ధర్మపన్నాలు వల్లించడంలో చైనా దిట్ట. సుద్దులు చెప్పడం, శాంతివచనాలు ప్రవచించడంలో ఆ దేశానిది అందె వేసిన చెయ్యి. ఇతరుల దగ్గరకు వచ్చేసరికి అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలు, నిబంధనలను ఏకరవు పెట్టడం, తాను మాత్రం వాటికి పూచిక పుల్లపాటి విలువైనా ఇవ్వకపోవడం దానికే చెల్లింది. తాజాగా హిందూ మహాసముద్రం విషయంలో భారత్‌కు హితోక్తులు చెప్పడం ఇందుకు ప్రబల నిదర్శనం. ఇటీవల చైనాను సందర్శించిన భారత విలేకరులతో ఆ దేశ నౌకాదళ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే బీజింగ్ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. ఝాంగ్ జియాంగ్ నగరంలోని వ్యూహాత్మక దక్షిణ సముద్ర నౌకాదళ (ఎస్ఎస్ఎఫ్) స్థావరంలో చైనా నౌకాదళానికి చెందిన యులిన్ యుద్ధనౌకను విలేకరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ ఉన్నతాధికారి కెప్టెన్ లియాంగ్ తియాన్జున్ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పరిరక్షించడానికి తాము భారత్‌తో చేయి కలపడానికి సిద్ధమంటూ హాస్యాస్పద ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా హిందూ మహాసముద్రం అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ఆస్తి అంటూ ప్రకటన చేశారు. వ్యూహాత్మకంగా తనకు అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో చైనా కదలికలపై భారత్ ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ తాజా వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని నానాయాగీ చేస్తున్న బీజింగ్ హిందూ మహాసముద్రం మాత్రం ఉమ్మడి ప్రదేశమని అనడం దాని ద్వంద్వవైఖరికి నిదర్శనం.
వితండవాదం
చైనా ప్రకటన వెనక ఎంతో ముందుచూపు దాగుంది. ఇరుగు పొరుగు దేశాలతో అది వ్యవహరిస్తున్న తీరు ఇందుకు తార్కాణం. స్వప్రయోజనాలే చైనాకు ముఖ్యం. అంతర్జాతీయ చట్టాలు, తీర్పులు పట్టనే పట్టవు. మాట వినని దేశాలను భయపెట్టేందుకూ వెనకాడదు. విస్తరణ వాదమే డ్రాగన్ లక్ష్యం. దక్షిణ చైనా సముద్ర వివాదం ఇందుకు దాఖలా. యావత్ దక్షిణ చైనా సముద్రం తనదేనంటూ చైనా చేసిన వాదనను నిరుడు జులైలో హేగ్ నగరంలోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీఏసీ) తోసిపుచ్చింది. వివాద పరిష్కారానికి సుమారు పదిహేడేళ్లపాటు దౌత్య, రాజకీయ మార్గాల్లో పలు ప్రయత్నాలు చేసి దక్షిణ చైనా సముద్రతీర దేశమైన ఫిలిప్పీన్స్ విఫలమైంది. దీంతో 2013లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానిపై అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తించేది లేదని, దాన్ని చెత్తబుట్టలో వేయండంటూ బహిరంగంగానే చైనా పేర్కొనడాన్ని చూస్తే, అంతర్జాతీయ చట్టాలపై దానికి ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతుంది!
దక్షిణ చైనా సముద్రంపై వితండవాదం చేస్తున్న బీజింగ్, తనకు ఎలాంటి సంబంధం లేని హిందూ మహాసముద్రం విషయంలో భారత్‌కు సుద్దులు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పరిరక్షించడానికి భారత్‌తో చేయి కలపడానికి సిద్ధమంటూ ఉదారంగా ముందుకు వస్తోంది. అసలు భారత్ పొడ గిట్టని దేశం, ఈ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమీ ప్రయోజనం లేనట్లయితే భారత్‌తో కలిసి పని చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవక మానవు! భౌగోళికంగా హిందూ మహాసముద్రానికి చైనాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి ఇక్కడ తీరప్రాంతం లేనేలేదు. అయినా ఈ ప్రాంతంలో ఉనికి కోసం, పట్టు కోసం తాపత్రయపడుతోంది. అందువల్లే వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. ఈ తీర ప్రాంత దేశాల్లో ఓడరేవులు నిర్మించడం, సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ముత్యాలసరం (స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్) పేరిట హిందూ మహాసముద్ర తీరదేశాల్లో ఓడరేవులు, రక్షణ స్థావరాలను నిర్మించి, తద్వారా భారత్ చుట్టూ పాగా వేయాలన్నది వ్యూహం. ఇందులో భాగంగానే శ్రీలంకలోని హంబన్‌టోట, పాకిస్థాన్‌లోని గదర్లలో ఓడరేవుల నిర్మాణం పూర్తిచేసింది. మియన్మార్‌లోని కోకస్ ద్వీపంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో, మాల్దీవుల్లోని మరావ అటోల్, సోమాలియా, సీషెల్స్‌లో వివిధ కార్యకలాపాల ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలో ఏకంగా తన తొలి విదేశీ సైనిక స్థావరాన్ని ఇటీవలే ప్రారంభించింది. దీనికి సమీపంలో నుంచే భారత్ చమురు నౌకలు ప్రయాణిస్తుంటాయి. సోమాలియా సముద్ర దొంగలను అడ్డుకునే పేరిట చైనా ఇక్కడ భారీగా బలగాలను మోహరించడం భారత్‌కు చికాకు కలిగించే పరిణామం. ఇప్పటికే ఈ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు పెరిగిపోయాయి. చైనాకు చెందిన జలాంతర్గాములు, విధ్వంసక నౌకలు, కీలక సమాచారం సేకరించే నౌకల రాకపోకలు పెరిగినట్లు భారత నౌకాదళం గుర్తించింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్ సహా ఇతర నౌకల సంచారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజింగ్, హిందూ మహాసముద్రంలో తన నౌకల సంచారాన్ని సమర్థించుకోవడం ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. తూర్పుచైనా సముద్ర జలాల్లో సంచరిస్తున్న భారత్‌కు చెందిన రెండు నౌకలను చైనా గత ఏడాది జూన్‌లో వెంబడించింది.
దూకుడుకు ముకుతాడు
హిందూ మహాసముద్రంపై చైనా దృష్టి సారించడానికి కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయంగా ఇది అత్యంత కీలకమైంది. పసిఫిక్, అట్లాంటిక్ తరవాత ఇదే మూడో అతిపెద్ద మహాసముద్రం. ఇక్కడి నౌకామార్గాలు ప్రపంచంలో అత్యంత కీలకమైనవి. తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే ఈ మహాసముద్రం భారత్‌కు భద్రతాపరంగా, వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ఎంతో ముఖ్యమైంది. ఈ మహాసముద్రంలో గల అండమాన్ దీవుల్లో అపార ఖనిజ సంపద ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. దీనిద్వారా ప్రపంచంలోని సగం దేశాలకు చమురు సరఫరా జరుగుతోంది. ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి చైనాకు ఖనిజాలు, చమురు, ఇతర ముడిసరకులు దక్షిణ చైనా సముద్రంతో పాటు, హిందూ మహాసముద్రం ద్వారా జరుగుతుంటాయి. ప్రపంచ వాణిజ్యంలో గణనీయ భాగం వాణిజ్యం దీనిమీదుగానే జరుగుతోంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దీని ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇంత ప్రాధాన్యం ఉండబట్టే ఈ ప్రాంతంపై బీజింగ్ కన్నేసింది. అడక్కుండానే భారత్‌కు చేయూత ఇస్తామని ముందుకు వస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలంగా వ్యవహరించడం భారత్‌తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకూ అసౌకర్యం కలిగించేదే. ఈ మూడు దేశాలు ఏటా ఇక్కడ ‘ఆపరేషన్ మలబార్’ పేరిట సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటం చైనాకు మింగుడు పడటం లేదు. గతంలో ఈ మహాసముద్రంపై భారత్ పెద్దగా దృష్టి సారించలేదు. యూపీఏ పదేళ్ల పాలనలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఈ తీరప్రాంత దేశాల్లో పర్యటించనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దిల్లీ పగ్గాలు చేపట్టాక కొంత మార్పు వచ్చింది. నిరుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సముద్ర ప్రాంత దేశాలైన శ్రీలంక, మారిషస్, సీషెల్స్‌లో పర్యటించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గదర్ ఓడరేవుకు ప్రతిగా ఇరాన్‌లోని ఛబహార్ ఓడరేవును నిర్మిస్తోంది. చైనా దూకుడును అడ్డుకునేందుకు జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించడం నేడు భారత్ ముందున్న తక్షణ కర్తవ్యం!
– గోపరాజు మల్లపరాజు
(ఈనాడు సౌజన్యం తో)