ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌నాథ్ దేవస్థానం వెలుపల పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తజాపై ప్రవచనకారుడు జకీర్ నాయక్ ప్రభావం ఉందనే దిగ్భ్రాంతికరమైన వాస్తవం ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో రెచ్చగొట్టే విధంగా జకీర్ నాయక్ చేసిన ప్రసంగాల తాలూకు ఆడియోలు, వీడియోలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. అంతేకాక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన వీడియోలు, సాహిత్యాన్ని ముర్తజా అహ్మద్ ల్యాప్‌టాప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిందితుడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నయా అనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.
గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ దేవస్థానం వెలుపల ఆదివారం సాయంత్రం ఇద్దరు పోలీసులపై ఒక పదునైన ఆయుధంతో 29 సంవత్సరాల ముర్తజా దాడి చేశాడు. మతపరమైన నినాదాలు చేస్తూ దేవస్థానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణందారులు, భద్రతా సిబ్బంది అత్యంత చాకచక్యంగా ముర్తజాను అదుపులోకి తీసుకున్నారు.
దాడికి పాల్పడిన ముర్తజా ముంబైలో ప్రతిష్టాత్మక ఐఐటీ నుంచి 2015 సంవత్సరంలో పట్టభద్రుడయ్యాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి ఒక ల్యాప్‌టాప్‌ను, ఫోన్‌ను, ఒక టికెట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి, భద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు.
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు అహ్మద్ ముర్తజా ముంబైకి సమీపంలోని నవీ ముంబైకి చెందినవాడని తేలింది. దీంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం ముంబైకి చేరుకుంది. అహ్మద్ ముర్తజా వెనుక ఎవరెవరున్నారు ఉన్నారనే కోణంలో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.