చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్ తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్ మహోత్సవ్ ముందుకు తీసుకువచ్చింది. గడచిన పాతిక ముప్పయ్ సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన ప్రయత్నం జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్నా, ఆ మహా మేధో ఉద్యమానికి ఇప్పుడు పూర్తి ఊపు వచ్చింది. వక్రీకరణల నుంచి వాస్తవాలు విముక్తమవుతున్నాయి. వక్రభాష్యాల నుంచి సాంత్వన పొందుతున్నాయి. హిందూత్వ కేంద్రబిందువుగా సాగుతున్న ఈ రాక్షస యుద్ధ శైలికి ప్రతిఘటన బలపడింది. నగరాలలో ఉంటూనే విశ్వవిద్యాలయాలలో ఉద్యోగులుగా, న్యాయవాదులుగా, హక్కుల కార్యకర్తలుగా, సామాజిక కార్యకర్తలుగా, సాంస్కృతిక కార్యకర్తలుగా సంచరిస్తున్న మేధో ఛద్మవేషధారులు చేసే భారత వ్యతిరేక వాదనల మీద ప్రతిదాడి ఊపందుకుంది. చరిత్ర రచనను వక్రీకరిస్తే జాతిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంచవచ్చునన్న తెల్లజాతి వ్యూహమే వీరూ కొనసాగిస్తున్నారు. కానీ వీరంతా ప్రచారం చేసినట్టు చరిత్రలో భారతజాతి దాస్యాన్ని ఆమోదించలేదు. ధర్మాన్ని తాకట్టు పెట్టలేదు. పురాతన భారతానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదన్న ఆరోపణ, శాస్త్రీయ దృక్పథం మృగ్యమన్న వ్యాఖ్య శుద్ధ అబద్ధం. ఇప్పుడు ఈ అబద్ధాలకే చుక్కెదురవుతోంది. వాస్తవాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా గొప్ప చరిత్ర కలిగిన భారతజాతి పురోగమనానికీ, సగౌరవంగా లక్ష్యాన్ని చేర్చడానికీ ఉపయోగపడేదే. హిందూత్వకు, భారతీయతకు ఏ చేటు వచ్చినా ఆర్ఎస్ఎస్ ఆదుకోవాలన్న దృక్పథమే సమాజంలో ఉంది. ఇప్పుడు కూడా మన గతంలోని మంచిని చెప్పడం, వాస్తవాలు చెప్పడం, తప్పులను అంగీకరించడం, అదే సమయంలో సరిదిద్దుకోవడం అనే బాధ్యతను కూడా సంఘమే స్వీకరించింది. కానీ ఇది దేశ పునర్నిర్మాణం కోణం నుంచి మాత్రమే సంఘం స్వీకరించింది. భావదాస్యం నుంచి బయటపడడమే ధ్యేయంగా చేపట్టింది. మనదైన ప్రతిభ, సామర్థ్యం వెలికి తీయడానికి మార్గంగా ఉపయోగించు కుంటున్నది. ఈ యజ్ఞంలో సంఘంతో సంబంధం లేనివారు కూడా పలువురు పాల్గొంటున్నారు. అంటే వాస్తవాలు గుర్తించే పనిని, సేకరించే బాధ్యతని సమాజం సమష్టిగా స్వీకరిస్తున్నది. ఇది మరింత స్వాగతించదగినది. ఆ ప్రయత్నాన్ని మనసారా స్వాగతిస్తూ, ఇంతదాకా జరిగిన ప్రయాణంలో పడిన కొన్ని అడుగులు చూద్దాం.
వేయి కోతల దేహ బాధ
ఈ పురాతన పుణ్యభూమి చరిత్రను చూస్తే వేనవేల గాయాలు కనిపిస్తాయి. స్వతంత్ర భారత దేశంలో చాలా ప్రభుత్వాలు ఆ గాయాలకు మందు వేయలేదు సరికదా, గాయపరుస్తున్నవారిని నిరోధించలేదు కూడా. ఆ గాయపరిచే వారు ఎవరో కాదు, విదేశీ సిద్ధాంతాలను నమ్మినవారు, ఎడారి మతాలవారు. ఇప్పుడు ఇలాంటి ఇంటిదొంగలను కట్టడి చేయడం ప్రభుత్వాలకు కూడా సాధ్యం కావడం లేదు. భారత హోమ్‌శాఖ మాజీ కార్యదర్శి గోపాలకృష్ణ పిళ్లై రాసిన ఈ వాక్యాలు చూడండి: ‘‘నేను కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు కోబడ్ ఘాండీ, అనురాధా ఘాండీలపై నడిచిన కేసులు చూశాను. మేధావులు, మానవహక్కుల కార్యకర్తలు అనే ముసుగులో పనిచేసే కరడుగట్టిన మావోయిస్టులకు వ్యతిరేకంగా కేసులు నడపడంలో ప్రభుత్వానికి ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు తద్వారా తెలుసుకోగలిగాను.’’ ఈ వాక్యాలు బినయ్‌కుమార్ సింగ్ ‘బ్లీడింగ్ ఇండియా: ఫోర్ ఎగ్రెసర్స్, ధౌజెండ్ కట్స్’ పుస్తకానికి రాసిన పీఠిక లోనివి (తెలుగు అనువాదం-రక్తసిక్త భారతం, నలుగురు ఘాతుకులు -వెయ్యి కోతలు. అను: వీవీ సుబ్రహ్మణ్యం). ఈ అంశాలనే ఇంకాస్త వివరిస్తూ వీవీ సుబ్రహణ్యం రాసిన పుస్తకం ‘ముంచుకొస్తున్న ముప్పు: ఎప్పటికి కనువిప్పు?’. ఐదు అధ్యాయాలలో చాలా మంది సమాచారం ఇచ్చారు రచయిత. వేయేళ్ల ముట్టడి, క్రైస్తవ మతతత్త్వం, ఇస్లామిక్ మతతత్వ్తం, కమ్యూనిజాలతో భారతీయ సమాజానికి వచ్చిన ముప్పుతో పాటు హిందువులు ఎందుకు నిస్తేజంగా ఉండిపోతున్నారంటూ రచయిత ప్రశ్నించడం ఇందులో కీలకం.
టుక్డే టుక్డే గ్యాంగ్ పేరుతో విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన వారికీ, భీమా కొరేగావ్ కుట్రకీ, పీఎఫ్ఐ ఘాతుకాలకీ, క్రైస్తవ మిషనరీల విరగబాటుకీ వెనుక ఉన్నది ఆ దుష్ట చతుష్టమయే. వారే ముస్లిం ఫండమెంటలిస్టులు, క్రైస్తవ మిషనరీలు, అర్బన్ నక్సల్స్… కొందరు కొందరు జర్నలిస్టులు. పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి నిషిద్ధ సంస్థ రక్తపు టేరులు పారించడానికి డబ్బుమూటలు అందిస్తున్న కొన్ని ఎన్జీవోల గురించి కూడా ఇందులో ఉంది. 2047 నాటికి భారత్‌ను ఇస్లాం దేశంగా మారుస్తామని రంకెలు వేయగలిగే స్థాయికి పీఎఫ్ఐ వచ్చిందంటే వీళ్లందరి అండదండలతోనే. దేశంలో బలమైన, స్థానీయత కలిగిన ప్రభుత్వం ఏర్పడడం తోనే వీళ్లంతా తమ వికృతాలకు కొత్త కోరలు తగిలించారు. ఖలిస్తాన్ తీవ్రవాదానికి మళ్లీ ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లకి సిఖ్స్ ఫర్ జస్టిస్ అన్న సంస్థ పెట్టుబడి పెడుతున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఫాసిజం ముద్ర వేసి సాగిస్తున్న ఈ అరాచకాలను సరైన రుజువులతో బినయ్ కుమార్ జాతి ముందు పుస్తకరూపంలో ఉంచారు. చిత్రంగా అంతర్జాతీయ క్షమా వంటి సంస్థ మాత్రమే కాదు, ప్రతి హక్కుల సంఘం ఈ దుష్టచతుష్టయం మీద ఈగ వాలినా సహించదు. సుప్రీంకోర్టును సైతం కదిలిస్తున్నది. మైనారిటీల హక్కుల పేరుతో వీళ్లు చేస్తున్నది మత మార్పిడులే. మైనారిటీల రక్షణ అంటే వీళ్ల అభిప్రాయంలో హిందువుల మనోభావాలను దారుణంగా అవమానించడమే. హిందూ ప్రార్థనామందిరాల మీద దాడులు చేయడమే. ఆయా సంస్థలే తయారు చేసిపెట్టుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా రాసిన ఈ పుస్తకం చదివితే మనసు వికలమవుతుంది. మన మనసులను వికలం కానీయవద్దు. ఇలాంటి విద్రోహానికి వ్యతిరేకంగా అడుగులు వేసే కార్యాచరణ వైపు నడిచే చింతన అలవరుచుకోవాలి. ఈ పుస్తకం రాసి మనలని మరింత చింతాక్రాంతులను చేయడం రచయిత ఉద్దేశం కానేకాదు. ‘వైవిధ్య భరితమైన, బహుళత్వమయమైన సమాజానికి, మన జీవన విధానానికి తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్న ఈ జాతి వ్యతిరేక శక్తుల కథనంతటినీ విశ్లేషించుకుని చూడవలసిందిగా ముందే ఏర్పరుచుకున్న భావాలు లేనివారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ పుస్తకం ముగించారు. అంటే తన రచనలోని ప్రామాణికతను తనిఖీ చేసుకోవచ్చునని కూడా రచయత పాఠకులకు సవాలు వంటిది విసిరారని అనిపిస్తుంది. ఆయన తన నిజాయితీని నిరూపించు కోవడానికి ఈ మాట రాశారు. దేశం పట్ల, భద్రత పట్ల, మన ధర్మంపట్ల మనకున్న నిబద్ధతను చాటు కోవడంలో కర్తవ్య నిర్వహణకు పూనుకొనడంలో ఈ పుస్తకం నుంచి ఎంతవరకు ప్రేరణ పొందవచ్చునో చూసుకోవాలి.
బ్రహ్మ పదార్థం- సెక్యులరిజం
ఈ దేశంలో బీజేపీ తప్ప ప్రతి రాజకీయ పక్షం తప్పక వల్లించే ఒకే ఒక మాట, సెక్యులరిజం. ఇందులోని అసంబద్ధత ఎంతో నాయకుల కంటే ప్రజలే త్వరగా అర్ధం చేసుకున్నారని అర్ధమవుతుంది. ఫలితమే రామజన్మ భూమి వంటి విజయాలు. సోషలిజం అంటే అందరూ ధరించడం వల్ల ఆకృతి కోల్పోయిన టోపీ అని ఒక రాజకీయ పరిశీలకుడు పూర్వమే అన్నాడు. ఇక్కడ చెల్లుబాటు అవుతున్న సెక్యులరిజం ధరించే దుస్తుకు తగ్గట్టు శరీరాన్ని కొసుక్కోవాలని చెబుతోంది. హిందూ వ్యతిరేకతే సెక్యులరిజమా? మైనారిటీలను బుజ్జగించడమే సెక్యులరిజం లక్షణమా? అసలు మన జీవన పరంపరకూ, చరిత్రకూ సెక్యులరిజం అవసరం ఉందా? ఈ అంశాలను చర్చించిన చిన్న పుస్తకం మన్నవ గిరిధరరావు రాసిన ‘ఏది సెక్యులరిజమ్?’ ఎంత తుప్పు పట్టిపోయినా దీనినే ఆయుధంగా చేసుకోవాలన్న మన సెక్యులర్ పార్టీల భేషజం గురించి ఈ పుస్తకం క్లుప్తంగా, బలంగా చెప్పింది.
పౌరసత్వ సవరణ చట్టం: వాస్తవాలు- వ్యాఖ్యానాలు
డాక్టర్ కె. లక్ష్మణ్ (రాజ్యసభ సభ్యులు) బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా ఉన్నప్పుడు తన సంపాద కత్వంలో వెలువరించిన చిన్న పుస్తకమిది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ నిర్ణయాల నేపథ్యంలో ఒక పథకం ప్రకారం జరిగిన అల్లర్లు, విద్వేష ప్రచారం చిన్నవేమీ కాదు. అసలు ఈ గొడవలతో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమనే నిర్ధారణకు కూడా కొందరు వచ్చారు. ఆ రెండు చట్టాల మీద ఉన్న అపోహలను తొలగించ డానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం దుష్ప్రచారం ముందు చిన్నబోయింది అన్నా ఆశ్చర్యపడక్కర లేదు. కానీ నిజాలు వేరు. వాటిని వెల్లడించడమే ఈ పుస్తకం లక్ష్యం. ముస్లిం పెద్దలు సహా మేధావులు, పత్రికలలో వచ్చిన వ్యాసాలు వెల్లడించిన సంగతులు ఇందులో ఉన్నాయి.
ధర్మాన్ని ఎందుకు రక్షించుకోవాలి?
భారతీయ సమాజం వేయేళ్ల పాటు విదేశీ పాలనలో ఎందుకు ఉండిపోయింది? ఈ ప్రశ్నకు జవాబులు అన్వేషించే క్రమమే మన చరిత్రను తెలుసుకోవడం అవుతుంది. అయితే ఈ చరిత్ర సక్రమంగా లేదు. దానితోనే హిందువులు తమ చరిత్రను తాము సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. హిందూదేశం ఉన్నప్పుడే హిందువుల మనుగడ. ఆ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపకరించే పుస్తకం ‘హిందూ సమాజ రక్షణ ఎందుకు? ఎలా?’. ప్రఖ్యాత చరిత్ర రచయిత సీతారాం గోయెల్ రాసిన ఈ పుస్తకాన్ని సౌదామని తెనిగించారు. హిందువులకు మరొక దేశం లేదు. భారతదేశం ఉంటేనే భారతీయులు లేదా హిందువులు ఉండగలరు. ఇదే ఈ పుస్తకం చెబుతుంది.
హంపి శిథిలాలకు గొంతునిచ్చిన నవల
ఇలాంటి పుస్తకాలతో పాటు సృజనాత్మక పక్రియలో కూడా చరిత్రకు జరిగిన అన్యాయాన్ని చిత్రించే కృషి కనిపిస్తుంది. దేశ చరిత్రను, ప్రధానంగా ముస్లిం దండయాత్రలను, వారి హిందూ ద్వేషాన్ని ఉదారవాదులు, వామపక్ష చరిత్రకారులు ఎంతటి వక్రీకరణతో చరిత్ర పేరుతో నమోదు చేయదలిచారో హంపీ నేపథ్యంతో వచ్చిన అద్భుత నవల ‘ఆవరణ’. ఎస్ ఎల్ భైరప్ప రాసిన ఈ నవల చరిత్ర ఆధారంగా వచ్చిన అద్భుత నవలలో ఒకటి. ముస్లిం పాలనా కాలంలో దేశానికి వచ్చిన యాత్రికుల రచనల ఆధారంగానే ఈ నవలను ఆయన రాశారు. నాటి హిందువుల దుస్థితికి కన్నీళ్లు వచ్చినా, వారి అనైక్యత, అధైర్యాలను చూస్తే మాత్రం రక్తం ఉడుకుతుంది.
ఇక్కడ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, నిర్మాణం, భారతీయ సమాజంపై ప్రభావం వంటి అంశాలపై వచ్చిన కొన్ని పుస్తకాలను మాత్రమే పరిచయం చేశాం. ఇప్పుడు ఈ అంశం మీద విశేష సమాచారంతో పుస్తకాలు వెల్లువెత్త్తుతున్న మాట నిజం.
వెల్లువెత్తుతున్న వాస్తవాలు –మొదటి భాగం
జాగృతి సౌజన్యంతో…