మావోయిస్టు కార్యకలాపాలు దేశంలో నానాటికీ తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న చర్యల కారణంగా గత ఏడేళ్లలో మావోయిస్టు హింసాత్మక కార్యకలాపాలు దాదాపు మూడొంతులు తగ్గినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2010తో పోలిస్తే 2017 నాటికి మావోయిస్టు హింసాత్మక ఘటనలు దాదాపు 75% తగ్గిపోయాయి. ఇదే సమయంలో మృతుల సంఖ్య 81% తగ్గింది. దేశవ్యాప్తంగా ఉన్న పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఘటనలు, మృతుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయింది.
తెలంగాణలో తగ్గి… ఏపీలో హెచ్చుతగ్గులు…: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో మావోయిస్టు హింసాత్మక ఘటనలు తగ్గుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక్కడ గత ఏడాదిలో 17 హింసాత్మక ఘటనలు జరగ్గా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 16 ఘటనలు నమోదయ్యాయి. మావోయిస్టుల చేతుల్లో పౌరులు, ఇన్‌ఫ్మార్లర్లు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసు ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి. 2010లో 272 ఉన్న ఎన్‌కౌంటర్ల సంఖ్య 2016 నాటికి 328కి పెరిగింది. ఇలాంటి చర్యల కారణంగా ప్రభుత్వాల ముందు లొంగిపోతున్న వారి సంఖ్యా ఏటా భారీగా పెరుగుతూ వస్తోంది. గత ఆరేళ్లలో జన జీవన స్రవంతిలో కలిసిన వారి సంఖ్య 691% పెరిగింది. కొత్తగా చేరేవారికి ఇచ్చే సాయుధ శిక్షణలు, ప్రజా కోర్టుల నిర్వహణ సంఖ్య దాదాపు మూడొంతుల మేర తగ్గిపోయినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మావోయిస్టుల అణచివేతకు జాతీయ స్థాయిలో ఏకీకృత విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఒకవైపు శాంతిభద్రతల కోణంలో చర్యలు తీసుకుంటూనే మరోవైపు అభివృద్ధి ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు: మావోయిస్టు ప్రభావిత 10 రాష్ట్రాల్లోని 106 జిల్లాల్లో చేపట్టే చర్యలకు అవసరమయ్యే ఖర్చును కేంద్రమే సమకూరుస్తోంది. రహదారులు లేని ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టులు మకాం వేస్తున్నట్లు గమనించి మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించడానికి నిధులు సమకూరుస్తోంది. దీని కింద 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రూ.11,725 కోట్లతో 5,412 కిలోమీటర్ల రహదారులు, 126 వంతెనలు నిర్మిస్తోంది. టెలిఫోన్ వ్యవస్థ విస్తరణపై అధిక దృష్టి సారించింది. ఇప్పటివరకూ మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో 2,187 మొబైల్ టవర్లను ఏర్పాటుచేసింది. ఇప్పుడు కొత్తగా 35 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అత్యవసర సేవలన్నింటినీ జీఐఎస్ మ్యాపింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాంకులు, పాఠశాలలు, పోస్టాఫీసులు, ఆసుపత్రులు, మొబైల్ టవర్లు, చౌక ధరల దుకాణాలు, రహదారులు, భద్రతా వ్యవస్థలన్నింటినీ జీఐఎస్ మ్యాపింగ్ చేస్తారు.
(ఈనాడు సౌజన్యం తో)