Home News హిందువుల పన్నులతో అన్యమతాలను పోషిస్తారా?

హిందువుల పన్నులతో అన్యమతాలను పోషిస్తారా?

0
SHARE

హిందువులు చెల్లిస్తున్న పన్నులతో ప్రభుత్వాలు అన్యమతస్థులకు దోచిపెట్టడం ఎంత వరకు సమంజసమని పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విశ్వహిందూపరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగన్నాధ మఠ పీఠాధిపతి త్రిదండి శ్రీనివాస వ్రతధర స్వామి, కుర్తాళం పీఠాధిపతి శిష్యులు స్వామి విజ్ఞానంద భారతి, దేవాలయ పరిరక్షణ సమితి విద్యా గణేషానంద, పతంజలి యోగ మిషన్ వ్యవస్థాపకులు మాతానిర్మల యోగ భారతి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు మాట్లాడారు. హిందూ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతుందన్నారు.

మైనారిటీలను బుజ్జగించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు మత పరమైన రిజర్వేషన్లకు సైతం సిద్ధపడటం సరికాదన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ముస్లింలకు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్టియన్లకు మత ప్రచారకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను సమదృష్టితో చూడాల్సిన పాలకులు మతపరంగా చూస్తున్నారన్నారు. హజ్ యాత్రలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు, అమర్‌నాథ్ యాత్ర, వైష్ణోదేవి వంటి యాత్రలకు వెళ్లే వారి వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయల నుంచి భారీ వసూలు చేస్తున్న సొమ్ముతో ఇతర మతస్థులకు సౌకర్యాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను మార్చుతున్నారని మండిపడ్డారు. ఆయా పార్టీల్లో పదవులు రాని వారికి దేవాలయ చైర్మన్లుగా నియమిస్తుండటంతో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలు ఎన్ని, వాటి ఆస్తులు, వాటి ద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలతో పాటు వాటిని వేటి కోసం ఖర్చుచేస్తున్నారన్న విషయాలపై స్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మత పరమైన రిజర్వేషన్లు దేశ విచ్ఛిన్నతకు దారి తీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు. ఈ ధోరణిలో మార్పు రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మే 31 నుంచి జూన్ 2 వరకు హరిద్వార్‌లో స్వామీజీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు అందులో అన్యమత ప్రచారం, ముస్లిం రిజర్వేషన్లు, హిందువులపై జరుగుతున్న దాడులతో పాటు వివిధ అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)