- పల్లెలకు పాఠం- రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి
- నిదర్శనం జనగామ జిల్లా ఏనెబావి గ్రామం.
క్రిమిసంహారకాలు లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఏనెబావినే ఉదాహరణగా చూపుతారు. రసాయనరహిత గ్రామంగా పేరొందిన ఆ గ్రామ రైతుల ప్రస్థానం ఇది.
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెబావి గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా చీడపీడల బాధ లేకుండా అధిక దిగుబడులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ‘క్రాప్స్’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్వతహాగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది రైతులు తమకున్న 145 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరువు నుంచి తెచ్చిన మట్టి, ఆవుపేడ, గొర్రెలు, మేకల ఎరువు, గోమూత్రం, వేప కషాయంతో ఈ రైతులు స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వానపాములతో వర్మి కంపోస్టు తయారుచేస్తూ పంటలకు బలమైన పోషకాలను అందిస్తున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు పొందుతున్నారు. క్రాప్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన శిక్షణతో ఏనెబావి గ్రామంలో ఇంటింటా వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా పిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ సేద్యమే కారణం అంటున్నారు ఈ గ్రామ రైతులు. ఎకరం కూరగాయల తోట సాగుకు 5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో మంచి ధర పలుకుతున్నది. దిగుబడులు అధికంగా రావడంతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల సేంద్రియ వరి ధాన్యం, కూరగాయలను నగరాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సేంద్రియ ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
అవగాహన పెంచాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అధిక పెట్టుబడులతో రైతులను నష్టాల బాట పట్టిస్తున్న రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా మానుకునే విధంగా ప్రోత్సహించాలి. ఐదెకరాల్లో పదేళ్లుగా కందులు, కూరగాయల పంటలు వేసి లాభం పొందుతున్నాను.
– పొన్నాల తిరుమలేషం, రైతు
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)