Home News అంధత్వాన్ని జయించి.. 26 ఏళ్లుగా ట్రై సైకిళ్లను తయారుచేస్తున్న దివ్యాంగులు

అంధత్వాన్ని జయించి.. 26 ఏళ్లుగా ట్రై సైకిళ్లను తయారుచేస్తున్న దివ్యాంగులు

0
SHARE

దృష్టిలోపంతో ప్రపంచాన్ని చూడలేకున్నా తమ సంకల్పానికి ఏ మాత్రం అడ్డుకాదని నిరూపిస్తూ ఎంతోమందికి  ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరికో, ఇద్దరికో కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షలమంది  దివ్యాంగులకు  ట్రై సైకిళ్లను తయారుచేసి అందిస్తున్నారు. చేతి స్పర్శతో విడి భాగాలను గుర్తిస్తూ  నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందిస్తున్నారు. మలక్‌పేట వికలాంగుల కార్పొరేషన్ ఆవరణలోని ట్రై సైకిళ్ల  సెంటర్ దీనికి వేదికగా నిలుస్తున్నది. ఈ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులంతా అంధులు, వికలాంగులే.

26 ఏళ్లుగా దివ్యాంగులతో నడుస్తున్న ఈ సెంటర్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రతిభ. ట్రై సైకిళ్ల నిర్మాణానికి కావాల్సిన పైపులను కత్తిరించి, వాటిని కావాల్సిన ఆకృతుల్లో మలిచి ఫ్రేమ్‌ను తయారుచేసే ఈ దివ్యాంగులు, చేతి స్పర్శతో అన్ని విడిభాగాలను గుర్తించి ఫ్రేమ్‌కు బిగిస్తూ ఎలాంటి లోపంలేని ట్రై సైకిళ్లను తయారుచేస్తూ 30 ఏళ్లుగా అందిస్తున్నారు.

1981లో ఏర్పాటు

1981లో ఉమ్మడి రాష్ట్రంలోగల 18 లక్షలమంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను తయారుచేసి అందించే నిమిత్తం ఏపీలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ట్రై సైకిళ్ల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసింది అప్పటి ఉమ్మడి ప్రభుత్వం. ఆంధ్రా ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటుచేయబడిన అన్ని కేంద్రాలను సజావుగా నడిపించిన ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతంలోని మూడు కేంద్రాల్లో నిజామాబాద్‌లో అప్పట్లోనే మూసివేసింది. దాంతో  తెలంగాణ ప్రాంతంలోని 4 లక్షల మంది  దివ్యాంగులకు మలక్‌పేటలోని వికలాంగుల కార్పొరేషన్ ఆవరణలో ఉన్న హైదరాబాద్ జిల్లా తయారీ కేంద్రం, మౌలాలీ హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉన్న రంగారెడ్డి జిల్లా తయారీ కేంద్రాలే ట్రైకిళ్లను తయారుచేస్తూ అందిస్తున్నాయి.

ఆదర్శంగా నిలుస్తూ..

రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసే నిధులతో జేడీ, కమిషనర్ ట్రై సైకిళ్ల తయారీకి కావాల్సిన ముడి సరుకును తెచ్చి ఇస్తారు. వికలాంగుల అవసరాలను బట్టి వచ్చే దరఖాస్తుల ఆధారంగా ట్రై సైకిళ్లను తయారుచేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం వికలాంగులకు పెద్దసంఖ్యలో ట్రై సైకిళ్లను పంపిణీచేసేందుకు ఆర్డర్‌చేస్తే, రాత్రింబవళ్లు పనిచేసి సకాలంలో అందిస్తూ అంకితభావాన్ని చాటుకుంటున్నారు దివ్యాంగ టెక్నీషియన్లు.  ఈ రెండు తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్న 40 మంది టెక్నీషియన్లంతా దివ్యాంగులేనని టీవీసీసీ జెఏసి చైర్మన్ అర్లయ్య తెలిపారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో)