Home News ప్రపంచానికే దిశానిర్దేశం చేయగల భారత్‌ నేతృత్వంలో అంతర్జాతీయ వేదిక ప్రతిపాదన అవసరం

ప్రపంచానికే దిశానిర్దేశం చేయగల భారత్‌ నేతృత్వంలో అంతర్జాతీయ వేదిక ప్రతిపాదన అవసరం

0
SHARE

రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచశాంతే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. నాటికీ నేటికీ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1945నాటి పరిస్థితుల మేరకు ఏర్పడిన ఐరాస మౌలిక స్వరూపంలో కాలానుగుణ మార్పులు రావాలని అనేక ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. నిరుడు ఐరాస 71వ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా అనుభవిస్తున్న అయిదు దేశాలు మాత్రం భిన్న వైఖరి అవలంబిస్తున్నాయి. తమకున్న ‘వీటో’ అధికారంలో ఎలాంటి మార్పులు చేయడానికైనా అమెరికా అంగీకరించడంలేదు. స్వల్ప సంస్కరణలు మాత్రం ఆమోదయోగ్యమని వాషింగ్టన్‌ అంటోంది. గత నెలలో అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తి ఎన్నిక సైతం ఉత్కంఠ రేపింది. ఇండియాకు చెందిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీకి అత్యధిక దేశలు మద్దతు పలికాయి. శాశ్వత సభ్యదేశమైన బ్రిటన్‌కు చెందిన గ్రీన్‌వుడ్‌ సైతం బరిలో నిలిచారు. భండారీకి పెరుగుతున్న మద్దతు దృష్ట్యా గత్యంతరం లేక చివరి క్షణంలో బ్రిటన్‌ పోటీనుంచి వైదొలగడంతో చిక్కుముడి వీడింది. ఐరాసలో శాశ్వత సభ్య దేశాల ఆధిక్య భావనను, ఆధిపత్య ధోరణిని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది!

పనితీరు నిస్తేజం

క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఐరాస నిస్తేజంగా వ్యవహరిస్తుండటం పట్ల అనేక ప్రపంచ దేశాలు దశాబ్దాలుగా అసంతృప్తి వ్యక్తీకరిస్తున్నాయి. వియత్నాం యుద్ధం, బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్‌ మారణకాండలపై మౌనం, ఇరాక్‌పై అమెరికా దండయాత్ర, లిబియా, సిరియా సంక్షోభాలు, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి, ఉగ్రవాదంపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ప్రధానమైనవి. ప్రపంచ దేశాల వైఖరికి భిన్నంగా అయిదు శాశ్వత సభ్య దేశాలు వ్యవహరిస్తుండటం అత్యంత సమస్యాత్మకమవుతోంది. వాటికి ‘వీటో’ అధికారం ఉండటమే అందుకు కారణం. అందువల్లే కాలంచెల్లిన ఐరాస నిర్మాణ స్వరూపాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరిస్తున్నాయి. సంస్కరణలను కోరుతున్నాయి. ఐరాస సర్వ ప్రతినిధి సభ పేరుకు మాత్రమే అత్యున్నత ఉన్నతాధికార సంస్థ. ఆచరణలో అన్ని అధికారాలూ భద్రతా మండలి చేతిలోనే ఉన్నాయి. అందులోనూ అయిదు శాశ్వత సభ్యదేశాలదే కీలకపాత్ర! భద్రతా సమితిలో అమెరికా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, సోవియట్‌ యూనియన్‌, చైనా రిపబ్లిక్‌ సంస్థాపక శాశ్వత సభ్యదేశాలు. వాటికి ‘వీటో’ అధికారం దఖలుపడింది. అంటే, వాళ్లమాటే శాసనమన్న మాట. అందులో రెండు దేశాలు సోవియట్‌ యూనియన్‌, చైనా రిపబ్లిక్‌లు ఏడు దశాబ్దాల కాలంలో అనేక మార్పులకు లోనయ్యాయి. సోవియట్‌ విచ్ఛిన్నమైపోయింది. రష్యా మాత్రం మిగిలింది. చైనా రిపబ్లిక్‌ జనచైనాగా మారింది. అంతేకాదు- నాడు వలస దేశాల సంపదతో తులతూగిన ఇంగ్లాండు, ఫ్రాన్స్‌లు బలహీనపడ్డాయి. భారత్‌ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం సంపాదించి ప్రపంచ పటాన్ని మార్చివేశాయి. ప్రపంచంలో జీడీపీ అధికంగా కలిగి ఉన్న దేశాల్లో రష్యాను అధిగమించి భారత్‌ ఏడో స్థానానికి ఎగబాకింది. జపాన్‌, జర్మనీ మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా- ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌లు వెనకబడ్డాయి. ప్రపంచ జనాభాలో పది శాతమే ఐరోపాలో ఉన్నారు. అయినా అయిదు శాశ్వత సభ్యదేశాల్లో రెండు ఆ ఖండంలోనే ఉన్నాయి. అతి పెద్దఖండమైన ఆసియా ఒక స్థానం (చైనా)తో సరిపెట్టుకోగా- ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం భద్రతామండలిలోకి రెండేళ్లకు ఒకసారి పది దేశాలను సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులోనూ సమతుల్యత లోపిస్తోంది. ప్రపంచంలో 16 శాతం జనాభా ఉన్న ఆఫ్రికా నుంచి ముగ్గురు, 61 శాతం జనాభా ఉన్న ఆసియా-పసిఫిక్‌ (ఆసియా-ఆస్ట్రేలియా) నుంచి ఇద్దరు, తూర్పు ఐరోపా నుంచి ఒకరు, పశ్చిమ ఐరోపా నుంచి ఇద్దరు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. ఇలా చూసినా శాశ్వత సభ్యులతో కలిపి ఐరోపా నుంచి భద్రతామండలిలో ఆరుగురు సభ్యులు ప్రబలంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ యవనికపై బలహీనంగా ఉన్న ఐరోపా ఇలా ఐరాసలో తిరుగులేని అధికారం చలాయించగల స్థితిలో ఉండటమే పెద్దలోపంగా మారింది.

ఐరోపాకు అధిక ప్రాధాన్యం

శాశ్వత హోదాలేని సభ్యదేశాల వ్యవహారంలోనూ ఓ తిరకాసు ఉంది. ‘వీటో’ అధికారం లేని శాశ్వత సభ్యదేశంగా ఓ అరబ్‌ దేశాన్ని అవి ఎన్నుకోవాలి. మరో స్థానానికి ఒక పర్యాయం ఆసియా-పసిఫిక్‌ నుంచి, మరోసారి ఆఫ్రికా నుంచి ఒక దేశాన్ని ఎన్నిక చేయాలి. అంటే, ‘వీటో’ అధికారంలేని శాశ్వత సభ్యదేశంగా కూడా 61 శాతం జనాభా, 45 శాతం ప్రపంచ జీడీపీతో ఉన్న ఆసియా-ఆస్ట్రేలియా ఖండాలకు మన్నన దక్కేది రెండేళ్లకు ఒకసారేనన్న మాట. ఇంతకన్నా విచక్షణ ఏముంటుంది? ప్రపంచంలో బలమైనవిగా ఆవిర్భవించిన భారత్‌, జపాన్‌, ఇండొనేసియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం నేటికీ ఘర్షణ పడాల్సిన పరిస్థితులు ఉండటం దురదృష్టకరం.

ఐక్యరాజ్య సమితిలోని అయిదు ప్రధాన విభాగాలు, 17 ప్రత్యేక విభాగాల కార్యాలయాల్లో ఒక్కటి మినహా అన్నీ అమెరికా, ఐరోపాల్లోనే ఉన్నాయి. ఐరాస ఆరు భాషలను గుర్తించింది. వాటిలో అరబిక్‌, రష్యన్‌, ఫ్రెంచ్‌ భాషలూ ఉన్నాయి. వాటికన్నా ఎక్కువమంది మాట్లాడే హిందీ భాష గుర్తింపునకు నోచుకోలేదు. మతపరంగా చూసినా శాశ్వత సభ్య దేశాల్లో నాలుగు దేశాల్లో ఒకే మతస్థులు మెజారిటీగా ఉన్నారు. ప్రపంచంలోని పది ప్రధాన మతాల్లో నాలుగింటికి భారత దేశమే పుట్టినిల్లు. ఇండొనేసియా తరవాత ఎక్కువమంది ముస్లిములు ఇండియాలోనే ఉన్నారు. అయినా భారతదేశానికి స్థానం లేదు. ఐరాస నిర్వహణ వ్యయంలోనూ శాశ్వత సభ్యదేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలకన్నా జపాన్‌, జర్మనీలే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. ఇలా ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేని నిర్మాణ స్వరూపంతో ప్రపంచశాంతిని ఐరాస ఎలా కాపాడుతుంది? భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి సరికొత్త రూపాన్ని సంతరించుకోవాలి. రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా అవి ఉండాలి. ఈ అంశాలపై ఇప్పటికే ప్రఖ్యాత సంస్థలు అంచనాలు వెలువరించాయి. ఆ అంచనాల ప్రకారం, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ మొదటి పదిదేశాల జాబితాలో ఉండబోవు. రష్యా ప్రభ కొడిగడుతోంది. ఇప్పటివరకు వచ్చిన స్థూల అవగాహన ప్రకారం ఆసియా ఖండం నుంచి భారత్‌, జపాన్‌ దేశాలు, ఐరోపా నుంచి జర్మనీ, లాటిన్‌ అమెరికా నుంచి బ్రెజిల్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వ హోదా ప్రసాదించాలని మెజారిటీ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియాల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆర్థికపరంగా దక్షిణాఫ్రికా, జనాభాపరంగా నైజీరియా ఆఫ్రికా ఖండంలో అగ్రస్థానంలో ఉన్నాయి.

చైనా కృతఘ్నత

ఐక్యరాజ్య సమితిలో గత వైభవ చిహ్నాలుగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలు మిగిలిపోయాయి. అంతర్జా తీయ రాజకీయ యవనికపై అవి తమ పట్టును దాదాపు కోల్పోయాయి. అయినా శాశ్వత సభ్య దేశ హోదాను వదులుకోవడానికి అవి సిద్ధంగా లేవు. మాట వరసకు అన్నట్లుగా అమెరికా సంస్కరణల గురించి మాట్లాడుతోంది. ‘వీటో’ అధికారం కోరుకోనట్లయితే శాశ్వత సభ్యత్వ వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ సన్నాయినొక్కులునొక్కారు. అయిదు శాశ్వత సభ్యదేశాల్లో చైనా ఒక్కటే వర్ధమాన దేశం. చైనా రిపబ్లిక్‌ జనచైనాగా మారుతున్నవేళ… తన స్థానంలో భారత్‌కు అవకాశం ఇవ్వాలని చైనా సూచనప్రాయంగా తెలిపింది. అందుకు మనదేశం నిరాకరించింది. జనచైనాయే కొనసాగాలని కోరింది. అలా 1971లో జనచైనా ఇండియా మద్దతుతో శాశ్వత సభ్య దేశంగా అవతరించింది. ఇప్పుడు భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చైనా మోకాలడ్డుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు అనుకూలంగా చైనా వైఖరి ఉండటం మరో వైచిత్రి. అంతేకాదు- ఐరాసలో సంస్కరణలకూ ససేమిరా అంటోంది. ఒకప్పుడు అమెరికా చూపిన ఆధిపత్య ధోరణికి నకలుగా చైనా వ్యవహారం ఉంటోంది.

భారత్‌ క్రియాశీలత

శాశ్వత సభ్యదేశాల ధోరణి మారనంత కాలం ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకు అవకాశం ఉండదని తేటతెల్లమవుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒకప్పుడు నానాజాతి సమితికి పట్టిన గతే ఐక్యరాజ్య సమితికీ పడుతుంది. అందువల్ల ప్రపంచ మేధావులు సత్వరం మేలుకొని ముందస్తు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. నానాజాతి సమితి వైఫల్యం వల్లే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఐరాస నిస్తేజం మరో ప్రపంచ యుద్ధానికి అంటు కట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. మరో ప్రపంచ యుద్ధం గనక వస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. 72 ఏళ్ల సుదీర్ఘ అనుభవం- మరింత మెరుగైన అంతర్జాతీయ సంస్థ పాదుకొల్పడానికి వినియోగించాలి. అది ప్రజాస్వామ్య బద్ధంగా, సమతుల్య ప్రాతినిధ్యం ప్రాతిపదికన సాగాలి. అందులో ఏ దేశానికీ ‘వీటో’ అధికారం ఉండకూడదు. విస్తృత మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయాలు జరగాలి. అన్ని ఖండాలకు, జనాభా, ఆర్థిక వ్యవస్థలకు సహేతుక ప్రాతినిధ్యం కల్పించాలి. భద్రతా మండలిని పునర్‌ నిర్మించాలి. ఐరాస స్థాపించినప్పుడు 51 దేశాలే అందులో భాగస్వాములయ్యాయి. ప్రపంచానికే దిశానిర్దేశం చేయగల ఆలోచనలను శాంతికాముక దేశమైన భారత్‌ ప్రతిపాదించాల్సిన తరుణమిది. తమ ఆలోచనలతో కలిసివచ్చే దేశాలతో ముందుగా ఓ సాధన సమితిని ఏర్పాటు చేసుకోవాలి. బలమైన ఆర్థిక వ్యవస్థలుగల అమెరికా, చైనాలనూ ఆ చర్చల్లో భాగస్వాముల్ని చేయాలి. సంస్కరణల పట్ల కాసింత మొగ్గు చూపిస్తున్న అమెరికా కలిసిరావచ్చు. అనేక ప్రపంచ దేశాలదీ అదే దారి. కాబట్టి, తప్పని పరిస్థితుల్లో చైనా సైతం దారికి రావచ్చు. భారత్‌ ఉనికిని విస్మరించే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు లేవన్నది బహిరంగ రహస్యం. కాబట్టి, ఆధునిక ఐక్యరాజ్య సమితి పునర్‌ నిర్మాణం కోసం భారత్‌ ముందుండి చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ శాంతి పరిరక్షణకు కనిపిస్తున్న మార్గం ప్రస్తుతానికి ఇదొక్కటే!

– కె.రామకోటేశ్వరరావు