Home Telugu Articles ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు 

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు 

0
SHARE

జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు అధికమయ్యాయి. ప్రత్యేక ద్రవిడస్తాన్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తమిళనాడు సహా ఇతర దక్షిణ భారత రాష్ట్రాలన్నిటిలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు స్వాతంత్రానికి పూర్వం నుండే సాగుతున్నాయి. మావోయిజం అధికంగా ఉండే ఛత్తీస్ గఢ్, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి మనం చూడవచ్చు. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణం.

విదేశాల ద్వారా విరాళాలు పొందుతున్న అనేక క్రైస్తవ మిషనరీ సంస్థల లక్ష్యం కుట్ర కేవలం మతమార్పిడి మాత్రమే కాదు, దేశ విచ్చిన్నం, సంస్కృతి వినాశనం, రాజకీయ అధికారం, జనాభా పెంపు తద్వారా భౌగోళిక విస్తరణవాదం ఇలాంటివి అనేకం ఉంటాయి. ఈ సంస్థలకు అమెరికా, యూరప్ దేశాల నుండి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే ధనమే ఈ విచ్చిన్న ప్రయత్నాలకు  మూలాధారం.

తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, నిరసనకారుల మరణాల వెనుక అమెరికా నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్న విషయాన్ని గతంలో కేంద్ర హోంశాఖ నిర్ధారించింది. విదేశీ స్వచ్ఛంద సంస్థల కనుసన్నల్లో పనిచేసే కొన్ని ‘భారతీయ’ క్రైస్తవ సంస్థలు కూడా భారతదేశానికి ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టుని బహిరంగంగా వ్యతిరేకించాయి. అంతేకాదు ఉదయ్ కుమార్ అనే ‘నిరసనకారుడు’ తమ నిరసనలకు ప్రతిఫలంగా విదేశీ ధనాన్ని చర్చికి ట్రాన్స్ఫర్ చేయమని కోరుతూ ఒక స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయాడు కూడా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చెప్పుపుకుంటూపోతే అనేకం మనకు కనిపిస్తాయి.

అయితే ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం రూపకల్పనకు తొలి అడుగు 1969లోనే పడింది.  అమెరికా నిఘా సంస్థ CIA ఇక్కడి దేశీయ సంస్థలు, విద్యార్థి-యువజన-కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తోందన్న అనుమానాలు అప్పటికే బలపడ్డాయి. 1969 సంవత్సరంలో అప్పటి భారత హోమ్ మంత్రి యస్వంత్ రావ్ చవాన్ అత్యంత ముఖ్యమైన ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లోనూ చర్చకు తీసుకువచ్చారు.

దేశీయ సంస్థలకు వస్తున్న విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని బలంగా ప్రతిపాదించారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు 1976లో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది.  దీని ద్వారా విదేశీ సంస్థల నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ ఇక్కడి సంస్థలకు ఎటువంటి సహాయం అందాలన్నా అందుకు కొన్ని నియమనిబంధనలు, విధివిధానాలు ఆ చట్టంలో పొందుపరిచారు.

అయితే, 1976లోనే ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ అదంత ప్రభావవంతంగా పనిచేయలేదు (అమలుకాలేదు). తిరిగి 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వ హయాంలో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010’ పేరిట అదే చట్టాన్ని మరికొన్ని సవరణలతో ఆమోదించబడింది. అనంతరం కాలక్రమంలో ఇది మరిన్ని సవరణలకు గురవుతూ వచ్చింది.

ప్రజాస్వామ్య భారతానికి మూలస్తంభాలైన న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేటుగా చెప్పబడుతున్న మీడియా.. ఇవి ఏవీ కూడా విదేశీ శక్తుల ద్వారా ఏవిధంగానూ ప్రభావితం కాకూడదన్న ఉద్దేశంతో ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ చట్టం ద్వారా ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి విదేశీ విరాళాలను నిషేధించడం జరిగింది. దీని ప్రకారం జడ్డిలు, జర్నలిస్టులు (కాలమిస్టులు, కార్టూనిస్టులు, న్యూస్ ప్రింటర్లు & పబ్లిషర్లు), ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు (పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవారు, ఎన్నికల్లో గెలిచినవారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు) విదేశీ నిధులు పొందడం నిషేధం.
(ఇంగ్లండుకి చెందిన వేదాంతా గ్రూప్ మన దేశంలో ప్రధాన పార్టీలకు దాదాపు 30 కోట్ల రూపాయల ధన సహాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి)

విద్య, వైద్య, సామాజిక, ఆర్ధిక, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక, మతపరమైన విభాగాల్లో పనిచేస్తూ విదేశీ నిధులు పొందాలనుకునే సంస్థలు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద కేంద్ర హోంశాఖ నుండి ప్రత్యేక లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

2014 ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్ర ఇంటెలిజెన్స్ భారత ప్రభుత్వానికి ఒక కీలక నివేదిక సమర్పించింది. “భారతదేశ అభివృద్ధి, ఆర్ధిక ప్రగతిపై కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల దుష్ప్రభావం” పేరిట రూపొందించిన ఆ నివేదికలో విదేశీ నిధులు పొందుతున్న పలు సంస్థల కార్యకలాపాల కారణంగా దేశ అభివృద్ధి 2-3 శాతం వెనుకబడినట్టు నిర్ధారించింది. దీని వెనుక అంతర్జాతీయ దాతల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించింది.

2014లో నూతనంగా ఎన్డీయే హయాంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, విదేశీ విరాళాలు పొందుతూ, ఉల్లంఘనలకు పాల్పడుతున్న కొన్ని వేల ‘స్వచ్ఛంద సంస్థల’ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సులు రద్దు అయ్యాయి. అందులో ముఖ్యమైనవి గ్రీన్ పీస్ ఇండియా, కంపాషన్ ఇండియా ఇంటర్నేషనల్ లతోపాటు  ‘ప్రముఖ సామాజికవేత్త’ తీస్తా సెతల్వాద్ కి చెందిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్  పీస్ అనే సంస్థలు ఉన్నాయి. అసలు వాటి లైసెన్సులు రద్దు కావడానికి కారణాలు ఏమిటి అనేవి తెలుసుకుంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నియమాలు మనకు సులభంగా అర్ధమవుతాయి.

విద్య, సామజిక సేవ, ఆర్ధిక సహకారం, మహిళా సాధికారత, బాలబాలిక సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ మొదలైన కార్యకలాపాలు చేపట్టే సంస్థలకు విదేశీ విరాళాలు సేకరించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అయితే ఈ సంస్థలు తాము ఎంచుకున్న నిర్దిష్టమైన ప్రాజెక్ట్ కోసం మాత్రమే ఈ విదేశీ ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిర్ధేశించుకున్న ప్రాజెక్ట్ కాకుండా మరి ఏ ఇతర కార్యక్రమం కోసం వీటిని ఖర్చు చేసినా  అది ఉల్లంఘన క్రిందకు వస్తుంది. అంతే కాకుండా ఈ చట్టం ప్రకారం విదేశీ ధనం పొందే సంస్థలు రాజకీయ అంశాలు, మతమార్పిడులతో పాటు దేశీయ చట్టాలకు వ్యతిరేకమైన, దేశ ప్రగతికి భంగకరంగా ఉన్న కార్యకలాపాల్లో పాల్గొనరాదు.

బాలల సంరక్షణ పేరిట మతమార్పిళ్లకు పాల్పడుతున్న కారణంగా కంపేషన్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ  లైసెన్స్ రద్దు చేయడంతో దాని తాలూకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి తనకు తానుగా భారత్ నుండి నిష్క్రమించింది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదు.
ఇక భారత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకారులను ఎగదోస్తున్న కారణంగా చెన్నైకి చెందిన గ్రీన్ పీస్ ఇండియా లైసెన్సు రద్దు చేసింది.

అంతే కాకుండా ప్రతి ఏడాది తమకు వస్తున్న విదేశీ విరాళాలు ప్రకటించని (రిటర్న్ దాఖలుచేయని) కొన్ని వేల సంస్థల లైసెన్సులు కూడా 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. అందులో క్రైస్తవ సంస్థలే అత్యధికం కావడం గమనార్హం.

విదేశీ నిధులు పొందే సంస్థల సభ్యులు అందరూ కూడా, తాము గతంలో ఎలాంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని, ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ శిక్ష అనుభవించలేదు అని డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం 2019లో ఈ చట్టానికి స్వల్ప సవరణలు చేసింది.

తాజాగా మరిన్ని కీలక సవరణలతో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇటీవలే పార్లమెంటులో ఆమోదం పొందింది.

Source:
www.lawbharat.wordpress.com
www.opindia.com