మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్‌లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు.
తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్‌ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్‌లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది.
- మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు.. 9 మంది మృతి, 58 మందికి గాయాలు.
- 29 డిసెంబర్ 2007: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ చనిపోయాడు.
- జూన్ 2010: ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో సునీల్ జోషి పేరు నిందితుడిగా ఉంది
- నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది.
- కొద్దిరోజులకే దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది.
- డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు.
- 2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్‌కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్.
- ఏప్రిల్ 2011: కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ అయ్యింది.
- 2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ అరెస్ట్
- మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసిమానందకు బెయిల్
- మార్చి 31, 2017: ఏడేళ్ల తర్వాత అసిమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు
- ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
(సాక్షి సౌజన్యం తో)