Home Uncategorized మధుర- పవిత్ర శ్రీకృష్ణ జన్మభూమి 

మధుర- పవిత్ర శ్రీకృష్ణ జన్మభూమి 

0
SHARE

 —ప్రదక్షిణ 

 శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచవ్యాప్త హిందువులందరికీ ఆరాధ్యుడు, ఇష్టదైవం; దశావతారాలలో ఆయన పూర్ణావతారం, భగవద్గీత బోధించిన జగద్గురువు. ఇప్పటికి శుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి నాడు మథురా నగరం కారాగారంలో జన్మించాడు. శ్రీమద్భాగవతము ఆసాంతం శ్రీకృష్ణావతార అద్వితీయ లీలలే. 

 శ్రీకృష్ణ జన్మస్థానం నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురా నగరం; ఈ నగరానికి సమీపంలోనే, యమునాతీరంలో గోకులం, గోవర్ధన పర్వతం, బృందావనం ఉన్నాయి. పవిత్ర గోకులాష్టమి రోజున గోవింద భజనతో, రంగురంగుల హోళీ క్రీడలతో, ఈ ప్రదేశం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.  

 అయితే మధురానగరిలో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఒకప్పుడు వైభవంగా ఉన్న శ్రీ కేశవనాథ దేవాలయం పరిస్థితి ఏమిటి? స్వతంత్ర భారతంలో కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎందుకు విముక్తి కలగట్లేదు? ముస్లిం సుల్తానులు ఈ దేశంలో ఎన్నో దేవాలయాలకు పట్టించిన దుస్థితినే, మధురలోనూ పునరావృతం చేసారు.  అయోధ్య రామజన్మభూమిలో మందిరంపై బాబ్రీ కట్టడాన్ని నిర్మించినట్లేముస్లిం దురాక్రమణదారులు కృష్ణజన్మభూమిలో దేవాలయంపై ఈద్గా నిర్మించారు. ఇదే సంఘటన కాశీలోను పునరావృతమయ్యింది. మిగతా చాలా దేవాలయాలు కూల్చినట్లుగానే, మొఘల్ సుల్తాన్  ఔరంగజేబు శ్రీకృష్ణ జన్మస్థాన దేవాలయాన్ని కూడా కూల్చేసాడు. ఈ దేవాలయ పూర్వ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో హృదయవిదారక సంగతులు బయటపడతాయి. 

శ్రీకృష్ణజన్మభూమి కేసు పూర్వాపరాలు 

శ్రీకృష్ణజన్మభూమిని తిరిగి పొందాలనే హిందువుల చిరకాల ఆకాంక్షతో, మథుర న్యాయస్థానంలో కేసు దాఖలైంది.  క్రిందటి సంవత్సరం సెప్టెంబర్ 2020లో, లాయర్ శ్రీమతి రంజనా అగ్నిహోత్రి బాలకృష్ణుడి పేరుమీద ‘భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్’ తరపున మధుర సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసి,  శ్రీకృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్- కేశవదేవ్ దేవాలయానికి మరియు మూలవిరాట్టు బాలకృష్ణుడికి, సంబంధించిన భూమిని, మసీద్ ఈద్గా ట్రస్ట్ ఆక్రమించి దానిపై ఎదో కట్టడాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఆపి, ఈద్గా తొలగించాలని విజ్ఞ్యప్తి చేసారు. అయితే న్యాయమూర్తి శ్రీమతి ఛాయా శర్మ `ప్రార్థనా మత స్థలాల చట్టం’, 1991, సెక్షన్ 4(1)ప్రకారం, `15 ఆగస్ట్  1947లో ఏయే మతస్థలాలు ఏ ప్రకారంగా ఉన్నాయో, అవి యధాతధంగా కొనసాగాలని’ చెప్తూ  కేసుని తోసిపుచ్చారు.  

 అయితే మరుసటి నెల, అక్టోబర్2020లో మధుర జిల్లా కోర్టు ఇదే కేసును తిరిగి స్వీకరించింది. కేసు అర్జీదారు భారత రాజ్యాంగం, అధికరణ 25 ప్రకారం, ఎవరికైనా తమ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు ఉందని, కాబట్టి భగవంతుడి- బాలకృష్ణుడి కొల్లగొట్టిన ఆస్థులను తిరిగి రాబట్టుకుని, వాటిని స్వతంత్రంగా సక్రమంగా నిర్వహించుకునే హక్కు భక్తులకి ఉంటుందని వాదించారు. అలాగే మొత్తం 13.37ఎకరాల స్థలం శ్రీకృష్ణజన్మభూమి ట్రస్ట్ కి అప్పగించాలని కేసులో విజ్ఞ్యప్తి చేసారు. అంతేకాక,  శ్రీకృష్ణ జన్మభూమిలోని `ఈద్గా కట్టడం’ 1947సమయంలోది కాదని,  1968లో `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’కు, ఈద్గా కమిటీకి మధ్య జరిగిన అక్రమ ఒప్పందం తరువాత, ప్రస్తుతం ఉన్న ఈద్గా మసీదు కట్టబడిందని, ఇది శ్రీకృష్ణ జన్మస్థానం స్థలాన్ని పూర్తిగా అక్రమిస్తోందని కోర్టుకి చెప్పారు. కాబట్టి, `ప్రార్థనా మత స్థలాల చట్టం’, 1991ని ఇది అతిక్రమించదని, అర్జీదారులు న్యాయస్థానానికి తెలియచేసారు. జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సాధనా ఠాకూర్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది.    

 ఇటీవల జూన్ 2021లో `శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి’ తరపున  మథుర కోర్టులో లాయర్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇంకొక కేసు దాఖలు చేసారు. శ్రీకృష్ణ జన్మభుమిలోని షాహి ఈద్గాలోని కట్టడాన్ని  కూల్చడానికి మసీద్ ట్రస్ట్ ఒప్పుకుంటే, ఆ భూమి కన్నా ఎన్నోరెట్లు పెద్దదైన భూమి, దానికి బదులుగా ఇచ్చేస్తామని కేసు వేసారు. మొఘల్ సుల్తాన్ ఔరంగజేబు శ్రీకేశవ కృష్ణజన్మస్థాన దేవాలయాన్ని 1669-70లో కూల్చేసి, గుడికి సంబంధించిన శిలలతోనే మసీదు నిర్మించారని తెలియచేస్తూ, వాటి ఆనవాళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయని చెప్పారు. నవంబర్2019 సుప్రీమ్ కోర్టులో జరిగిన అయోధ్య  శ్రీరామజన్మభూమి కేసును, ఈ విధమైన పరిష్కారానికి ఉదాహరణగా చూపించారు. కావాలంటే తవ్వకాలు జరిపి నిజనిర్ధారణ జరిపించవచ్చని కూడా అర్జీదారులు తమ వాదనలు వినిపించారు.    

 వివాదాస్పదమైన శ్రీకృష్ణజన్మభూమి దేవాలయ అసలు చరిత్ర ఏమిటి?  

 మధురలోని షాహీ ఈద్గా పూర్తిగా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి, దానిపైనే కట్టినట్లు అప్పటి ఫోటో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ భారత పురాతత్వ పరిశోధన సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) నోటీస్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. దానిపై `శ్రీకృష్ణ జన్మభూమి అని స్పష్టంగా వ్రాసి ఉంటుంది. దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించిన స్థలమని హిందువుల విశ్వాసం అని కూడా ఆ బోర్డ్ పై వ్రాసి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ దివ్యమైన దేవాలయం ఉండేదిసా.శ. 1618లో ఓర్చా రాజైన రాజా వీర్ సింగ్ బుందేలా ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణానికి అప్పట్లోనే 33లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అప్పట్లో రూపాయికి 296 కిలోల బియ్యం వచ్చేవంటే 33లక్షల రూపాయల విలువ ఎంతో అంచనా వేసుకోవచ్చును 

 ఔరంగజేబ్ ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని 1670లో ధ్వంసం చేసి ఆ శిధిలాలపైనే షాహీ ఈద్గా కట్టించాడు. 1804లో మథుర బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్థలాన్ని వేలం వేసినప్పుడు బెనారస్ కు చెందిన సంపన్నుడు `రాజా పత్నీమల్’ రూ.45లక్షలకు ఆ భూమిని సొంతం చేసుకున్నాడు. ఈ భూమిపై తమకు హక్కులు  ఉన్నాయంటూ 1935లో ముస్లిములు కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్ట్ అది `రాజా పత్నీమల్’ వారసులకు మాత్రమే చెందుతుందని తీర్పు చెప్పింది. అయినా ముస్లింలు అక్కడ శ్రీకృష్ణ దేవాలయాన్ని తిరిగి కట్టనివ్వమని అడ్డుపడ్డకేసు గెలిచినా, పత్నీమల్ వారసులు అనేకసార్లు ప్రయత్నించినా అక్కడ శ్రీకృష్ణ దేవాలయాన్ని కట్టలేకపోయారు.  1947 తరువాత బిర్లాలు ఆ స్థలాన్ని కొనుగోలు చేసి `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’ ను ఏర్పాటుచేశారు.   1968లో  `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’కు, ఈద్గా కమిటీకి మధ్య జరిగిన విచిత్రమైన ఒప్పందంలో శ్రీకృష్ణదేవాలయాన్ని ధ్వంసం చేసికట్టిన కట్టిన ఈద్గాను ఒప్పుకుంటున్నట్లు `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’ అంగీకారం తెలిపింది. దానితో అప్పటివరకూ ఎలాంటి గుర్తింపు లేని ఈద్గాకు చట్టపరమైన గుర్తింపు వచ్చింది. మరిన్ని వివరాలకు హన్స్ బాకర్ వ్రాసిన `The History of Sacred Places in India’ (1990)అనే పుస్తకం చదవండి. 

పవిత్ర శ్రీకృష్ణ జన్మభూమి తీర్పు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎటువైపు వెళుతుందో వేచి చూడాలి. హిందువుల చిరకాలవాంఛ ఎప్పటికి నెరవేరుతుందో మరి!