్ర’ను జెండా ఊపి అమిత్‌ షా ప్రారంభించారు. ‘జిహాదీ’ ఉగ్రవాదాన్ని దేశ ప్రజల ముందు ఉంచడంలో ఈ యాత్ర విజయవంతమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన 9 కి.మీ.ల దూరం నడిచారు.

హత్యా రాజకీయాలతో పాటు ఇస్లామిక్‌ జిహాదీ బృందాలు, ఉగ్రవాద కార్యకలాపాలు సహితం గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా కేరళలో పెరుగుతూ వస్తున్నాయి. వారికి సిపియం ప్రభుత్వం నుండి వ్యూహాత్మక మద్దతు లభిస్తున్నది. ఈ ఉగ్రవాద బృందాలకు సహకారం అందిస్తూ ఉండడంతో గతంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడిఎఫ్‌ ప్రభుత్వం, ప్రస్తుతం సిపియం నాయకత్వంలోని ఎల్‌.డి.ఎఫ్‌. ప్రభుత్వం ఒక విధంగా పోటీ పడుతున్నాయి. అఖిల అనే యువతి విషయంలో ‘లవ్‌ జిహాదీ’ బృందం ఎత్తుగడ అని న్యాయస్థానం స్పష్టం చేసినా ఈ రెండు కూటములు ఆ యువతి ‘మానవహక్కులు’ అంటూ గొంతెత్తి అరుస్తున్నాయి.

1969 నుండి హత్యా రాజకీయాలు

కేరళలో 1969 నుండి సిపియం హత్యా రాజకీయాలు సాగిస్తున్నది. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హత్యాకాండ ఎన్నో రెట్లు పెరుగుతున్నది. గత సంవత్సరం మే 25న రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత ఈ దాడులు ఉధతంగా జరుగుతున్నాయి. గత 16 నెలల్లో జరిగిన 14 రాజకీయ హత్యలలో 12 ఆర్‌.ఎస్‌.ఎస్‌., బిజెపికి చెందిన వారివే కావడం గమనార్హం. రాష్ట్రమంతా హత్యాకాండ జరుగుతున్నా సిపియంకు ప్రాబల్యం గల కన్నూర్‌ జిల్లాలో అత్యధికంగా, సగంకు పైగా జరుగుతూ వస్తున్నాయి.

1977లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సాగించిన చారిత్రాత్మక పోరాటం తరువాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మార్క్సిస్టులు సంఘ్‌లో చేరడం ప్రారంభించారు. సిపిఐ ఆ సమయంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా, సిపియం అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూనే అవకాశవాద ధోరణి ఆవలబించింది. మరోవంక ఇందిరాగాంధీ నిరంకుశ చర్యలను ధిక్కరిస్తూ వందలాదిమంది స్వయంసేవకులు కన్నూర్‌ జిల్లాలో జైళ్లకు వెళ్లారు. దేశ రక్షణ కోసం స్వయంసేవకుల వీరోచిత పోరాటం చాలామందిని ఆకట్టుకొంది.

సిపియం తమ కార్యకర్తలు ఇతర సంస్థలు, పార్టీలలోకి వలస వెళ్లడాన్ని ఎప్పటినుంచో సహించేది కాదు. హింసాయుత రాజకీయాలకు దిగడం ద్వారా వలసలను నిలిపివేయడం కోసం భయభ్రాంతులను సష్టించడం అనేది దశాబ్దాలుగా సాగుతున్నది. మొదట సిపియం వారిపై, ఆ తరువాత కాంగ్రెస్‌ వారిపై, ముస్లింలపై ఇటువంటి హత్యాకాండను విస్తరించారు. ఇప్పుడు బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారిపై కొనసాగిస్తున్నారు.

ఇదివరలో పార్టీకి పట్టున్న ఉత్తరాది జిల్లాలకు మాత్రమే ఈ హత్యాకాండ పరిమితమయ్యేది. ఇప్పుడు రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యవాహను హత్య చేయడంతో హత్యలు దక్షిణాది జిల్లాలకు వ్యాపించినట్లు అయింది. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. జాతీయస్థాయి ఉద్యమం జరపడం తెలిసిందే.

తమ కార్యకర్తలు వలస వెళ్లడాన్ని సహించలేని సిపియం ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలపై హత్యాకాండకు దిగింది. 1977 నుండి 1980 వరకు 16 మంది ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను కన్నూర్‌ జిల్లాలో హత్య చేశారు. 1978 సెప్టెంబర్‌ 2 నుండి గ్రామంలో శాఖ నిర్వహిస్తున్న యువ స్వయంసేవక్‌ పనుడ చంద్రన్‌ను హత్యా చేయడం ద్వారా పెద్దఎత్తున హింసాకాండకు దిగారు. దానితో చాలామంది స్వయంసేవకులు ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఆ తరువాత కూతుపరంబ తాలూకా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యవాహ పినరాయి చంద్రన్‌ పినరాయిలోని ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్‌ ఇంటికి కొద్దిదూరంలో గల తన ఇంటికి తిరిగి రావడంతో అజ్ఞాతంలో ఉన్న పలువురు కార్యకర్తలకు ఉత్సాహం కలిగి తిరిగి ఇళ్లకు రావడం ప్రారంభించారు. 1980లో చంద్రన్‌కు సన్నిహితుడైన మరో క్రియాశీల కార్యకర్త పనుంద సురేంద్రన్‌ను హత్య చేయగా, 1984లో చంద్రన్‌ను హత్యచేశారు.

సంఘ కార్యకర్తలు అభిమానంతో ‘గురు’ అని ఆయనను పిలుస్తూండేవారు. ఆ తరువాత అనేకమంది అమాయకులను కమ్యూనిస్టులు హత్యచేశారు.

ఆకట్టుకున్న పాదయాత్ర

నేడు కన్నూర్‌ జిల్లాలో అదే వీధులలో బిజెపి మద్దతు దారులు హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నడుస్తూంటె కమ్యూనిస్టులు నిస్సహాయంగా చూడవలసి వచ్చింది. దేశంలో అసహనం, రాజకీయ విద్వేషానికి బలవుతూ వస్తున్న పార్టీ బిజెపి. ఇటువంటి విద్వేషాలను అత్యధికంగా కేరళలో ఎదుర్కొంటున్నది. కన్నూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అనేకమందిని కూడా మార్క్సిస్టులు హత్య చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి బలమయిన కేంద్రమంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు కేరళ నుండి ఉన్నా, ఎప్పుడూ వారి హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా నోరెత్తలేదు. కేరళ నుండి బిజెపికి ఒక ఎంపీ కూడా లేకపోయినా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన యంపీలు కేరళలోని ‘ఎర్ర ఉగ్రవాదం’కు వ్యతిరేకంగా నోరెత్తుతూనే ఉన్నారు.

కేరళలో సిపియం సాగిస్తున్న మానవ హక్కుల అమానుష ఉల్లంఘన గురించి ఢిల్లీకి చెందిన బిజెపి యంపి మీనాక్షి లేఖి లోక్‌సభలో ఇప్పటికి ఐదుసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేరళలో సిపియం సాగిస్తున్న అత్యాచారాలను ఖండిస్తూ, శాంతి సామరస్యాలకు ఏ విధంగా భంగం కలిగిస్తున్నారో వివరిస్తూ జాతీయ నాయకులతో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.

తాము కేవలం ఓట్‌ బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాబోమని, తమకు ఓట్లు వచ్చినా, రాకపోయినా దేశ ప్రజల సంక్షేమం, సమగ్రతల కోసం నిలబడుతామని, ఈ ప్రయాణంలో తమ కార్యకర్తలను కాపాడుకోవడం తమకు అత్యంత ముఖ్యమని ఈ యాత్ర ద్వారా బిజెపి స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కుమ్మనం రాజశేఖరన్‌లతో పాటు వందలాది మంది ప్రముఖ నాయకులు, సాధారణ కార్యకర్తలు కిలోమీటర్ల దూరం కలసి నడిచారు. కేరళలో మార్క్సిస్టులు సాగిస్తున్న హత్యా రాజకీయాల గురించి ప్రధాన మీడియా మౌనం పాటిస్తున్నా బిజెపి సాగిస్తున్న నిరంతర ప్రచారం కారణంగా సిపియం నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు.

కున్నూర్‌లోని మారుమూల ప్రాంతాలలో సహితం ఈ యాత్రకు లభిస్తున్న స్పందన బిజెపి పట్ల మార్క్సిస్టులు కంచుకోటలో పెరుగుతున్న విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నది. పినరాయిలో కొద్దిరోజుల క్రితం కూడా తమ ఇళ్లను, విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పలువురు సమీపంలో ఆశ్రయం తీసుకోవలసి వచ్చింది.

ఈ యాత్ర కేరళలో హత్యారాజకీయాలను అంతం చేసే దిశలో ఒక ప్రారంభం మాత్రమే కాగలదు. పినరాయి గ్రామం గుండా పోవడం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి విజయన్‌కు హెచ్చరిక మాత్రమే కాదు, ఈ విషపూరిత రాజకీయాలకు బలైన చంద్రన్‌ వంటి వారి బలిదానాలను స్మరించుకోవడం కూడా. ఇప్పటి వరకు మార్క్సిస్టుల అదుపాజ్ఞలలో ఉన్న ఈ గ్రామాలలో ఇప్పుడు శివాజీ పతాకాలు ఎగురుతూ వారి విధానాల పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నది.

ఢిల్లీలో భారీ ర్యాలీ

కేరళలో చేపట్టిన ‘జన రక్షా యాత్ర’ లో భాగంగా బిజెపి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ‘రాజకీయ హింసాకాండ కమ్యూనిస్టుల నైజం’ అని ఈ యాత్రను ప్రారంభిస్తూ బిజెపి అధినేత అమిత్‌షా తీవ్రంగా విమర్శించారు. ఈ ర్యాలీ కన్నాట్‌ప్లేస్‌ నుంచి సిపిఎం ప్రధాన కార్యాలయం ఉన్న గోలె మార్కెట్‌ వరకు దాదాపు 1.5 కి.మీ.ల మేర సాగింది. అనంతరం జరిగిన సభలో అమిత్‌షా మాట్లాడుతూ సిపిఎంపై తీవ్ర విమర్శలు చేశారు.

వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ హింస సర్వసాధారణమై పోయిందని, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, కేరళలలో జరిగిన దాడులే ఇందుకు నిదర్శమని చెప్పారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 120 మంది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. బిజెపి కార్యకర్తలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారని, అది చూసి తమ కార్యకర్తలు భయపడాలని వారి భావమని, అయితే అలాంటి చర్యలతో తమ పార్టీ మరింత బలపడుతుందని హెచ్చరించారు.

కేరళలో సిపిఎం అధికారంలోకి వచ్చాక రాజకీయ హింసాకాండ పెచ్చరిల్లుతోందని, ముఖ్యమంత్రి పినరాయి జిల్లాలోనే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో చూసే మానవ హక్కుల సంఘం నేతలు కేరళలో జరుగుతున్న హత్యాకాండపై పెదవి విప్పడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కనుమరుగై పోతున్నాయని, అలాగే భారత్‌లో కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు. కేవలం పది మందితో ప్రారంభమైన బిజెపికి ఇప్పుడు 11 కోట్ల మంది కార్యకర్తలున్నారని గుర్తు చేశారు.

తుపాకులతో తేలికగా చంపే అవకాశం ఉన్నా కేవలం బిజెపికి మద్దతు ఇచ్చే వారిలో భయం కలిగించడం కోసమే తమ కార్యకర్తలను ముక్కలు, ముక్కలు చేసి చంపుతున్నారని ఆయన ఆరోపించారు. కేరళలో అన్ని హత్యలు ముఖ్యమంత్రి ఆదేశం మీదే జరుగుతున్నాయని పేర్కొంటూ, తమ కార్యకర్తలను చంపితే కనీసం అరెస్టులు కూడా చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. ‘మా కార్యకర్తలను హత్య చేయడాన్ని మేము సహించం. అయితే మేము కమ్యూనిస్టుల వలె హింసకు ప్రతిగా హింసకు పాల్పడబోము. హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి కమ్యూనిస్టులకు మద్దతు లేకుండా చేస్తాం’ అని స్పష్టం చేసారు.

ఇస్లాం తీవ్రవాదాన్ని పోషిస్తున్న సిపియం

కేరళ ఒక విచిత్రమైన సామాజిక కలవరాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ యాత్ర జరగడం గమనార్హం. ఇప్పుడు సిపియం ప్రోత్సాహంతో ఇస్లాం తీవ్రవాదం కేరళలో ఉపందుకొంటున్నది. యువత ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.లో చేరుతూ తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూండటం గమనార్హం. హిందూ యువతులను మత మార్పిడిలకు గురి చేయడం కోసం ‘లవ్‌ జిహాదీ’ ద్వారా ప్రయత్నం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సిపియం వారికి తమ పార్టీ పట్టు నిలుపుకోవడమే ముఖ్యం. అందుకనే క్షేత్ర స్థాయిలో ఉగ్రవాద బందాలతో చేతులు కలపడానికి కూడా వెనుకాడటం లేదు.

ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖరన్‌ మతమార్పిడితో కోర్ట్‌ ముందు వివాదంగా మారిన అఖిలను సందర్శించారు. పైగా అఖిల ఒక కమ్యూనిస్ట్‌ కార్యకర్త కుమార్తె కావడంతో ‘లవ్‌ జిహాదీ’ వంచనకు గురయినట్లు ఆమె తండ్రి అశోకన్‌ పేర్కొనడం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నది.

గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా మార్క్సిస్టులు హత్యారాజ కీయాలను బహిరంగంగా ధిక్కరిస్తూ బిజెపి వీధులలోకి రావడం సిపియం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. అఖిలను వైవాహిక బంధంలోకి నెట్టేయాలని పలువురు కమ్యూనిస్ట్‌ నాయకులు, మేధావులు చేస్తున్న ప్రయత్నాలు సిపియం మద్దతుదారులలైన హిందువుల నుండి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతున్నది.

సిపియం పార్టీ ముస్లింలైన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నమాజ్‌ జరుపుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నది. అలాగే తమ నాయకులు పోప్‌, ఇతర మత పెద్దల ముందు సాష్టాంగపడినా పట్టించుకోదు. అదే సిపియం పార్టీ గురువాయూర్‌ దేవాలయం సందర్శించారని తమ పార్టీకి చెందిన మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌, రిటుబ్రత బనెర్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఈ చర్య హిందువులలో నిరసనలకు దారితీస్తున్నది. పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద ప్రమాణాలు వారి ధోరణులను వెల్లడి చేస్తున్నాయి.

కేరళలో బిజెపి చేస్తున్న జనరక్ష యాత్ర గురించి మలయాళం మీడియా దాదాపుగా మౌనం వహిస్తున్నా, సిపియం నాయకత్వం మాత్రం కల్లోలానికి గురవుతున్నది. ఆర్‌.ఎస్‌.ఎస్‌., యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా విషప్రచారం చేయడంలో నిమగ్నమైంది. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో కేరళ నుండి వచ్చిన శంకరాచార్య, శ్రీ నారాయణ గురు, చట్టంబి స్వామి, మాత అమృతానందమయి వంటి వారు చేస్తున్న కషిని గుర్తు చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్‌ దేశంలోని హిందువులకు కేరళతో గల అనుబంధాన్ని గుర్తు చేశారు.

– చలసాని నరేంద్ర

(జాగృతి సౌజన్యం తో)