Home News కథువ ఉదంతం : నిందితుడి బంధువుల నిరాహార దీక్షతో మారిన పరిణామాలు

కథువ ఉదంతం : నిందితుడి బంధువుల నిరాహార దీక్షతో మారిన పరిణామాలు

0
SHARE

8 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన తరువాత కథువకు చెందిన రసానా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అత్యాచారాన్ని అంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నప్పటికీ, క్రైం బ్రాంచ్ నివేదికను అంగీకరించడానికి మాత్రం వాళ్ళు సిద్దంగా లేరు. ఈ నివేదికను వ్యతిరేకిస్తూ గ్రామంలో చాలామంది నిరాహారదీక్ష చేపట్టారు కూడా. వీరిలో మహిళలతోపాటు ప్రధాన నిందితుడైన సాంజీ రామ్ కుమార్తె మధు కూడా ఉంది. తన తండ్రి నిర్దోషి అంటూ ఈ ఉదంతం వెనుక వేరే కధ ఉందని చెపుతోంది. `దొషులను శిక్షించాలికానీ నిర్దోషులను శిక్షించకూడదు’ అని ఆమె అంటోంది.

అమ్మాయి కనిపించకుండా పోవడానికి నాలుగురోజుల ముందు ఆ అమ్మాయి బాబాయితో పెద్ద గొడవ జరిగిందని, అప్పుడే ఇంటికి నిప్పు అంటించారని మధు చెపుతోంది. అమ్మాయి కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆమె బాబాయిని కూడా ప్రశ్నించారు. అయితే విచిత్రంగా అమ్మాయి శవమై కనిపించిన తరువాత ఈ బాబాయి కనిపించకుండాపోయాడు. గ్రామం మొత్తం తన తండ్రి, సోదరుడికి మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే తాను కూడా నిరాహారదీక్షలో పాల్గొంటున్నానని మధు చెప్పింది. ఏళ్లతరబడి తామంతా గ్రామంలో కలిసిమెలిసి ఉంటున్నామని, అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధను కలిగిస్తోందని, నిజమైన దొషులను శిక్షించాలని మధు అంటోంది. ఈ గ్రామంలోనే 40 ఏళ్లుగా ఉంటున్న మహమ్మద్ కాలు బకర్బాల్ తమ గ్రామంలో ఇప్పటివరకు ఎప్పుడూ మత ఘర్షణలు జరగలేదని చెప్పాడు. ఇప్పుడు తన కుమార్తెను కూడా బయటకి పంపడానికి జంకుతున్నానని, అసలు దోషులను వెంటనే పట్టుకునే శిక్షించాలని మహమ్మద్ కోరుతున్నాడు.

దేవాలయంలో భూగృహం ఏది లేదు

రసానా గ్రామంలోని దేవాలయంలో ఎలాంటి భూగృహం లేదు. దేవాలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి. దేవాలయం ముందువైపున అడవి ఉంది. అత్యాచారానికి గురైన అమ్మాయిని దేవాలయంలోని భూగృహంలో దాచారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. కానీ ఆ దేవాలయంలో కేవలం ఒకేఒక్క గది మాత్రమే ఉంది. ఆ గదికి కూడా మూడు తాళాలు ఉన్నాయి.

కథువ కేసు ఏమిటి?
జమ్ము కాశ్మీర్ కథువ జిల్లాకు చెందిన అల్పసంఖ్యాక వర్గానికి చెందిన 8ఏళ్ల బాలిక జనవరి 10న అపహరణకు గురైంది. ఆ అమ్మాయిని రసానా గ్రామంలోని ఒక దేవాలయంలో బంధించి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత బండరాతితో తల పగలకొట్టి చంపేశారు. జనవరి 17న అమ్మాయి శవం లభించింది. తరువాత మూడు నెలలకు పోలీసులు 8మంది పై నేరారోపణ చేస్తూ చార్జ్ షీట్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన సాంజీ రామ్ తమ గ్రామం నుండి బకార్వాల్ సముదాయానికి చెందినవారిని తరిమివేసేందుకే అమ్మాయి అపహరణ, సామూహిక అత్యాచారం, హత్యలకు ప్రణాళిక వేశాడని అందులో ఆరోపించారు. ఈ సంఘటన గురించి సమాధానం చెప్పాలంటు కాంగ్రెస్ పదేపదే ప్రధాని మోదీని నిలదీస్తోంది. అర్ధరాత్రి రాహుల్ , ప్రియాంక మొదలైన కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు కూడా. నిర్భయ సంఘటన సమయంలో కనిపించిన ఆందోళన, ప్రదర్శనలు మరోసారి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.